Tuesday, February 25, 2025

ఊబకాయంపై కేంద్రం ఉద్యమం

- Advertisement -
- Advertisement -

దేశంలో ఊబకాయం తీవ్ర సమస్యగా మారుతోందని, దీన్ని అధిగమించడానికి చర్యలు చేపట్టాలని ఆదివారం జరిగిన మన్‌కీ బాత్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు ఇవ్వడం శుభపరిణామం. ఈ మేరకు ఊబకాయంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు 10 మంది ప్రముఖులను కూడా నామినేట్ చేశారు. వీరిలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తదితరులు ఉన్నారు. ఈ ఉద్యమం మరింత విస్తరించేలా వీరంతా ఒక్కొక్కరు 10 మంది చొప్పున వ్యక్తులను నామినేట్ చేయవలసి ఉంటుంది. 2022లో ప్రపంచ ఆరోగ్యసంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నారు.

ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు. అనేక సమస్యలకు దారి తీసే ఊబకాయాన్ని అధిగమించడం మనందరి బాధ్యతగా ప్రధాని మోడీ గుర్తు చేశారు. తినే ఆహారంలో వంటనూనె వాడకాన్ని కనీసం పది శాతం మేరకు తగ్గించుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి ప్రారంభంలో ఉత్తరాఖండ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఊబకాయం గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ఫిజికల్ యాక్టివిటీని ప్రోత్సహించే విధంగా ఫిట్ ఇండియా ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు.

పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటూ అందుకు తగ్గట్టు వ్యాయామం చేయాలని సూచించారు. అన్నింటికన్నా ముఖ్యం నూనెల వినియోగాన్ని 10% వరకు తగ్గించుకోవాలని ప్రత్యేకంగా సూచించడం గమనార్హం. లాన్సెట్ నివేదిక ప్రకారం దేశంలోని పట్టణాల జనాభాలో దాదాపు 70% మంది అత్యధిక శరీర బరువుతో బాధపడుతున్నారు. ఊబకాయం బాధితులు ఎక్కువగా ఉన్న దేశాల్లో అమెరికా, చైనా తరువాత స్థానం భారత్‌దే. దాదాపు 8 కోట్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. వీరిలో మహిళలు 4.4 కోట్ల మంది ఉండగా, పురుషులు 2.6 కోట్ల మంది ఉన్నారు.

చాలా మంది మహిళలు ఇంటిపనుల కారణంగా తమ ఆహారం గురించి, ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదు. దీంతో వాళ్లు ఊబకాయం బారినపడుతున్నారు. ఇది క్రమంగా మధుమేహం, రక్తపోటు తదితర దీర్ఘకాలిక రోగాలకు దారి తీస్తోంది. లాన్సెట్ నివేదిక ప్రకారం 1990లో 0.4 మిలియన్లతో పోలిస్తే 2022లో భారత దేశంలో 5 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసు పిల్లల్లో ఊబకాయం దాదాపు 12.5 మిలియన్ల వరకు పెరిగిందని వెల్లడైంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్)లో దేశం లోని 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఐదేళ్ల లోపు పిల్లల్లో ఊబకాయం సమస్య తీవ్రంగా ఉందని తేలింది. మహారాష్ట్ర, గుజరాత్, త్రిపుర, లక్షద్వీప్, జమ్మూకశ్మీర్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, బెంగాల్, ఆంధ్రప్రదేశ్, లద్దాఖ్‌లో ఐదేళ్ల లోపు పిల్లల్లో అధిక బరువు ఉన్నవారి సంఖ్య పెరిగింది.

201516లో చేపట్టిన కుటుంబ సర్వే ప్రకారం అధిక బరువు ఉన్న చిన్నారులు 2.1% నుంచి 3.4 శాతానికి చేరుకున్నారు. 2016లో 519 సంవత్సరాల వయసు గల 340 మిలియన్ల మంది పిల్లలు, యుక్తవయసులో ఉన్నవారు ఊబకాయంతో ఉండగా, 2020లో 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న 39 మిలియన్ల మంది పిల్లలు ఉన్నారు. దేశవ్యాప్తంగా కేవలం చిన్నారుల్లోనే కాదు, మహిళలు, పురుషుల్లోనూ ఊబకాయం పెరిగిపోతోంది. మహిళల్లో 20.6% నుంచి 24 శాతానికి, పురుషుల్లో 18.9 శాతం నుంచి 22.9 శాతానికి చేరింది. చిన్నారులు సహా పెద్దవారి లోనూ ఊబకాయం పెరిగిపోవడానికి శారీరక శ్రమ తగ్గిపోవడం, ఆహార పద్ధతులే కారణంగా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

గత 15 ఏళ్లుగా స్థిరమైన ఆర్థిక వృద్ధి కారణంగా ప్రజల ఆదాయాలు పెరిగాయి. ఆర్థికంగా ఎదగడమే భారతీయుల్లో ఊబకాయం పెరగడానికి కారణమని అభిప్రాయపడుతున్నా, ఆహార అలవాట్లు సరిగ్గాలేకపోవడం, జింక్ ఫుడ్స్ వంటివి ఎక్కువగా తీసుకోవడం మరో ప్రధాన సమస్యగా వైద్యులు పేర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం బాడీ మాస్ ఇండెక్స్ (బిఎంఐ) 25 దాటితే అధిక బరువుతో ఉన్నట్టే. బిఎంఐ 30 దాటితే అత్యంత అధిక బరువు. అదే ఊబకాయంగా పరిగణిస్తారు. శరీరంలో కొవ్వు ఎంత పెరిగితే, ఇన్సులిన్ చర్యకు అంత అడ్డంకి ఏర్పడుతుంది. ముఖ్యంగా పొత్తికడుపు, కాలేయం, పాంక్రియాస్‌లో కొవ్వు పేరుకుపోయినప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తికి ఆటంకం కలుగుతుంది.

భారతీయుల్లో కాలేయం, ప్యాంక్రియాస్‌లో కొవ్వు నిల్వలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఊబకాయం వల్లనే భారతదేశంలో కార్డియో వాస్కులర్ డిసీజ్, టైప్2 డయాబెటిస్, కీళ్ల సమస్యలు, స్లీప్ అప్నియా, కొన్ని క్యాన్సర్లు, శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మానసిక ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. దేశ జనాభా ప్రయోజనాలను పొందాలంటే, ఆరోగ్య పారామితులను మెరుగుపర్చడానికి అనారోగ్యకరమైన ఆహార విధానాలను, పెరుగుతున్న ఊబకాయ రేట్లను తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని 202324 ఆర్థిక సర్వే పేర్కొంది.

గత సంవత్సరం ఏప్రిల్‌లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి (ఐసిఎంఆర్) తాజా ఆహార మార్గదర్శకాలను జారీ చేసింది. దేశంలో మొత్తం వ్యాధుల భారంలో 56.4% అనారోగ్యకరమైన ఆహారాల వల్లనే దాపురిస్తోందని పేర్కొంది. చక్కెరలు, కొవ్వుతో నిండిన, అధికంగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగం అమాంతంగా పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేసింది. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం, ఆహార విధానాలను మార్చుకోవడం ద్వారా ఊబకాయం సమస్య నుంచి బయటపడవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News