Wednesday, February 26, 2025

టీచర్‌పై కక్షతో పేలుడుకు ఐదుగురు విద్యార్థుల ప్లాన్

- Advertisement -
- Advertisement -

బిలాస్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లో ఒక పాఠశాల వాష్‌రూమ్‌ల విస్ఫోటంపై దర్యాప్తులో ముగ్గురు బాలికలతో సహా ఐదుగురు విద్యార్థులు ఒక ఉపాధ్యాయినిపై ఆగ్రహంతో ఆమె లక్షంగా సోడియం లోహాన్ని అమర్చి పేలుడు సృష్టించినట్లు వెల్లడైందని పోలీసులు మంగళవారం తెలియజేశారు. ఈ నెల 21న బిలాస్‌పూర్ నగరం మంగ్లా ప్రాంతంలోని ఒక ప్రైవేట్ పాఠశాల వాష్‌రూమ్‌లో సంభవించిన పేలుడులో నాలుగవ తరగతి విద్యార్థిని గాయపడింది. సమగ్ర దర్యాప్తు, సిసిటివి ఫుటేజ్ పరిశీలన దరిమిలా పోలీసులు ఆ ఘటనలో పాత్ర ఉన్న ఐదుగురు విద్యార్థుల్లో నలుగురిని ఆదివారం (23న) నిర్బంధంలోకి తీసుకున్నారు. బంధువులను చూసేందుకు వెళ్లిన ఐదవ విద్యార్థిని ఇంకా నిర్బంధంలోకి తీసుకోవలసి ఉంది.

ఎనిమిదవ తరగతి విద్యార్థులు అయిన నలుగురు నిర్బంధిత పిల్లలను ఒక జువెనైల్ కోర్టులో హాజరు పరచగా, కోర్టు వారిని జువెనైల్ హోమ్‌కు పంపిందని పోలీస్ అధికారి ఒకరు తెలియజేశారు. ‘దర్యాప్తు, సిసిటివి కెమెరా ఫుటేజ్ పరిశీలనలో ముగ్గురు బాలికలతో సహా ఐదుగురు విద్యార్థుల పాత్ర వెలుగులోకి వచ్చింది. దానితో వారిలో నలుగురిని ఆదివారం (23న) నిర్బంధించడమైంది’ అని బిలాస్‌పూర్ పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్‌పి) రజనేశ్ సింగ్ తెలిపారు. ఏదో కారణంగా పాఠశాల ఉపాధ్యాయిని ఒకరిపై ఆగ్రహంతో ఉన్న ఐదుగురు విద్యార్థులు ఆమె లక్షంగా పేలుడును తలపెట్టారని ఆయన చెప్పారు. సోడియం లోహానికి నీరు తగిలితే ఎలా పేలుడు సంభవిస్తుందో తెలుసుకోవడానికి వారు ఒక ఆన్‌లైన్ వీడియో చూశారని ఆయన తెలిపారు.

విద్యార్థుల్లో ఒక బాలిక తన బంధువు ఐడి ఉపయోగించి ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా సోడియంను కొనుగోలు చేసిందని, వారు వాష్‌రూమ్‌లో నీటి తొట్టెలో నుంచి నీరు బయటకు వచ్చే చోట సోడియంను ఉంచారని పోలీస్ అధికారి చెప్పారు. ‘అనూహ్యంగా ఒక నాలుగవ తరగతి విద్యార్థిని ఫ్లష్‌ను ఉపయోగించడంతో అనుకోకుండా పేలుడు సంభవించి ఆమె గాయపడింది’ అని ఆయన తెలియజేశారు. అంతిమ పరీక్షల పర్యవేక్షణలో నిమగ్నమైన పాఠశాల టీచర్లు పేలుడు శబ్దం వినడంతోనే వాష్‌రూమ్‌కు హుటాహుటిని వెళ్లినప్పుడు నేలపై పడి ఉన్న క్షతగాత్రురాలు కనిపించింది. ఈ వ్యవహారంలో మరింత దర్యాప్తు సాగుతోందని ఆయన తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News