Tuesday, February 25, 2025

వెస్ట్‌బ్యాంక్‌పై పట్టు బిగిస్తున్న ఇజ్రాయెల్

- Advertisement -
- Advertisement -

జెనిన్ ( వెస్ట్‌బ్యాంక్): ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోకి దశాబ్దాల తరువాత ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు ఆదివారం మొట్టమొదటిసారి ప్రవేశించాయి. వెస్ట్‌బ్యాంక్‌లో తమ దళాలు ఒక ఏడాది పాటు ఉంటాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ప్రకటించిన తరువాత ఇది “ప్రమాదకరమైన దూకుడు”గా పాలస్తీనా అధికారవర్గాలు ధ్వజమెత్తుతున్నాయి. ఇజ్రాయెల్‌పై సాయుధ పోరుకు కేంద్ర స్థానంగా ఉన్న జెనిన్ లోకి ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులను పంపించింది. దశాబ్దాల క్రితం ఇజ్రాయెల్ దాడుల్లో సొంత ప్రాంతాలను వదిలిన శరణార్థుల వారసులే ఈ శిబిరాల్లో ఉంటున్నారు. గాజాలో హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్న ఇజ్రాయెల్ ఇప్పుడిక వెస్ట్‌బ్యాంక్ పై దృష్టి కేంద్రీకరించింది.

కాల్పుల విరమణ ఒప్పందం అమలు లోకి వచ్చిన రెండు రోజుల్లో భారీగా సైన్యాన్ని అక్కడికి తరలించింది. శరణార్ధులుగా మారిన పాలస్తీనియన్లను తిరిగి వెస్ట్‌బ్యాంక్‌లోకి అడుగుపెట్టకుండా చేయడమే లక్షంగా చేపట్టిన ఈ ఆపరేషన్ విస్తరిస్తోంది. వెస్ట్‌బ్యాంక్ నుంచి తమపై దాడులు పెరుగుతున్నందున ఈ ప్రాంతం నుంచి మిలిటెన్సీని రూపుమాపడమే లక్షమని ఇజ్రాయెల్ చెబుతోంది.న అయితే ఇక్కడున్న 30 లక్షల మందిని సైనిక పాలన కిందికి తేవడమే ఇజ్రాయెల్ లక్షమని పాలస్తీనియన్లు ఆరోపిస్తున్నారు. ఇజ్రాయెల్ ఆర్మీ చేపట్టిన దాడుల కారణంగా పట్టణ ప్రాంతాల్లో తీవ్ర విధ్వంసం జరుగుతోందని, వేలాది మందికి నిలువ నీడ కూడా లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే 40 వేల మంది పాలస్తీనియన్లు జెనిన్ వంటి పట్టణ ప్రాంత శరణార్థి శిబిరాలను ఖాళీ చేసి వెళ్లిపోయారని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ తెలిపారు. దీంతో అక్కడ కనీసం ఏడాదిపాటు ఉండేలా ఏర్పాట్లు చేయాలని మిలటరీకి ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. పాలస్తీనియన్లను తిరిగి అక్కడికి రానిచ్చేది లేదని, ఉగ్రవాదాన్ని పెరగనివ్వబోమని చెప్పారు. అయితే ఎంతకాలం పాలస్తీనియన్లను అడ్డుకుంటారో ఆయన స్పష్టం చేయలేదు. గాజాలో ఇజ్రాయెల్‌హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో వెస్ట్‌బ్యాంక్‌లో హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఇజ్రాయెల్ కూడా ఈ ప్రాంతంపై పదేపదే దాడులకు పాల్పడింది. ఇక్కడ కనీసం 800 మంది చనిపోయారు.

వీరిలో ఎక్కువ మంది మిలిటెంట్లేనని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. అయితే గాజాతోపాటు లెబనాన్ లోనూ యుద్ధం జరుగుతున్నందున సంకీర్ణ పక్షాల నుంచి వచ్చిన ఒత్తిడుల కారణంగా ప్రధాని నెతన్యాహు వెస్ట్‌బ్యాంకులో మిలిటెన్సీ అణచివేత చర్యలను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నప్పటికీ, ఇప్పుడు వెస్ట్‌బ్యాంకుపై పట్టు సాధించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. 1967లో జరిగిన యుద్ధంలో వెస్ట్‌బ్యాంక్, గాజా, తూర్పు జెరూసలెంను ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. ఈ మూడు ప్రాంతాలను కలిపి స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేయాలని పాలస్తీనియన్లు చిరకాలంగా కాంక్షిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News