Tuesday, February 25, 2025

ఆ ముగ్గురూ అభివృద్ధి నిరోధకులు

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రగతికి అడ్డం పడుతున్న కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపి ఈటల రాజేందర్
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిఆర్‌ఎస్ నేతలతో కేంద్ర మంత్రుల కుమ్మక్కు
అమెరికాలో నక్కిన ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావులను
రప్పిస్తే దోషులను జైలుకు
పంపుతా మూసీ
ప్రక్షాళన, మెట్రో విస్తరణ
ముందుకు సాగకుండా
కిషన్‌రెడ్డి కుట్రలు : సిఎం
రేవంత్‌రెడ్డి

మెట్రో విస్తరణ ప్రాజెక్టు కేంద్ర కేబినెట్‌లో ఎందుకు ఆమోదం పొందడం లేదో కిషన్‌రెడ్డి చెప్పాలి. కేంద్రకేబినెట్ ఆమోదిస్తే రుణాలు తెచ్చి మెట్రో విస్తరణను చేపట్టగలం. ఈ అంశాన్ని కేబినెట్‌లో పెట్టకుండా సహచర మంత్రులను బెదిరిస్తున్నది కిషన్‌రెడ్డి కాదా? కేబినెట్‌లోని పలువురు మంత్రులు నా దోస్తులే. హైదరాబాద్ అభివృద్ధికి సహకరించాలని మాకున్నా.. కిషన్‌రెడ్డి అడ్డుకుంటున్నారని వారు నాకు స్వయంగా చెప్పారు.

మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుకు కూడా కేంద్రం అనుమతి ఇవ్వడం లేదు. గంగా, యమునా, సబర్మతి నదుల ప్రక్షాళనను చేపట్టిన బిజెపి మూసీ ప్రక్షాళనకు అడ్డం పడడం వెనుక కిషన్‌రెడ్డి హస్తం లేదా? ఇదేనా కిషన్‌రెడ్డి నీతి? ట్రిపుల్ ఆర్‌ను అడ్డుకుంటున్నది మీ ఈటల రాజేందరే. ఫోన్ ట్యాపింగ్ నిందితులు అమెరికాలో నక్కినా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎందుకు రప్పించడం లేదు?

నిజామాబాద్ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

మన తెలంగాణ/నిజామాబాద్ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బిజెపి, బిఆర్‌ఎస్ కుట్రలు చేస్తున్నాయని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. సోమవారం నిజామాబాద్ పట్టణంలో పార్టీ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి తలమానికంగా ఉండే అనేక ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావాలని అడ్డు పడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే దుర్బుద్ధితో ఆయా కేంద్ర శాఖల మంత్రులకు చెప్పి ప్రాజెక్ట్‌లు ముందుకు వెళ్లకుండా చూస్తున్నారని ఆరోపించారు. మెట్రో, మూసీ, రీజనల్ రింగ్ డ్ లాంటి ప్రాజెక్ట్ ఇందులో ఉన్నాయన్నారు. 2021లో కులగణన, జనగణన ఎందుకు చేయలేదో బండి సంజయ్, కిషన్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలి అనిప్రశ్నించారు. తాము ఏడాదిలోనే కులగణన పూర్తి చేశామని, వందేళ్లుగా కొనసాగుతున్న సమస్యకు పరిష్కారం చూపామన్నారు. తమ లెక్కలు తప్పని, బిజెపి, బిఆర్‌ఎస్ అర్థం లేని మాటలు మాట్లాడుతున్నాయని విమర్శించారు. ఫామ్‌హౌస్‌కే పరిమితమైన కెసిఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎంఎల్‌సి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దని చెబుతున్న బిఆర్‌ఎస్ నాయకులు మీ అభ్యర్థి ఎవరో చెప్పాలని ఎద్దేవా చేశారు. మండలి ఎన్నికల్లో గులాబీ దళానికి అభ్యర్థి కూడా దిక్కు లేకుండా పోయాడని విమర్శించారు.

