వాషింగ్టన్ : డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే యుఎస్ ఎయిడ్ (యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్) సాయాన్ని 90 రోజుల పాటు నిలిపివేశారు. ట్రంప్ ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుపై సంతకం చేశారు. తాజాగా ఆ సంస్థకు చెందిన 1600 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం అర్ధరాత్రి ప్రాంతంలో ఈ వివరాలను యుఎస్ ఎయిడ్ వెబ్‌సైట్ ద్వారా వెల్లడించింది. అత్యవసర సిబ్బంది మినహా యుఎస్ ఎయిడ్ తరఫున విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అందరూ పెయిడ్ లీవ్‌పై ఉన్నట్లు సంస్థ ప్రకటించింది.
ఉద్యోగుల సంఖ్యను కుదించే క్రమంలో 1600 మందిని ఇంటికి పంపించినట్లు సంస్థ తెలియజేసింది. ఫెడరల్ ప్రభుత్వ పరిమాణాన్ని కుదించాలన్న విస్తృత ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆరు దశాబ్దాలుగా ఉనికిలో ఉన్న యుఎస్ ఎయిడ్‌పై చర్య తీసుకోవాలన్నది తమ లక్షమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వ్యయ నియంత్రణ మిత్రుడు ఎలాన్ మస్క్ చెబుతూ వస్తున్నారు. దానికి తగినట్లుగానే తాజాగా ఆ ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. యుఎస్ ఎయిడ్ ఉద్యోగులపై ట్రంప్ వేటు వేస్తారని ఊహాగానాలు వినిపించాయి.
దీనితో ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు ఈ విషయమై కోర్టుకు ఎక్కాయి. అయితే, శుక్రవారం కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది. ప్రభుత్వ ప్రణాళికను తాత్కాలికంగా అడ్డుకొని తమను ఉద్యోగాల్లో కొనసాగించాలని కోరుతున్న ఉద్యోగుల పిటిషన్‌ను యుఎస్ జిల్లా జడ్జి కార్ల్ నికోల్స్ తిరస్కరించారు. ఈ క్రమంలోనే ఉద్యోగులను తొలగిస్తూ ఆదివారం రాత్రి ఉత్వర్వులు వెలువడ్డాయి. ఈ విషయమై వ్యాఖ్యానించవలసిందని కోరుతూ పంపిన సందేశాలకు యుఎస్ ఎయిడ్, యుఎస్ విదేశాంగ శాఖ నుంచి వెంటనే ఎటువంటి స్పందనలూ రాలేదు.