Wednesday, February 26, 2025

ఏ తల్లీ తన పుత్రుని కొట్టదు

- Advertisement -
- Advertisement -

ముంబయి : తన ఏడు సంవత్సరాల కుమారునిపై దౌర్జన్యం చేసినందుకు తన భాగస్వామితో పాటు అరెస్టయిన 28 ఏళ్ల మహిలకు బొంబాయి హైకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేస్తూ ఏ తల్లీ సొంత కుమారుని కొట్టదని స్పష్టం చేసింది. ఫిర్యాదీ అయిన తండ్రికి, నిందితురాలైన తల్లికి మధ్య వివాహ సంబంధిత వివాదం ఉన్నదని, ఆ వివాదం కారణంగా బాలుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని, బలిపశువుగా మారాడని హైకోర్టు న్యాయమూర్తి మిళింద్ జాదవ్‌తో కూడిన ఏక సభ్య ధర్మాసనం అభిప్రాయం వెలిబుచ్చింది. బాలుడు మూర్చ వ్యాధితో బాధపడుతున్నట్లు, అతనికి పోషకాహార లోపం, రక్తహీనత ఉన్నట్లు అతని వైద్య నివేదికలు సూచిస్తున్నాయని కోర్టు తెలిపింది.

నిందితురాలైన తల్లి బాలుని పట్ల శ్రద్ధ వహిస్తున్నదని, అతనికి అండగా ఉంటున్నదని వివిధ వైద్య నివేదికలు సూచిస్తున్నట్లు కోర్టు తెలియజేసింది. ఆ మహిళను 2023 అక్టోబర్‌లో అరెస్టు చేశారు. ఆమె అప్పటి నుంచి కస్టడీలో ఉంటున్నది. మైనర్ బాలుని తండ్రి ఫిర్యాదు దృష్టా ముంబయిలో ఒక ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. తనకు దూరంగా ఉంటున్న భార్య, ఆమె భాగస్వామి అనేకసార్లు బాలునిపై భౌతిక దాడులకు పాల్పడ్డారని, ఒకసారి అతనిని చంపే యత్నం కూడా చేశారని అతను ఆరోపించాడు. ముంబయిలోని దహిసార్ పోలీసుల వద్ద దాఖలైన ఫిర్యాదులో మహిళ భాగస్వామి బాలునిపై లైంగిక దాడి చేసినట్లు కూడా ఆరోపించారు. అయితే, హైకోర్టు ప్రాథమికంగా ఆ ఆరోపణలు అన్నీ నమ్మదగినవి కావని పేర్కొన్నది.

‘ఏ తల్లి అయినా తన సొంత పిల్లవాడిని కొడుతుందని భావించజాలం’ అని హైకోర్టు ఆ మహిళకు రూ. 15 వేల వ్యక్తిగత బాండ్‌పై బెయిల్ మంజూరు చేస్తూ వ్యాఖ్యానించింది. కేసులో నిందితురాలకి అరెస్టు కారణాలపై సమాచారానికి సంబంధించిన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని తప్పనిసరి నిబంధనలను పోలీసులు పాటించలేదని కూడా కోర్టు తెలియజేసింది. ఫిర్యాదు ప్రకారం, తన తల్లిదండ్రులు 2019లో విడిపోయిన తరువాత బాలుడు మహారాష్ట్ర రత్నగిరిలో తన తండ్రి దగ్గర నివసిస్తున్నాడు. అయితే, 2023లో ఆ మహిళ వచ్చి బలవంతంగా ఆ బాలుని ముంబయికి తీసుకువెళ్లింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News