Monday, February 24, 2025

తెలంగాణ ఎండోమెంట్ భూములు వేరే రాష్ట్రాల్లో…?

- Advertisement -
- Advertisement -

4 రాష్ట్రాల్లో సుమారుగా 6 వేల ఎకరాల భూములు
దేవాదాయ శాఖ రికార్డుల్లో నమోదు
త్వరలో ఆయా భూముల్లో సోలార్ ఫలకలు
ఆలయాల భూముల రక్షణ కోసం దేవాదాయ శాఖ పకడ్భందీ చర్యలు
భూములకు జియోట్యాగింగ్, టాస్క్‌ఫోర్స్ టీంల ఏర్పాటు

మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధితో పాటు వాటి పరిధిలోని భూముల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. ఆలయ భూముల పరిరక్షణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేయడంతోపాటు జియోట్యా గింగ్ చేపడుతోంది. అయితే, భూములు తిరిగి స్వాధీనం చేసుకునే క్రమంలో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతుండటంతో దేవాదాయ శాఖ టాస్క్‌ఫోర్స్ టీమ్‌లను ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దీనిపై ఆ శాఖ అధికారులు పలు దఫాలుగా చర్చలు జరిపారు.

అందులో 25 వేల ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. మరో 6 వేల ఎకరాలు ఇతర రాష్ట్రాల పరిధిలోఉన్నాయి. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో భూములు యథేచ్ఛగా ఆక్రమణకు గురయ్యాయి. ఇందులో భాగంగానే భూములను జియో ట్యాగింగ్ చేస్తూనే మరోవైపు టాస్క్ ఫోర్స్ టీమ్‌లను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రతి జిల్లాకు టాస్క్ ఫోర్స్ టీమ్‌లను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రస్థాయిలో భూములపై అవగాహన ఉన్నవారితో టాస్క్‌ఫోర్స్ టీమ్‌లను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రంలో, జిల్లాలో రెండు వేర్వేరుగా ఈ టీమ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
ఎపి, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల పరిధిలో తెలంగాణ ఎండోమెంట్ భూములు

ఇప్పటికే మనరాష్ట్రంతో పాటు వేరే రాష్ట్రాల్లోనూ తెలంగాణ దేవాదాయ శాఖకు చెందిన భూములు భారీగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆలయాల పరిధిలో మొత్తం 91,827 ఎకరాల భూమి ఉండగా, అందులో 25 వేల ఎకరాల భూమి కబ్జాకు గురైనట్లు దేవాదాయ శాఖ గుర్తించింది. మరో 6 వేల ఎకరాలు ఇతర రాష్ట్రాల పరిధిలో ఉన్నట్లుగా ఆ శాఖ అధికారులు నివేదిక రూపొందించారు. ఎపి, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల పరిధిలో తెలంగాణ దేవాదాయ శాఖకు సంబంధించిన 6 వేల ఎకరాల భూములు ఉన్నట్లు ఎండోమెంట్ రికార్డుల్లో నమోదయ్యింది. ఈ 6 వేల ఎకరాల్లోనూ 3 వేల ఎకరాలకు పైగా భూములు మఠాలకు సంబంధించినవని. భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయానికి 1,052.07 ఎకరాల భూమి ఉంది.

ఈ భూములు ఎపిలోని గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఉన్నాయని దేవాదాయ శాఖ అధికారులు గుర్తించారు. జనగామ జిల్లా లింగాల ఘన్‌పూర్‌లోని రామచంద్రస్వామి ఆలయానికి 12.19 ఎకరాల భూమి ఉండగా అది ఎపిలోని గుంటూరు జిల్లా వట్టి చెరుకు మండలం కొర్నెపాడు గ్రామంలో ఉన్నట్లు ఎండోమెంట్ రికార్డుల్లో ఉంది. వరంగల్ పరిధిలోని రంగశాయిపేట సీతారామచంద్రస్వామి ఆలయానికి 8 ఎకరాల భూమి ఉండగా ఆ భూమి ఎపిలోని కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో ఉన్నట్లు తేలింది. మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ బాల బ్రహ్మేశ్వరస్వామి అన్నదాన సత్రానికి 20.17 ఎకరాలు ఉండగా ఆ భూములు ఎపిలోని కర్నూల్ జిల్లా జి.సింగవరం పరిధి కల్లూరు గ్రామంలో ఉన్నట్లుగా దేవాదాయ శాఖ రికార్డుల్లో నమోదయ్యింది.

సీతారాంభాగ్ సీతారామచంద్రస్వామి భూములు మహారాష్ట్ర, రాజస్థాన్‌లలో…

నారాయణపేట జిల్లా నేరేడ్గం మండలం మగనూరులోని సిద్ధిలింగేశ్వరస్వామి ఆలయానికి 1,137 ఎకరాల దేవాదాయ భూమి ఉండగా ఆ భూమి కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఆదిలాబాద్ శ్రీరామచంద్ర గోపాల కృష్ణమఠానికి మెుత్తం 1,280.38 ఎకరాల భూమి ఉండగా ఆ భూమి మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లా ఖేలాపూర్ తాలుకా గోష్మి గ్రామంలో ఉన్నట్లు రికార్డుల్లో నమోదయ్యింది. హైదరాబాద్ ఆసిఫ్‌నగర్ మల్లేపల్లిలోని సీతారాంభాగ్ సీతారామచంద్రస్వామి ఆలయానికి 2,492.17 ఎకరాల దేవాదాయ భూమి ఉండగా అది కూడా మహారాష్ట్రలోని అమరావతి, రాజస్థాన్ రాష్ట్రం పుష్కర్లో ఉన్నట్టు రికార్డుల్లో గుర్తించారు. నాలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఎండోమెంట్‌కు 6,018 వేల ఎకరాల భూమి ఉండగా, ఒక్క మహారాష్ట్రలోనే 3,709.55 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత కర్ణాటకలో 1,137 ఎకరాలు, ఎపిలో 1,092.43 ఎకరాల భూమి ఉన్నట్లు తేలింది.

సరిహద్దులు, నక్షలు లేవు…

అయితే ఈ భూములకు సరైన సరిహద్దులు, నక్ష వంటివి లేవు. దీంతో చాలా వరకు అన్యాక్రాంతం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ భూములను ఎలా స్వాధీనం చేసుకోవాలన్న దానిపై ప్రభుత్వం సందిగ్ధంలో పడింది. ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవటమా..? లేక అమ్మకానికి పెట్టి వచ్చిన ఆదాయంతో తెలంగాణలోని ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్చలు జరగుతున్నాయి.

ఒకవేళ అమ్మకానికి ఇబ్బందులు ఏర్పడితే వాటికి రక్షణ గోడలు ఏర్పాటు చేసి, ఫెన్సింగ్ వేయాలని దేవాదాయ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆయా భూములకు సంబంధించి ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేయడంతో పాటు జియోట్యా గింగ్ చేయాలని దేవాదాయ శాఖ నిర్ణయించినట్టుగా సమాచారం. దీంతోపాటు ఆయా భూముల్లో సోలార్ ఫలకలను ఏర్పాటు చేసి వాటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను విక్రయించి వచ్చిన సొమ్ముతో ఆలయాలను అభివృద్ధి చేయాలని దేవాదాయ శాఖ భావిస్తున్నట్టుగా తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News