బిఆర్‌ఎస్ త్వరలో కనిపించకుండా పోతుందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి బడ్జెట్‌లో తెలంగాణ ప్రజలకు సున్నా నిధులు కేటాయించిందని, ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలో 55,163 ఉద్యోగాలను భర్తీ చేశామని రేవంత్ గుర్తు చేశారు. యంగ్ ఇండియా స్పోర్ట్ కార్యక్రమాన్ని నెలకొల్పి యువతను మెరుగైన క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నామని వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన బాక్సర్ నిఖత్ జరీనాకు డిఎస్‌పి పోస్టు ఇచ్చి గౌరవించామని, క్రికెటర్ సిరాజుద్దీన్‌కు కూడా గ్రూప్1 క్యాడర్ ఉద్యోగమిచ్చామని గుర్తు చేశారు. ఇవన్నీ పట్టభద్రులు ఆలోచించాలన్నారు. టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కెసిఆర్ అరెస్టు కాకుండా బిజెపి అడ్డుపడుతోందని, వారికి రక్షణ ఉండాలని చూస్తోందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు వాడుకుని గత ఎన్నికల్లో బిజెపి లబ్ధిపొందిందని దుయ్యబట్టారు. బిజెపి నేతల బ్లాక్‌మెయిల్‌కు లొంగిపోయిన బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎసి ఎన్నికలో అభ్యర్థిని పోటీలోకి దింపలేదని, పరోక్షంగా ఈ ఎన్నికలో బిజెపికి ఓట్లు వేయాలంటూ గులాబీ నేతలు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులను అరెస్టు చేసి తాము జైళ్లకు పంపితే, ఇటీవల వాళ్లంతా బెయిల్ తీసుకొని బయటికి వచ్చారని, కానీ అసలు నిందితులు ప్రభాకర్‌రావు, శ్రావణ్ విదేశాల్లో దాక్కున్నారన్నారు. వారిపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసి అమెరికా నుంచి తీసుకురావాలని తాము కేంద్ర ప్రభుత్వానికి సిఫార్స్ చేశామని, కానీ ఈ విషయంలో మోడీ సర్కార్ కాలయాపన చేస్తోందన్నారు. ఆ రెడ్ కార్నర్ నోటీస్‌లను అడ్డం పెట్టుకొని కెటిఆర్, హరీశ్‌రావులను పిలిచి బేరం పెట్టారని, అందుకే జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ‘కెటిఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేస్తలేమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అడుగుతుండు..

ఆయనే హోం సహాయ మంత్రి కదా.. ఒక్కసారి ప్రభాకర్, శ్రావణ్‌లను ఇండియాకు రప్పి స్తే 24 గంటల్లో కెసిఆర్, కెటిఆర్, హరీశ్‌లను లోపలేస్తాం’ అని అన్నారు. అంతెందుకు.. గొర్రెల స్కామ్ కారు రేస్ కేసుల్లో తాము కేసులు నమోదు చేసి దొంగల భరతం పట్టబోతే ఇడి వచ్చి కాగితాలు తీసుకెళ్లిందని, వాళ్ళను ఇడి ఎందుకు అరెస్ట్ చేయలేకపోతోందో బండి సంజయ్ చెప్పాలని సవాల్ చేశారు. అభివృద్ధి పనులకు నిధులు అడుగుతున్నామని బుకాయిస్తూ ఢిల్లీ వెళ్తున్న కెటిఆర్, హరీశ్ అక్కడికి వెళ్లి రాయబారాలు చేసుకుంటున్నారని, తెలంగాణలో తమ ప్రభుత్వం ఉంటే వాళ్ళు వెళ్లి ఏమి అడుగుతారని ఎద్దేవా చేశారు. కెసిఆర్ సిఎం ఉండగా ఎంతమంది పార్టీ ఫిరాయించలేదో బిఆర్‌ఎస్ ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. ‘పార్టీ నుంచి జంప్ చేసిన సబిత, శ్రీనివాస్‌యాదవ్ మంత్రులే అయ్యారు.. కదా మరి అప్పుడు రాని ఉప ఎన్నికలు ఎప్పుడు ఎలా వస్తాయి’ అని అన్నారు. ఎంఎల్‌ఎసి ఎన్నికల్లో కనీసం అభ్యర్థి నిలబెట్టే చేతగాని బిఆర్‌ఎస్ నేతలు ఉప ఎన్నికలొస్తే తడాఖా చూపిస్తామని ఎలా అంటారని అంటూ మండిపడ్డారు.నోటిఫికేషన్ ఇచ్చినట్టే ఇచ్చి వాళ్లే కోర్టులకు వెళ్లారన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీధర్‌బాబు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంఎల్‌ఎలు సుదర్శన్ రెడ్డి, భూపతిరెడ్డి, మదన్ మోహన్‌రావు, నాగరాజు పాల్గొన్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్‌కు వర్సిటీ తీసుకువస్తాం

