చెన్నై : జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ)లో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడుకేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో భాషా యుద్ధం చేసేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉందని తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె .స్టాలిన్ స్పష్టం చేశారు. సెక్రటేరియెట్‌లో మంగళవారం కేబినెట్ సమావేశం తరువాత ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చించేందుకు మార్చి 5న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నామని చెప్పారు.
దేశ ప్రధాన లక్షమైన జనాభా నియంత్రణ అమలులో తమిళనాడు విజయం సాధించిందని, అయితే తక్కువ జనాభా ఉండటం వల్ల లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో పార్లమెంట్‌లో సీట్లు తగ్గే అవకాశం ఉందన్నారు.ఒకవేళ సీట్లు తగ్గితే 39 కాకుండా 31 మంది ఎంపీలు మాత్రమే ఉంటారని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్‌లో నమోదు చేసుకున్న రాజకీయ పారీలన్నిటినీ అఖిల పక్ష సమావేశానికి ఆహ్వానిస్తామని, రాజకీయ విభేదాలను అధిగమించడానికి ఐక్యతగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య వివాదాస్పదంగా తయారైన త్రిభాషా విధానంపై అఖిలపక్ష సమావేశంలో చర్చిస్తారా
అన్న ప్రశ్నకు జాతీయ విద్యావిధానం (ఎన్‌ఇపి), కేంద్ర ప్రభుత్వం నుంచి రావలసిన నిధులు, నీట్, తదితర అంశాలన్నీ పార్లమెంట్‌లో లేవనెత్తడానికి కావలసినంత ఎంపీలు అవసరమని పేర్కొన్నారు. ఎందుకంటే లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన పేరుతో దక్షిణాది రాష్ట్రాలపై కత్తి వేలాడుతోందని వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌లో మన ప్రాతినిధ్య తగ్గిపోతుందని, తమిళనాడు గొంతు సన్నగిల్లుతుందని, ఇది తమిళనాడు హక్కులకు సంబంధించిందని, అందుకే పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా నాయకులంతా పార్లమెంట్‌లో మాట్లాడవలసి ఉందన్నారు.