భారతీయ భాషలతో పాటుగా ఇంగ్లీష్‌లోనూ సమాంతరంగా టాక్సిక్ సినిమాను షూట్ చేస్తున్నారు. ఇలా ఇంగ్లీష్‌లో చిత్రీకరిస్తున్న మొట్టమొదటి భారతీయ చిత్రంగా టాక్సిక్ రికార్డుల్లోకి ఎక్కింది. రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, మలయాళంతో సహా పలు భారతీయ, అంతర్జాతీయ భాషల్లోకి డబ్ కానుంది. ఈ ప్రాజెక్టుకి అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో సమాంతరంగా ఈ చిత్రాన్ని షూట్ చేస్తుండటంతో చిత్ర నిర్మాతల నిబద్ధత ప్రతిబింబిస్తుంది.
ప్రాంతీయ భాషకు వారు ప్రాధాన్యం ఇస్తూనే.. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీని రిలీజ్ చేయాలన్న ఉద్దేశాన్ని ఇలా చెప్పకనే చెప్పేశారు. గీతూ మోహన్‌దాస్ మాట్లాడుతూ “విభిన్న భాషా, సాంస్కృతిక నేపథ్యాలలో రాబోతోన్న టాక్సిక్ మూవీని అన్ని భాషల, ప్రాంతాల ప్రేక్షకులు ఆస్వాదించేలా రూపొందిస్తున్నాం. అందుకే కన్నడ, ఆంగ్ల భాషల్లో తెరకెక్కిస్తున్నాం.
మా ఈ చిత్రం అన్ని సరిహద్దుల్ని చెరిపివేస్తుందని భావిస్తున్నాం. అన్ని భాషల, సాంస్కృతిక ప్రపంచాన్ని కలిపేలా మా చిత్రం ఉంటుంది”అని అన్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్, యష్ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్‌పై వెంకట్ నారాయణ సంయుక్తంగా నిర్మించిన టాక్సిక్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. రాకింగ్ స్టార్ యష్ పుట్టినరోజున సందర్భంగా రిలీజ్ చేసిన ‘టాక్సిక్’ టీజర్ ఎన్నో రికార్డుల్ని సృష్టించింది. టాక్సిక్ ప్రపంచాన్ని ఆ టీజర్ అందరికీ పరిచయం చేసింది.