మన తెలంగాణ / హైదరాబాద్ : యుటిఎస్ మొబైల్ యాప్ ద్వారా రిజర్వ్ చేయని టిక్కెట్ల కొనుగోలును ప్రోత్సహించడానికి దక్షిణ మధ్య రైల్వే క్యాష్‌బ్యాక్ సౌకర్యాన్ని పరిచయం చేసింది. రైల్వే వినియోగదారునికి అనుకూలమైన, డిజిటల్ పద్దతులను ప్రవేశపెట్టడంలో దక్షిణ మధ్య రైల్వే ఎల్లప్పుడూ ముందంజలో ఉంటోంది. 2016లో హైదరాబాద్ జంట నగరాల్లోని 26 సబర్బన్ స్టేషన్లలో ‘యుటిఎస్’ మొబైల్ అప్లికేషన్‌ను ప్రవేశపెట్టింది. ఆ తరువాత, జూలై, 2018 నుండి రైల్వేలోని అన్ని యుటిఎస్ స్టేషన్లను కవర్ చేస్తూ ప్లాట్ ఫామ్, ప్రయాణ, సీజన్ టిక్కెట్ల బుకింగ్ కోసం అన్ని నాన్-సబర్బన్ స్టేషన్లకు ఈ సౌకర్యాన్ని విస్తరించారు. రిజర్వ్ చేయని ప్రయాణీకులకు మరింత సౌకర్యాన్ని కల్పించేందుకు వీలుగా భారతీయ రైల్వేలు అంతటా పేపర్‌లెస్ టికెటింగ్ బుకింగ్ ప్రారంభించింది.
ఆధునిక టికెటింగ్ వ్యవస్థలో యుటిఎస్ యాప్ ఒక పెద్ద ముందడుగు. రైల్వేల్లో రిజర్వ్ చేయని టిక్కెట్లపై ప్రయాణించే వారికి ఇదొక వరమని చెప్పవచ్చు . డిజిటల్ ఇండియా విధానానికి అనుగుణంగా ఈ యాప్ నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తోందని దక్షిణ మధ్య రైల్లే వెల్లడించింది. ప్రయాణీకులు ఆర్ వాలెట్, పేటిఎం, ఫోన్‌పే, గూగుల్‌పే యుపిఐ యాప్‌లు లేదా ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ వంటి వివిధ డిజిటల్ మోడ్‌ల ద్వారా చెల్లింపు చేయవచ్చు. ఆర్ వాలెట్ యుటిఎస్ యాప్‌లో అందుబాటులో ఉంటుంది, దీనిలో మొత్తాన్ని రూ. 20 వేల పరిమితి వరకు డిపాజిట్ చేయవచ్చు. ఈ యాప్ ద్వారా టికెట్ కొనుగోలును ప్రోత్సహించడానికి ఆర్ వాలెట్ ద్వారా కొనుగోలు చేసిన టిక్కెట్లపై 3 శాతం క్యాష్‌బ్యాక్ ఇవ్వబడుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు.
యుటిఎస్ యాప్ రైలు వినియోగదారుల నుండి సానుకూల స్పందనను పొందుతోందని, ఈ యాప్‌ను ఉపయోగించే ప్రయాణీకుల సంఖ్య ఎల్లప్పుడూ ప్రోత్సాహకరంగా ఉంటోందని, మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకున్న అన్‌రిజరవ్డ్ టిక్కెట్ల వాటా క్రమంగా పెరుగుతోందని దక్షిణ మధ్య రైల్వే ప్రజా సంబంధాల అధికారి ఎ. శ్రీధర్ తెలిపారు. 2023 – 24లో ఏప్రిల్ నుండి జనవరి వరకు యుటిఎస్ మొబైల్ యాప్ ద్వారా టికెట్ సౌకర్యాన్నీ పొందిన సగటు ప్రయాణీకులు ఒక రోజులో 83,510 కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో రోజుకు సగటు ప్రయాణీకుల సంఖ్య 93,487 అని, ఇది 12 శాతం పెరుగుదల సూచిస్తుందని తెలిపారు. జనరల్ టిక్కెట్ల కొనుగోలుకు మొదట్లో విధించిన దూర పరిమితులను సడలించడంతో రైలు వినియోగదారులు ఏ ప్రదేశం నుండైనా టిక్కెట్లను కొనుగోలు చేయగలుగుతున్నారని వెల్లడించారు.
ప్రయాణీకులు తమ ఇంటి నుండే తమ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని, రిజర్వ్ చేయని టిక్కెట్లను కొనుగోలు చేయడానికి పొడవైన క్యూలలో నిలబడకుండా రైలు ఎక్కవచ్చని తెలిపారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్ వెర్షన్ల ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న వ్యక్తులు యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యుటిఎస్ యాప్ యూజర్ ఫ్రెండ్లీ, మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్, క్యాష్‌లెస్ లావాదేవీలు, హెల్ప్ ట్యాబ్ వంటి వివిధ కీలక లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది యాప్‌ను ఎలా ఉపయోగించాలో దశల వారీ మార్గదర్శిని, హెల్ప్‌లైన్ నంబర్లు , తరచుగా అడిగే ప్రశ్నలతో సహా వివిధ రకాల కస్టమర్ల కు సహాయం అందిస్తుందని అధికారులు వెల్లడించారు.