మన తెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి: రాష్ట్ర ప్రయోజనాల కోసం రూ. 2.25 లక్షల విదేశీ పెట్టుబడులను తీసుకువచ్చామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో పదేండ్లలో బిఆర్‌ఎస్, బిజెపి చేసింది శూన్యమని, ఏడాదిలోనే 56 వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర తమ ప్రభుత్వానిదని అన్నారు. ఎంఎల్‌సి ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో సోమవారం బహిరంగ సభ నిర్వహించారు. మొ దటి ప్రాధాన్యత ఓటు నరేందర్‌రెడ్డికి వేయాలని పట్టభద్రులను అభ్యర్థించారు. మోడీ తెలంగాణలో ఇద్దరికి ఉద్యోగాలు ఇచ్చారని..వారు బండి సంజయ్, కిషన్‌రెడ్డి అని ఎద్దేవా చేశారు. ఎంపి స్థానాల్లో బిఆర్‌ఎస్ డిపాజిట్లు కో ల్పోయినచోట ఆ స్థానాల్లో బిజెపి ఎలా గెలిచిందని ప్రశ్నించారు. రైతులు వరి వేస్తే ఉరి అన్న కెసిఆర్, నేడు రైతులు సన్న వడ్లు పండిస్తే తాము బోనస్ ఇస్తున్నామని అన్నారు. రైతులు 1,56 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం వరి పండించారని తెలిపారు. రైతులకు రైతు బంధు మార్చి 31 వరకు అందరికీ ఇస్తామని అన్నారు. ప్రస్తుతం మూడెకరాల వరకు రైతులకు రైతు బంధు అందించామని అన్నా రు. ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసేందుకు సోలార్ ప్రాజెక్టులు వారికే కేటాంచామని తెలిపారు. ఆర్‌టిసి 600 బస్సులను మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేసి ఆర్‌టిసికి అప్పగించామని అన్నారు.

ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు ముఖ్యమంత్రి వరాలు ప్రకటించారు. పట్టభద్రుల ఎంఎల్‌సిగా నరేందర్‌రెడ్డిని గెలిపిస్తే ఆదిలాబాద్‌కు యూనివర్సిటీని తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించిన విషయం నిజం కాదని అనుకుంటే మీరు ఓటు ఎవరికైనా వేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి దండె విఠల్, మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి, ఖానాపూర్, భూపాలపల్లి ఎంఎల్‌ఎలు కొక్కిరాల ప్రేంసాగర్‌రావ్, గడ్డం వివేక్, గడ్డం వినోద్, వెడ్మ బోజ్జు, గండ్ర సత్యనారాయణ, మాజీ ఎంఎల్‌సి పురాణం సతీష్, పార్టీ నియోజక వర్గాల ఇన్‌ఛార్జీలు ఆత్రం సుగుణ, విష్టుప్రసాద్, శ్యాంనాయక్, జనక్‌ప్రసాద్, కంది శ్రీనివాస్, రవళి తదితరులు పాల్గొన్నారు.
రెండుసార్లు గెలిచి సంజయ్ ఏంచేశారు?

