కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ సూట్‌కేసులో ఓ మృతదేహన్ని ముక్కలు చేసి ఇద్దరు మహిళలు నదిలో పారేస్తూ పోలీసులకు దొరికిపోయారు. వివరాల్లోకి వెళితే.. అహిరిటోలా ఘాట్ వద్ద ఇద్దరు మహిళలు సూట్‌కేసులో మనిషి శరీర భాగాలు తీసుకువచ్చి.. హుగ్లీ నదిలో కలిపే ప్రయత్నం చేశారు.
అయితే వారి చేతిలోని సూట్‌కేసు ఉండటం, కదలికలు అనుమానస్పదంగా ఉండటం గమనించిన స్థానికులు వారిని ప్రశ్నించారు. దాంతో వారు సూట్‌కేసులో శునకం అవశేషాలు ఉన్నాయని బుకాయించారు. కానీ, స్థానికులు అనుమానంతో తెరిచి చూడగా.. అందులో మనిషి శరీర భాగాలు కనిపించాయి. దీంతో వెంటనే వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనస్థలికి పోలీసులు చేరుకొని మహిళలను అదుపులోకి తీసుకున్నారు. శరీర భాగాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై విచారణ జరుపుతున్నామని.. మరిన్ని వివరాలను త్వరలో తెలియజేస్తామని పోలీసులు తెలిపారు.