ప్రజలు ఎదుర్కొంటున్న పర్యావరణ సమస్యలకు, వాతావరణ మార్పులకు శిలాజ ఇంధనాల వినియోగమే చాలా వరకు కారణం. సాంప్రదాయ ఇంధన వనరుల స్థానంలో క్లీన్ ఎనర్జీని ఉపయోగించడమే పర్యావరణ సంబంధిత సమస్యలకు విరుగుడు. వాతావరణ మార్పులపై ప్రపంచ దేశాలు బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తున్నాయని చెప్పడానికి శిలాజ ఇంధనాల వాడకాన్ని కనీస స్థాయికి తగ్గించకపోవడమే ఒక ఉదాహరణ. అడవులను నరికివేయడం, పచ్చదనం పెంచడానికి సరైన ప్రణాళికలు రూపొందించి ఆచరించకపోవడం, పట్టణీకరణపై మక్కువ, చూపడం, వాయు కాలుష్యం పెరగడం వంటి ఎన్నో కారణాలు భవిష్యత్‌లో సంభవించబోయే విపత్కర పరిణామాలను సూచిస్తున్నాయి.
ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు మూలం శిలాజ ఇంధనాల వాడకం. సౌరశక్తి వాడకంపై దృష్టి సారించకుండా శిలాజ ఇంధనాల వినియోగం అధికం చేయాలనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వితండవాదం పర్యావరణానికి పెద్దదెబ్బ. ఇప్పుడిప్పుడే ‘క్లీన్ ఎనర్జీ’పై దృష్టి సారిస్తున్న ప్రపంచానికి ట్రంప్ నిర్ణయం ఆందోళన కలిగిస్తున్నది. ట్రంప్ బాధ్యతారాహిత్యానికి ప్రపంచం మూల్యం చెల్లించుకోకతప్పదు. పెరుగుతున్న భూ ఉష్ణోగ్రతలను 2 డిగ్రీల సెల్సియన్ దిగువ స్థాయికి తగ్గించడం, సగటు ఉష్ణోగ్రతల్లో పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కి పరిమితి చేయాలన్న ఆలోచనతో పారిస్ ఒప్పందం కుదిరింది.
ఐక్యరాజ్య సమితిలోని మెజారిటీ సభ్యదేశాలు వాతావరణ మార్పులపై ఆందోళన చెంది, గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించి, ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఆమోదించిన ఒప్పందాన్ని అంగీకరించడం జరిగింది. పారిస్ ఒప్పందం 2016 వ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది. గతంలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా అధికారంలో ఉన్నప్పుడు పారిస్ ఒప్పందం నుండి వైదొలగడం జరిగింది. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో అమెరికా తిరిగి పారిస్ ఒప్పందంలో చేరింది. ట్రంప్ ఈ సంవత్సరం అధికారంలోకి వచ్చాక తిరిగి పాత పాటే పాడుతూ పారిస్ ఒప్పందం నుండి తప్పుకున్నారు.
తమ దేశ అవసరాలకు ఖనిజ ఇంధనాన్ని వాడుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రపంచానికి దశాదిశా నిర్దేశం చేయవలసిన అమెరికా తన తొందరపాటు నిర్ణయాలతో ప్రపంచాన్ని సాంప్రదాయేతర ఇంధనాల వనరుల వాడకం నుంచి శిలాజ ఇంధనాల వాడకంపై తిరిగి దృష్టి సారించేలా నిర్ణయాలు తీసుకోవడంలో ఎలాంటి ఔచిత్యం లేదు. ఇప్పటికే మన చుట్టూ ఉన్న వాతావరణం పరిమితికి మించిన హానికరమైన వాయువులతో నిండిపోయింది. ప్రజలు వాయు కాలుష్యంతో, శ్వాసకోశ సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నారు. శిలాజ ఇంధనాల వాడకం అతి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తున్నది.
బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు మొదలైనవి శిలాజ ఇంధనాలు. భారత దేశంలో బొగ్గు తర్వాత ప్రధాన ఇంధన వనరు పెట్రోలియం. పెట్రోలియం అనే పదం పెట్రా, ఓలియం అనే లాటిన్ పదాల నుండి ఏర్పడింది. పెట్రోలియం అనగా రాతి నూనె అని అర్ధం. శిలాజ ఇంధనాలు చెట్లు, జంతువుల అవశేషాల నుండి ఏర్పడతాయి. బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు వంటి శిలాజ ఇంధనాలను వినియోగించిన తర్వాత తిరిగి భర్తీ కావడానికి లక్షల సంవత్సరాల కాలం పట్టవచ్చు. ఇవి తరిగేపోయే శక్తి వనరులు. చైనా శిలాజ ఇంధనాల వినియోగంలో ప్రపంచంలోనే అత్యధిక శాతం వాటా కలిగి ఉంది.
