Wednesday, February 26, 2025

ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల్లో రభస..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం రణరంగాన్ని తలపించాయి. లిక్కర్ కుంభకోణానికి సంబంధించి కాగ్ నివేదికపై అధికార బీజేపీ, ప్రతిపక్ష ఆప్ నేతల మధ్య నిరసనలు హోరెత్తాయి. చివరకు ప్రతిపక్ష ఆప్ నేత ఆతిషీతోపాటు 12 మంది ఎమ్‌ఎల్‌ఎలపై సస్పెన్షన్ వేటు పడింది. గత ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానంపై కాగ్ నివేదిక అంశం ఎన్నికల ముందు పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నివేదికను తాజాగా బీజేపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. 202122 లో తీసుకొచ్చిన మద్యం విధానం కారణంగా ఢిల్లీ ప్రభుత్వానికి రూ. 2000 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు కాగ్ తేల్చింది. నిపుణుల అభిప్రాయాలు తీసుకోకపోవడం, ఫిర్యాదులు వచ్చినా బిడ్డింగును అనుమతించడం, ఉల్లంఘనలకు జరిమానా వేయకపోవడం, విధానాల రూపకల్పనలో పారదర్శకత లేకపోవడం వంటివి చోటు చేసుకున్నాయని కాగ్ దర్యాప్తులో తేల్చింది.

కొత్త మద్యం విధానం కారణంగా అప్పటి ప్రభుత్వం రూ. 941.53 కోట్ల ఆదాయం కోల్పోయిందని నివేదికలో పేర్కొంది. ఇకలైసెన్సు ఫీజుల కింద మరో రూ. 890.15 కోట్ల నష్టపోయినట్టు తెలిపింది. లైసెన్సుదారులకు మినహాయింపులు రూపంలో మరో రూ.144 కోట్లు కోల్పోయినట్టు వెల్లడించింది. మరోవైపు మంగళవారం శాసనసభాకార్యకలాపాల నుంచి ఆప్ ఎమ్‌ఎల్‌ఎలను స్పీకర్ సస్పెండ్ చేశారు. సిఎం కార్యాలయం నుంచి బీఆర్ అంబేద్కర్, భగత్‌సింగ్ ఫోటోలు తొలగించారంటూ ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రసంగించారు. ఆయన మాట్లాడుతుండగా, ఆప్ నేతలు నిరసనలు చేపట్టారు. దీంతో స్పీకర్ విజేందర్ గుప్తా వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు. మాజీ సిఎం , ప్రతిపక్ష నేత ఆతిశీ సహా 12 మంది విపక్ష ఎమ్‌ఎల్‌ఎలను ఒకరోజంతా అసెంబ్లీకి రాకుండా సస్పెండ్ చేస్తున్నట్టు సభాపతి వెల్లడించారు. మద్యం కుంభకోణంపై కాగ్ ఇచ్చిన నివేదికపై ప్రజల దృష్టిని మరల్చేందుకు ఆ పార్టీ నిరసనలకు పాల్పడుతోందని అధికార పార్టీ ఆరోపించింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో మహాత్మా గాంధీ , అంబేద్కర్, భగత్‌సింగ్ రాష్ట్రపతి ప్రధాన మంత్రుల చిత్రపటాలు ఉన్నాయని పేర్కొంటూ ఇప్పటికే ఓ ఫోటోను విడుదల చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News