నాగర్‌కర్నూల్: ఎస్‌ఎల్‌బిసి ప్రమాద ఘటనలో ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ అభినందించారు. ఆదివారం ఈ ఘటనపై ఆయన సిఎం రేవంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. ప్రమాద వివరాలను, బాధితులను రక్షించేందుకు చేపట్టిన చర్యలను ఆయన సిఎంని ఫోన్లో అడిగి తెలుసుకున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు ఇరువురి మధ్య ఫోన్ సంభాషణ నడిచింది. ఘటన జరిగిన వెంటనే మంత్రి ఉత్తమ్ ఘటనాస్థలికి వెళ్లారని రాహుల్‌కు రేవంత్ తెలిపారు. ఎస్‌డిఆర్ఎఫ్, ఎన్‌డిఆర్ఎఫ్ బృందాలతో సహాయక చర్యలు చేపట్టామని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు రేవంత్ రాహుల్‌కు వివరించారు.
అమ్రాబాద్ మండలం, దోమలపెంట వద్ద నిర్మాణంలో ఉన్న శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్‌ఎల్‌బిసి) టన్నెల్ నిర్మాణంలో శనివారం ఉదయం అపశృతి చోటు చేసుకన్న విషయం తెలిసిందే. టన్నెల్ బోరింగ్ సమయంలో 9మీటర్ల మేర పైకప్పు కూలింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు శిధిలాల కింద చిక్కుకున్నారు. వీరిని రక్షించేందుకు సహాయక చర్యల్లో 24 మంది ఆర్మీ సిబ్బంది, 130 మంది ఎన్‌డిఆర్ఎఫ్ 24 మంది హైడ్రా బృందం, 24 మందితో కూడిన సింగరేణి కాలరీస్ రెస్క్యూ టీమ్, 120 ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.