అమెరికా కూడా చైనాతో సమానంగా ఫోసిల్ ఫ్యూయల్ వినియోగిస్తున్నది. ఈ విషయంలో భారతదేశం ప్రపంచంలో మూడవ స్థానం లో ఉంది. కాలుష్యకారకంగా భావిస్తున్న చమురు వినియోగంలో భారత్ చైనా స్థానాన్ని అధిగమించబోతుందనే అంచనాలున్నాయి. బొగ్గు వినియోగంలో భారత్ ఇప్పటికే యూరప్, ఉత్తర అమెరికా దేశాలను అధిగమించింది. భారత దేశం గ్రీన్ ఎనర్జీపై దృష్టి సారించాలని నిర్ణయించినా దీనికి తగ్గ కార్యాచరణ పూర్తి స్థాయిలో ఆచరణకు నోచుకోలేదు. ప్రపంచ ఇంధన వినియోగంలో 80 % పైగా చమురు, బొగ్గు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. చైనా, అమెరికా, భారత్‌ల తర్వాత శిలాజ ఇంధనాల వినియోగంలో రష్యా, జపాన్, ఇరాన్, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా, ఇండోనేషియా, కెనడా, యుకెలు పోటాపోటీగా ముందుకు సాగుతున్నాయి.
పెరుగుతున్న పారిశ్రామీకరణ, అర్బనైజేషన్, వ్యవసాయ రంగంలో విస్తరిస్తున్న రసాయనిక మందుల వాడకం, వ్యవసాయ వ్యర్ధాల దహనం వలన వాయు కాలుష్యం విపరీతంగా పెరిగి పోతున్నది.కార్బన్ డయాక్సైడ్,మిథేన్,నైట్రస్ ఆక్సైడ్ వంటి వాయువులను గ్రీన్ హౌస్ వాయువులంటారు. ఈ వాయువుల వలన భూవాతావరణం వేడెక్కి అనేక సమస్యలకు కారణమవుతున్న మాట సత్యదూరం కాదు. అధిక ఉష్ణోగ్రతలకు కారణమవుతూ, వాతావరణం ఆకస్మిక మార్పులకు లోనుకావడం వంటి పరిణామాలను గుర్తించాలి. పెరిగిపోతున్న గ్రీన్ హౌస్ వాయువుల శాతాన్ని తగ్గించి, గ్లోబల్ వార్మింగ్ విషయంలో ప్రపంచ దేశాలు దృష్టి సారించాలి.
సహజ ఇంధన వనరుల స్థానంలో చౌకగా లభించే ప్రత్యామ్నాయ ఇంధనాలను వినియోగించాలి. శిలాజ ఇంధన వనరుల లభ్యత ఆందోళన కరమైన స్థితికి చేరుకుంటున్న నేపథ్యంలో భవిష్య పరిణామాలను ఆకళింపు చేసుకుని సాంప్రదాయేతర ఇంధన వనరుల వాడకాన్ని పెంచాలి. పైగా ప్రస్తుతం మనం వినియోగిస్తున్న ఇంధనాల వలన ప్రపంచంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్నది. బొగ్గు వలన అధికంగా కాలుష్యం వెలువడుతున్నది. అమెరికా విద్యుత్ ఉత్పత్తిలో 44 శాతం బొగ్గును వినియోగిస్తున్నారు. బొగ్గు వలన కర్బన ఉద్గారాలు అధికం మొత్తంలో విడుదల కాబడి, గ్లోబర్ వార్మింగ్ పెరుగుదలకు కారణం కావడం ఆందోళనకరం.
విచ్చలవిడిగా ఇంధన వనరులను ఉపయోగిస్తూ ప్రపంచాన్ని ముందుకు తీసుకుపోతున్నామని భ్రమించినవారికి తరిగిపోతున్న ఇంధన వనరులను చూసి, భవిష్యత్ అవసరాలపై ఆందోళన అవసరం లేదా? ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే సాంప్రదాయేతర ఇంధన వనరుల వాడకంపై అవగాహన పెరుగుతున్నది. దశాబ్దకాలం ముందు ప్రపంచం మేల్కొన్ని ఉంటే ప్రస్తుతం నెలకొంటున్న అవాంఛనీయ పరిణామాలకు ఆస్కారం ఉండేది కాదు. పర్యావరణ సంబంధిత సమస్యలే కాకుండా తరిగిపోతున్న సాంప్రదాయ ఇంధన నిక్షేపాలను కాపాడుకుని ఉండేవారం.
– సుంకపల్లి సత్తిరాజు