మన తెలంగాణ/ఉమ్మడి కరీంనగర్ బ్యూరో : ఎంఎల్‌సి ఎన్నికల్లో బిఆర్‌ఎస్, బిజెపిది చీకటి ఒప్పందం అని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. సోమవారం ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీ గ్రౌండ్‌లో పట్టభద్రుల నియోజకవర్గ సంకల్ప సభ నిర్వహించారు. ఈ సందర్బంగా సిఎం మాట్లాడుతూ.. ఎంఎల్‌సి ఎన్నికల్లో కాంగ్రెస్‌ని ఓడించాలని బిఆర్‌ఎస్ ప్రచారం చేస్తోందన్నారు. అసలు ఆ పార్టీ అభ్యర్థి ఎవరో గులాబీ నాయకులు చెప్పాలన్నారు. హరీశ్ రావు, కవిత, కెటిఆర్ ఎవరికి ఓటు వేస్తారు..ఎవరికి మద్దతు ఇస్తారో తెలపాలని డిమాండ్ చేశారు. బిఆర్‌ఎస్ బిజెపి చీకటి ఒప్పందాల భాగంగానే కాంగ్రెస్‌పై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘కరీంనగర్ నుండి పొన్నం ఒక్కసారి ఎంపిగా గెలిస్తే తెలంగాణ తెచ్చిండు, ఇదే కరీంనగర్ నుండి రెండు సార్లు ఎంపిగా గెలిచిన కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ ఎంచేశారు’ అని ప్రశ్నించారు.

కరీంనగర్‌కి నిధులు తెచ్చా..హైదరాబాద్‌కి మెట్రో తెచ్చారా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం బిసి లకు న్యాయం చేయడానికి రాజ్యాంగ సవరణ చేయండి అని అడగడం లేదు..మైనార్టీలని బిసిల్లో ఎందుకు కలిపారని సంజయ్ అడుగుతు న్నారని మండిపడ్డారు. ‘1979లో మండల్ కమిషనర్లను బిసిలో చేర్చిందని, కనీసం నీ పక్కన ఉన్న ఐఏఎస్‌లని అడిగి తెలుసుకో సంజయ్’ అని సూచించారు. బిజెపి పాలిస్తున్న గుజరాత్‌లో 39 ఉప కులా లు, మహా రాష్ట్రలో 26 ఉప కులాలు బిసి రిజర్వేషన్ అనుభవిస్తున్నాయని అన్నారు. ఈ విషయాన్ని మోడీనే స్వయంగా చెప్పిన వీడియో కా వాలంటే సంజయ్‌కి పంపిస్తా చూస్కో అని తెలిపారు. అసెంబ్లీలో అన్ని లెక్కలు తేలుస్తా , కావాలంటే కిషన్ రెడ్డి వచ్చి వినొచ్చు అని అన్నా రు. ‘35 వేల మంది టీచర్ల బదిలీలు, 22 వేల మంది టీచర్ల ప్రమోషన్లు ఏడాదిలో చేసింది నిజమైతే కాంగ్రెస్‌కు ఓటు ్ల ఓటు వేయండి’ అని కోరారు. టెట్ నిర్వహించి 11 వేల మంది నియామకపత్రాలు ఇచ్చింది నిజమైతే కాంగ్రెస్‌కు ఓటు వేయండి, ప్రతి నెల ఒకటో తారీఖున మీ జీతాలు పడితేనే ఓటు వేయండి, గతంలో మీ జీతాలను కూడా మీరు అడుక్కునే పరిస్థితి కల్పించింది కెసిఆర్ కాదా? అని మీరు గ్రహించావాలి’ అని కోరారు.
మందకృష్ణను కౌగిలించుకున్నారు కానీ…
‘మంద కృష్ణను కౌగిలించుకున్న మోదీ ఎస్‌సి ఉపకులాల వర్గీకరణ చేయలేదని అన్నారు. కానీ మీ రేవంతన్న ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అమలు చేసేందుకు చర్యలు తీసుకుండు’ అన్నారు. ఈ బహిరంగ సభలో పిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, ప్రభాకర్, సీతక్క, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News