సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ వినోదాత్మక చిత్రాలకి పేరొందిన శ్రీదేవి మూవీస్ పతాకంపై మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన పూర్తి నిడివి హాస్య చిత్రం ‘సారంగపాణి జాతకం’ వేసవి సెలవుల్లో నవ్వులు పంచడానికి సిద్ధంగా ఉంది. ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటించిన ఈ చిత్రం నుండి ఇటీవల విడుదలైన టైటిల్ సాంగ్ ‘సారంగో సారంగా’, ‘సంచారి సంచారీ’ పాటలు ట్రెండ్ అవుతుండగా, టీజర్‌లోని మాటలు, హాస్య సన్నివేశాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ విజయాల తర్వాత భారీ అంచనాల మధ్య మోహనకృష్ణ ఇంద్రగంటి, శ్రీదేవి మూవీస్ కలయికలో మూడో చిత్రంగా విడుదలవ్వనున్న ‘సారంగపాణి జాతకం’ గురించి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. “వేసవి సెలవుల్లో కుటుంబమంతా కలిసి వెళ్ళి చూసే పరిపూర్ణ హాస్యరస చిత్రం మా ‘సారంగపాణి జాతకం’. మా దర్శకులు మోహనకృష్ణ ఇంద్రగంటి అద్భుతంగా తీశారు. ఆద్యంతం కట్టిపడేస్తూనే, వచ్చే ఎండలకి సాంత్వనలా అందరినీ అలరిస్తుందీ సినిమా” అని అన్నారు.