సహాయక బృందాలకు
సవాల్‌గా మారిన ప్రతికూల
పరిస్థితులు 11వ కి.మీ
వరకు చేరుకున్న రెస్కూ
టీం 11.50 కి. మీ
వద్ద దెబ్బతిన్న ఎయిర్
సప్లయ్ వ్యవస్థ 200
మీటర్ల పొడవు..15
అడుగుల ఎత్తులో బురద
గంటకు 5వేల లీటర్ల
వేగంతో సొరంగాన్ని
ముంచెత్తుతున్న నీటి ఊట
కన్వేయర్ బెల్టు మరమ్మతుకు
మరో రెండు రోజులు
నీరు,బురద తోడడానికి
ఒకే పైపులైన్‌తో ఇక్కట్లు
మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి : ఎస్‌ఎల్‌బిసి సొరంగం కూలిన ఘటనలో ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ…పట్టువీడవని విక్రమార్కుల్లా సహాయక బృందాలు ముందుకు సాగుతున్నాయి. సొరంగంలో 200 మీటర్ల దూరం వరకు 15 అడుగుల ఎత్తులో బురద పేరుకుపోవడం, గంటకు 5 వేల లీటర్ల నీ టి ఊట వస్తుండడం ప్రతి కూలాంశంగా మారింది. మూడు రోజులు పరిస్థితు లు అంచనా వేయడానికి ఘటన స్థలానికి ఎంత దూరంలో మట్టి, బురద పేరుకుపోయిందో అంచనా వేయడానికి సరిపోయింది. ఈ మూడు రోజుల్లో ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, మిలిటరీ, నేవీ బృందాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలలో జరిగిన ఇలాంటి సంఘటనలో పనిచేసిన ఏజెన్సీలు, సహాయక బృందాలను రప్పించగలిగారు. దీనికి తోడు సొరంగంలో అవసరమున్న పరికరాలు విద్యుత్ ఆక్సిజన్, కన్వేయర్ బెల్ట్ వంటివి అవసరమని గుర్తించి వాటిని మరమ్మతు చేయడానికి ప్రాధాన్యత కల్పిస్తూ ఇందులో నిష్ణాతులైన వారిని రప్పించడంతో నాలుగవ రోజు సహాయక చర్యల్లో ముందడుగు పడింది. అయినా ఏకధాటిగా వస్తున్న నీటి ఊట సొరంగంలో కూరుకుపోయిన బురదతో ఇబ్బందులు తప్పడం లేదు. భారీ యంత్రాలు, ఇతర వస్తువులను సంఘటన జరిగిన స్థలానికి చేర్చడానికి ఇబ్బందులు తప్పడం లేదు.
మంగళవారం నాటికి 11వ కిలోమీటర్ తరువాత ఆక్సిజన్, వెలుతురు కోసం విద్యుత్తు ఏర్పాటు జరగలేదు. కన్వేయర్ బెల్ట్ మరమ్మతు మాత్రమే ప్రధాన అంశంగా మారింది.. బెల్టు మరమ్మతులు పూర్తయితే గంటకు 800 క్యూబిక్ మీటర్ల బురదను ఎత్తివేయడం సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు నీటి ఊటను వచ్చింది వచ్చినట్లు బయటికి పంపడానికి ఒకటే పైపు మార్గం ఉండడం తదుపరి బురద నీటిని కూడా ఇదే పైపు ద్వారా తరలించడంతో ఒక పక్క నీటి ఊట పెరగడం, మరో పక్క బురద పేరుకుపోతుండడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కన్వర్ బెల్ట్ మరమ్మతులు పూర్తయితే బురద నీటిని సైతం అందులో నుంచి తరలించే అవకాశాలు ఉన్నాయి.
