ఇటీవలే పదవీబాధ్యతలు చేపట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన మిత్రుడు, ప్రపంచ కోటీశ్వరుడు ఎలాన్ మస్క్‌లతో పాటు ఇండియాలోని రాజకీయ నేతల పుణ్యమాని యుఎస్ ఎయిడ్ అనే వ్యవహారనామంతో ప్రాచుర్యం పొందిన యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ సంస్థ ఇప్పుడు అందరి నోళ్లలోనూ నానుతోంది. ఇండియాలో ఓటింగ్ పెంచేందుకు బైడెన్ హయాంలో 182 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందిందని, ఇండియాలో ఎవరినో గెలిపించేందుకు ఇది బైడెన్ ప్రభుత్వం చేసిన సహాయమని ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (డోజ్) ‘పరిశోధన’లో వెల్లడి కావడం, ఆ వెంటనే ఈ సహాయాన్ని నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడం ఈ గలభాకు కారణం.
లేడికి లేచిందే పరుగన్నట్లు బుద్ధికి ఏది తోస్తే అది, నోటికి ఏది వస్తే అది మాట్లాడే స్వభావం గల అగ్రరాజ్యాధినేత ఇలా ప్రకటించారో లేదో ఇండియాలో రాజకీయ రగడ మొదలైంది.అమెరికాలో ఆయన ఆరోపణలు చేసిందే తడవు ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్లు బిజెపి, కాంగ్రెస్ నేతలు అందిపుచ్చుకుని, ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం మొదలుపెట్టారు. ట్రంప్ మాటల్లో నిజమెంత, యుఎస్ ఎయిడ్ నిధులు ఎప్పుడు వచ్చాయి. ఎవరికి అందాయి? వంటి కనీస సమాచారాన్ని సైతం సేకరించకుండా ఆరోపణలు సంధించుకోవడం ద్వారా దేశ ప్రతిష్ఠను బజారున పడేస్తున్నామనే ఇంగితజ్ఞానం మన నేతలకు కొరవడటం విచారకరం.
యుఎస్ ఎయిడ్ నిధులను ఆపివేయడంతో ట్రంప్ ఆగలేదు. అత్తమీద కోపం దుత్తమీద చూపినట్లు యుఎస్ ఎయిడ్ కోసం పనిచేస్తున్న 1600 మందిని ఉద్యోగాలలోంచి తొలగించడమే కాకుండా, మరో నాలుగువేల పైచిలుకుమందిని సెలవుపై పంపించారు. ఒకప్పుడు అమెరికా, రష్యా వంటి బడా దేశాల ఆర్థిక సహకారంపై ఆధారపడిన ఇండియా ఆ తర్వాతి కాలంలో ప్రపంచపటంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఆర్థిక, సామాజిక రంగాల్లో అనేక దేశాలకు ఆదర్శంగా ఉండటమే కాదు, తన వంతుగా పలు దేశాలకు ఆర్థిక వితరణ అందిస్తోందన్న సంగతి గమనార్హం.తనతో సరిహద్దులు పంచుకుంటున్న బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్ వంటి దేశాలకే కాకుండా ఆఫ్రికాకు సైతం చేయూతనందిస్తోంది.
అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఒఆర్‌ఎఫ్) నివేదిక ప్రకారం గ్రాంట్లు, రుణాలు, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాల అమలుకోసం గత రెండున్నర దశాబ్దాలలో 65 దేశాలకు 48 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించింది. అమెరికాతో పోలిస్తే ఇది తక్కువ మొత్తమే కావచ్చు, కానీ ఇతర దేశాలను ఆదుకోవడంలో తన వంతు పాత్ర పోషిస్తోందన్న విషయాన్ని గుర్తించాలి. ఇండియాకు బైడెన్ హయాంలో అమెరికా నుంచి అందిన 182 కోట్ల రూపాయల సాయం డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నట్లుగా ఓటింగ్ శాతం పెంచేందుకు కాదని భారత ఆర్థిక శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది.
గత ఆర్థిక సంవత్సరంలో యుఎస్ ఎయిడ్ ద్వారా 750 మిలియన్ డాలర్ల నిధులు ఇండియాలో ఆహారం, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం తదితర రంగాలలో చేపట్టిన ఏడు ప్రాజెక్టుల అమలుకోసం అందినవంటూ కుండబద్దలు కొట్టింది. ఇదిలాఉంటే, అమెరికానుంచి అందినట్లుగా చెబుతున్న ఆర్థిక సాయం వాస్తవానికి ఇండియాకు కాకుండా బంగ్లాదేశ్‌కు అందినట్లుగా ఓ ఆంగ్లమీడియా ప్రచురించిన పరిశోధనాత్మక కథనంతో మన రాజకీయ నేతల నోళ్లు మూతబడ్డాయి. జపాన్‌ను సైతం అధిగమించి, ప్రపంచంలో నాలుగో ఆర్థిక శక్తిగా నిలబడేందుకు అమితవేగంతో అడుగులు వేస్తున్న ఇండియాను అప్రదిష్టపాలు చేసేందుకు అగ్రరాజ్యాధినేత సమయం దొరికినప్పుడల్లా అభాండాలు వేస్తున్నారు.ఇండియాకు తమ దేశంనుంచి అందుతున్న సరకులపై విధిస్తున్న అధిక సుంకాల మాట పక్కనబెట్టి, భారత సుంకాలపై నోరు పారేసుకోవడం ఆయనకు అలవాటుగా మారింది.
ఈ నేపథ్యంలో విదేశాలనుంచి పొందుతున్న సహాయంపై ఇండియా స్పష్టమైన విధివిధానాలను రూపొందించుకోవాలి. మన దేశం లో ఎన్నికలను ప్రభావితం చేసేందుకు విదేశాలు ఆర్థిక సహాయం అందిస్తున్నాయనే అనుమానాలు ఉంటే, కేంద్రప్రభుత్వం తక్షణమే విచారణ జరిపించి, నిజానిజాలు నిగ్గుతీయాలే తప్ప పసలేని ఆరోపణలు చేయడంవల్ల ప్రయోజనం ఉండదు. ఈ సందర్భంగా ‘అమెరికా సాయాన్ని ఇండియా అవకాశంగా తీసుకుంటోంది. వాస్తవానికి వారే మనకు సాయం చేయవచ్చుకదా?’ అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు భవిష్యత్తులో నిజమవ్వాలని, అగ్రరాజ్యానికి ఇండియా ఆర్థిక చేయూతనందించే రోజు రావాలని ఆశిద్దాం.