న్యూఢిల్లీ: ఢిల్లీ సార్వత్రిక ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని చిత్తు చేసి భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దాదాపు 26 ఏళ్ల తర్వాత దేశ రాజధానిలో కాషాయ పార్టీ విజయం సాధించగా.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం చేశారు. కాగా, ఆమెను ధీటుగా ఎదురుకునేందుకు ప్రతిపక్ష నాయకురాలి బాధ్యతలను ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ సిఎం అతిశీ సింగ్‌కు అప్పగించింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రివాల్, మనీశ్ సిసోడియా తదితర సీనియర్ నేతలు అంతా ఓటమిపాలైనప్పటికీ.. అతిశీ మాత్రం కల్కాజీ నియోజకవర్గంలో విజయం సాధించారు. ఆదివారం జరిగిన పార్టీ శాసనపక్ష సమావేశంలో ఆప్ ఎమ్మెల్యేలు అతిశీని ప్రతిపక్ష నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా అతిశీ నిలిచారు.
ఈ సందర్భంగా అతిశీ మీడియాతో మాట్లాడతూ.. ప్రజలు తమకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారని.. ప్రజా తీర్పును గౌరవిస్తామని అన్నారు. ప్రతిపక్ష పార్టీగా అధికార బీజేపీ వైఫల్యాలను ఎండగడతామని ఆమె పేర్కొన్నారు. కాగా, సోమవారం నుంచి ఢిల్లీ అసెంబ్లీ తొలి సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో గెలిచిన ఎమ్మెల్యేలతో స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు.