కరాచీ: ఈ ఏడాది ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిధ్యం ఇస్తున్న పాకిస్థాన్.. ఆటలో మాత్రం చెత్త ప్రదర్శన చేస్తోంది. ఆడిన రెండు మ్యాచుల్లో ఓటమిపాలైన జట్టు సెమీస్ ఆశలను దూరం చేసుకుంది. దీంతో పాకిస్థాన్ ఆటతీరుపై సర్వత్ర విమర్శల వర్షం కురుస్తోంది. ఇప్పటికే పలువురు మాజీలు జట్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ నజామ్ సేథి జట్టుపై విమర్శలు చేశారు. పాక్ జట్టు ఇలా కావడానికి ఆ దేశ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ కారణమని అయన మండిపడ్డారు.
‘పాకిస్థాన్ జట్టు ఒకప్పుడు ప్రపంచంలో నెంబర్.1గా ఉండేది. 2019 నుంచి పాకిస్థాన్ క్రికెట్ పతనం మొదలైంది. అప్పటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయాలే ఇందకు కారణం. దేశవాళీ క్రికెట్‌ను నాశనం చేశారు. కోచ్‌ల ఎంపిక, ఇష్టమైన వారిని సెలెక్టర్లుగా చేయడం, ఇలా చాలా రాజకీయాలు జరిగాయి. జట్టులో సభ్యులు గ్రూప్‌లుగా ఏర్పడటం.. సభ్యులతో కెప్టెన్‌కి పడకపోవటం వంటి అంశాలు ఈ దారుణానికి కారణం’ అని సేథి అన్నారు.