Wednesday, February 26, 2025

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించండి

- Advertisement -
- Advertisement -

సిఎంకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ లేఖ
మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. జర్నలిస్లుల సమస్యలు దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్నాయని, చాలీచాలని వేతనాలతో జీవితాలను అనుభవిస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అనేక ఉద్యమాల్లో పాత్రికేయుల పాత్ర మరువలేనిది, గత పదేండ్లుగా వివిధ కారణాలతో దాదాపు 500 మందికి పైగా జర్నలిస్టులు మరణించారన్నారు.

గత నాలుగు దశాబ్ధాలుగా జర్నలిస్టుల ఇళ్ల సమస్య పెండింగ్‌లో ఉందని, ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుతో సమస్య మరింత జఠిలమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్నా జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు మాత్రం అందడం లేదన్నారు. వెంటనే జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి రెండేండ్లకోసారి ఇవ్వాల్సిన అక్రిడిటేషన్లు 5నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఇవ్వలేదని, అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు ఆరోగ్య పథకాన్ని ప్రవేశపెట్టాలని, వెల్ నెస్ సెంటర్లను బలోపేతం చేయాలని, మహిళా జర్నలిస్టులకు పత్రికా, ఎలక్ట్రానిక్, ఇతర సంస్థల్లో తగు సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు తప్పనిసరిగా ఏర్పాటు చేసేలా ఆదేశించాలని ఆయన కోరారు.

వేజ్ బోర్డు అమలుకావడం లేదని, జస్టిస్ మతీజియా కమిటీ చేసిన సిఫారసుల మేరకు ఒక ఐఎఎస్ అధికారిని నియమించి వేజ్‌బోర్డ్ అమలు చేసేలా చూడాలని కోరారు. ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు ప్రత్యేక రక్షణ చట్టం తేవాలని, రిటైరైన జర్నలిస్టులకు పెన్షన్ పథకం ప్రవేశపెట్టాలని, జర్నలిస్టులకు శిక్షణా తరగతులు నిర్వహించాలని, చనిపోయిన జర్నలిస్టులకు రూ .20 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, జర్నలిస్టు బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలని, రాష్ట్రంలోని మీడియాలో నెలకొన్న పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేయడానికి సీనియర్ ఉన్నతాధికారులు, మేధావులు, జర్నలిస్టులతో కమిషన్ వేసి సమస్యలను గుర్తించాలని, వారి సిఫారసు మేరకు అభివృద్ధి, సంక్షేమ చర్యలు తీసుకోవాలని జాన్ వెస్లీ సిఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News