4 రోజులైనా టిబిఎం వరకు చేరుకోని వైనం
ఎస్‌ఎల్‌బిసి సొరంగం కూలి 8 మంది కూలీలు మట్టి దిబ్బల మధ్య చిక్కుకున్న ప్రాంతానికి నాలుగవ రోజు వరకు కూడా సహాయక బృందాలు చేరుకోకపోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. టన్నెల్ బోరింగ్ మెషీన్ వద్దకు చేరుకోవాలంటే మరో రెండు కిలోమీటర్లు మేర అడ్డంకులను అధిగమించి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. 10 మీటర్ల వ్యాసార్థంలో భారీ యంత్రాలు సహాయక సామగ్రిని తరలించడానికి నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అయినా సహాయక బృందాలు ఒక ఛాలెంజ్‌గా తీసుకుని ముందుకు సాగుతున్నట్లు చెబుతున్నారు. సహాయక బృందాలు సమన్వయంతో సొరంగంలోకి వెళ్లి పనులు చేద్దామన్న ఒక పనికి ఇంకో అడ్డంకి ఎదురవుతోందని చెబుతున్నారు. ఒక పనికి ఒక యంత్రం లింకు ఉండడంతో ఏ పని కూడా ముందుకు సాగడం లేదని తెలుస్తోంది. సమస్య అంతా బురద నీరు కావడంతో దీనిని తొలగించడానికి ఒకే ఒక అంశమైన కన్వేయర్ బెల్ట్‌ను మరమ్మతు చేయాల్సి ఉంది.
మంత్రుల సమీక్ష అనంతరం బెల్ట్ పనులు పూర్తి కావడానికి మంగళవారం రాత్రి లేదా బుధవారం పడుతుందని స్వయంగా మంత్రులే చెప్పడాన్ని బట్టి చూస్తే సహాయక చర్యలకు మరో రెండు రోజులు ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సొరంగ మార్గంలో పరిస్థితులు అనుకూలిస్తే సొరంగంలో చిక్కుకున్న వారి వద్దకు చేరుకోవడానికి మరో నాలుగు రోజులు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతికూల పరిస్థితులు ఇలాగే కొనసాగితే వారం రోజులు కూడా పట్టే అవకాశాలు లేకపోలేదనే చర్చ సర్వత్రా సాగుతోంది. ఉత్తరాఖండ్‌లో 15 రోజుల తర్వాత రెస్కూ నిర్వహించి 42 మందిని కాపాడిన ఘటనను అనుసరించి ఎస్‌ఎల్‌బిసిలో కూడా చిక్కుకున్న ఎనిమిది మంది బయటపడతారన్న ఆశతోనే సహాయక చర్యల్లో వెనుకాడడం లేదు. ఉత్తరాఖండ్ వద్ద రెస్కూ నిర్వహించిన వివిధ టీంలు చెప్పిన దానిని బట్టి చూస్తే అక్కడ నీటి ఊట, బురద లేకపోవడం అనుకూల అంశం ఎస్‌ఎల్‌బిసి సొరంగంలో మా త్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.
కార్మికుల యోగక్షేమాలపైనే ఆందోళన
సొరంగ మార్గంలో మట్టి కూలిన ఘటనలో చిక్కుకున్న ఎనిమిది మంది యోగక్షేమాలపైనే సర్వత్రా ఆందోళన నెలకొంది. ఒక పక్క వారు ప్రాణాలతో బయటకు వస్తారన్న ఆశ కలుగుతుంటే.. మరోపక్క ప్రతికూల పరిస్థితులు ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తోంది. టన్నెల్ బోరింగ్ పనులు చేపట్టే ముందు భాగంలో ఆక్సిజన్ లభించే అవకాశం లేదు. మట్టి కూలి పడడంతో లోపల చిక్కుకున్న వారికి ఆక్సిజన్ అందేవిధంగా టన్నెల్ గోడల మధ్య సొరంగం బయటి భాగం వారు చిక్కుకున్న ప్రాంతం మధ్య గ్యాప్ ఉంటే తప్ప వారికి శ్వాస ఆడే అవకాశాలు ఉంటాయే తప్ప పూర్తిగా సొరంగం మట్టితో నిండితే ఆక్సిజన్ అందే అవకాశాలు తక్కువగా ఉంటాయని వాదనలు వినిపస్తున్న నేపథ్యంలో కార్మికుల యోగక్షేమాలపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఏది ఏమైనా ఉత్తరాఖాండ్ సొరంగం కూలిన పరిస్థితులలో 15 రో జుల తర్వాత 42 మంది కార్మికులు ప్రాణాలతో బయటపడిన విధంగా ఎస్‌ఎల్‌బిసిలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలతో బయటికి వస్తారని ఆశ కలుగుతోంది.