భక్తులకి ఎటువంటి ఇబ్బందులు రావొద్దు
మంత్రి కొండా సురేఖ ఫోన్‌లో కీలక ఆదేశాలు
మన తెలంగాణ/హైదరాబాద్: మహా శివరాత్రి పండగ పర్వదినం నేపథ్యంలో అన్ని శైవ క్షేత్రాల్లో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆ శాఖ ఉన్నతాధికారులకు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఎల్లుండి మహా శివరాత్రి పర్వదినం జరగనున్న నేపథ్యంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే వేములవాడ, కాళేశ్వరం, కీసర రామలింగేశ్వర స్వామి, ఏడుపాయల వన దుర్గ భవానీ అమ్మవారు, రామప్ప, మేళ్ళచెరువు స్వయంభు శంభు లింగేశ్వర స్వామి దేవస్థానం, చాయా సోమేశ్వర ఆలయం పానగళ్ళు, సోమేశ్వర దేవస్థానం పాలకుర్తి, వెయ్యి స్థంభాల గుడి, మెట్టుగుట్ట దేవాలయం, కాశిబుగ్గ ఆలయం, భద్రకాళి, తదితర దేవస్థానాల్లో అవసరమైన ఏర్పాట్లపై ఉన్నతాధికారుల నుండి మంత్రి కొండా సురేఖ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు మంత్రి కొండా సురేఖ ఫోన్లో పలు ఆదేశాలు జారీ చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని సూచించారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం రుద్రాభిషేకం, సామూహిక బిల్వార్చన, రుద్ర హోమం, ప్రవచనాలతో పాటు క్యూలైన్ మేనేజ్‌మెంట్, తాగునీరు వసతి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, విద్యుత్ వసతి, వాహనాల పార్కింగ్, ఆరుబయట ప్రదేశాల్లో విద్యుద్దీపాల ఏర్పాటు, చలువ పందిళ్లు, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాట్లు తదితర అంశాలపై మంత్రి దేవాదాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అన్ని దేవాలయాలను సమన్వయం చేసేందుకు హైదరాబాద్ ఎండో మెంట్ కమిషనరేట్ ఆఫీసులో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేశారా అని అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ఎక్కడైనా, ఏదైనా ఇబ్బంది ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరిపేందుకు జిల్లా కలెక్టర్లు, స్థానిక అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి సూచించారు.