అమరావతి: అసెంబ్లీలో వైసిసి సభ్యులు గొడవ చేశారని.. వాళ్లు చేసిన గొడవకు తాము క్షమాపణ చెప్తున్నామని ఎపి ఉప ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ అన్నారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. గొడవలకు, బూతులకు వైసిపి సభ్యులు కేరాఫ్ అడ్రస్ అయ్యారని పవన్ దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు అని ఆయన ఎద్దేవా చేశారు.
న్యాయమూర్తులపైనే వైసిపి నేతలు అసభ్యకరమైన పోస్టులు పెట్టారని అన్నారు. ప్రజలు బుద్ధి చెప్పినా.. వైసిపి నేతల్లో ఇంకా మార్పు లేదని పేర్కొన్నారు. వైసిపి హయాంలో అభివృద్ధి కుంటుపడిందని.. అంతేకాక అడ్డగోలుగా దోపిడి చేశారని మండిపడ్డారు. 77 ఎకరాల అటవీ భూమిని పెద్దిరెడ్డి కబ్జా చేశారని ఆరోపించారు. గ్రామీణ నిధులను గత ప్రభుత్వం పక్కదారి పట్టించిందని.. అలాంటి ప్రభుత్వం మళ్లీ వస్తే.. పరిస్థితేంటి అని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రుల సెంటిమెంట్ అని.. దాని ప్రైవేటీకరణను ఆపామని పవన్ గుర్తు చేశారు.