11 కిలోమీటర్ల తర్వాత పరిస్థితులు అనుకూలంగా లేవు నాలుగవ రోజు రెస్కూ టీంలు 11.5 కిలోమీటర్ల వరకు వెళ్లాయి టిబిఎం వద్దకు వెళ్లడానికి
ప్రయత్నాలు ముమ్మరం సొరంగంలో పైప్‌లైన్, ఎయిర్ సప్లై వ్యవస్థ ధ్వంసమైంది బురద ఏమేరకు ఉందో తెలుసుకోవడానికి జిఎస్‌ఐ, ఎంజిఆర్‌ఐ
బృందాల అధ్యయనం విస్తృత స్థాయి సమీక్ష సమావేశంలో రాష్ట్ర మంత్రుల బృందం
మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి: ఎస్‌ఎల్‌బిసి సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను కాపాడడానికి దేశంలోని అత్యున్నత సాంకేతికతను ఉపయోగిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలోని మంత్రుల బృందం మంగళవారం ఎస్‌ఎల్‌బిసి ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించి సహాయ కార్యక్రమాలను స్వయంగా అంచనా వేశారు. అనంతరం వారు స్థానిక ఎంఎల్‌ఎ వంశీకృష్ణతో కలిసి ప్రాజెక్టు స్థలంలోని జెపి కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి సహాయ కార్యక్రమాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ప్రమాద సంఘటన జరిగిన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్‌తో సహా సంబంధిత శాఖల అధికారులు, నిర్మాణ సంస్థ, ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వివిధ ఏజెన్సీల ప్రతినిధులు వివరించారు. ఎస్‌ఎల్‌బిసి సంఘటన స్థలంలో 40 నుండి 50 మీటర్ల మేర బురద నిండుకుందని తెలిపారు. ఎడమకాలువ టన్నెల్‌లో 11 కిలోమీటర్ల తర్వాత నీటితో కలిగి ఉందని, అయినప్పటికీ 11.5 కిలోమీటర్ల దూరం వరకు వివిధ ఏజెన్సీల రక్షణ బృందాలు వెళ్లగలిగాయని వివరించారు. 13.50 కిలోమీటర్ల వద్ద టన్నెల్ బోరింగ్ మిషన్ ఉందని, అక్కడికి వెళ్లే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నామని అన్నారు. ఇక్కడి నుండి ఎయిర్ సప్లై పైప్ లైన్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందని అన్నారు. సొరంగంలో ఎంతదూరం వరకు బురద, నీరు ఉందనేది జిఎస్‌ఐ, ఎంజిఆర్‌ఐ సంస్థలు అధ్యయనం చేస్తున్నాయని వెల్లడించారు. చివరి 40 మీటర్లలో నీరు, బురద, మట్టితో ఉందని, ఏ విధమైన రాళ్లు, ఇతర ఘన పదార్థాలు ఉన్నట్లు కనిపించడం లేదని స్పష్టం చేశారు. 15 అడుగుల ఎత్తులో, 200 మీటర్ల వరకు ఈ బురద ఉందని అన్నారు. ప్రసుత్తం టన్నెల్‌లో 10 వేల ఘనపుటడుగుల బురద ఉందని ప్రాథమికంగా అంచనా వేశామని, ఈ బురదనీటిని బయటికి తీయడమే ప్రధాన సవాలుగా ఉందని అన్నారు.
కన్వేయర్ బెల్ట్‌కు మరమ్మతులు జరుగుతున్నాయని, ఈ కన్వేయర్ బెల్ట్‌కు రేపు సాయంత్రం లేదా ఎల్లుండి లోగా మరమ్మత్తులు పూర్తవుతాయని తెలిపారు. ఈ కన్వేయర్ బెల్ట్ ద్వారా గంటకు 800 టన్నుల ఘణపుటడుగుల బురదను బయటికి తీయవచ్చని అన్నారు. వీటిని మరింత త్వరితగతిన వెలికితీయడానికి అక్కడికి వెళ్లగలిగే జెసిపిలను తీసుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. టన్నెల్‌లో గంటకు 3,600 నుంచి 5 వేల లీటర్ల ఊట నీరు వస్తోందని తెలిపారు. లోపల నుండి నీటితో పాటు బురదను కూడా బయటకు తీయడానికి ఒక పైప్‌లైన్ వినియోగించుకున్నామని స్పష్టం చేశారు.
ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం విపత్తుల నిర్వహణ శాఖ స్పెషల్ సిఎస్ అర్వింద్ కుమార్, ఎస్‌పిడిసిఎల్ సిఎండి ముషరాఫ్ అలీ, స్పెషల్ ఆఫీసర్ ఈ.శ్రీధర్, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఐజి చౌహాన్, ఎల్ అండ్ టి టన్నెల్ రంగ నిపుణుడు క్రిస్ కూపర్, రాబిన్స్ కంపెనీ ప్రతినిధి గ్రేన్ మేకర్డ్, ఉత్తరాఖండ్‌లో ఇలాంటి దుర్ఘటనలో రెస్కూ ఆపరేషన్ నిర్వహించిన నిపుణుల బృందం, జెపి గ్రూప్‌నకు చెందిన పంకజ్ గౌర్, నేవికి చెందిన మరికోస్ ప్రసాద్, ఆర్మి కల్నల్ వికాస్, కల్నల్ సురేష్, మోర్త్ డైరెక్టర్ అన్షు కల్కు, ఎన్‌హెచ్‌ఐడిసిఎల్, ఎన్‌డిఆర్‌ఎఫ్ కమాండెంట్ ప్రసన్న, అగ్నిమాపక శాఖ రీజినల్ ఫెయిర్ ఆఫీసర్ సుధాకర్ రావు, హైడ్రాకు చెందిన పాపయ్య, ఎస్‌సిసిఎల్ అధికారి సదానందం, ఉత్తర కాశీ టన్నెల్ రెస్కూ ర్యాట్ మైనర్స్, గ్రూప్ ప్రతినిధి ఫిరోజ్ కురేషి, నవయుగకు చెందిన జెవిఎల్‌ఎన్ కుమార్, ఇతర ఉన్నతాధికారుల బృందం పాల్గొన్నారు.