Thursday, February 27, 2025

దక్షిణాదిలో ఒక్క లోక్‌సభ సీటూ తగ్గదు

- Advertisement -
- Advertisement -

కోయంబత్తూరు : నిధుల కేటాయింపు విషయమై కేంద్రం తమిళనాడుకు ఎటువంటి అన్యాయమూ చేయలేదని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా బుధవారం స్పష్టం చేశారు. ఈ విషయమై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ చేసిన ఆరోపణను కేంద్ర మంత్రి ఖండించారు. నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని ముఖ్యమంత్రి లేవనెత్తడం దృష్టి మళ్లించే యత్నం అని అమిత్ షా విమర్శించారు. స్టాలిన్ ఆరోపణలను అమిత్ షా ఖండిస్తూ, నరేంద్ర మోడీ ప్రభుత్వం 201424 కాలంలో తమిళనాడుకు రూ. 508337 కోట్లు మేరకు నిధులు అందజేసిందని తెలియజేశారు.

నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై స్టాలిన్ తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు. ఈ అంశంపై ఊహాగానాలకు అమిత్ షా తెర దించుతూ, నియోజకవర్గాల పునర్విభజనను దామాషా పద్ధతిపై జరిపినప్పుడు తమిళనాడుతో సహా దక్షిణాదిలోని ఏ రాష్ట్రమూ పార్లమెంటరీ ప్రాతినిధ్యంలో తగ్గుదలను చూడబోదని స్పష్టం చేశారు. కోయంబత్తూరులో బిజెపి కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం అమిత్ షా ప్రసంగిస్తూ, తమిళనాడులో శాంతి భద్రతల పరిరక్షణలో అధికార డిఎంకె ‘వైఫల్యాన్ని’ తూర్పారబట్టారు. ‘జాతి వ్యతిరేక ధోరణి తమిళనాడులో ఎన్నడూ లేనంత అధికంగా ఉంది’ అని ఆయన ఆరోపించారు.

‘1998 బాంబు పేలుడు నిందితుడు, సూత్రధారి (ఎస్‌ఎ బాషా) అంతిమ యాత్ర సమయంలో తమిళనాడు ప్రభుత్వం భద్రత సమకూర్చింది’ అని కేంద్ర హోమ్ శాఖ మంత్రి ఆరోపించారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల విక్రయంలో డ్రగ్ మాఫియా స్వేచ్ఛగా వ్యవహరిస్తోందని, అక్రమ మైనింగ్ మాఫియా ఇక్కడ అవినీతి రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు, ‘డిఎంకె నాయకులు అందరూ అవినీతిలో మాస్టర్స్ డిగ్రీ సాధించారు’ అని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలపై ఆవేదన చెందుతుండగా, ‘సిఎం, ఆయన కుమారుడు (ఉదయనిధి) ప్రజల దృష్టి మళ్లించేందుకు వేరే ఏదో అంశం చేపట్టారు.

దక్షిణాదికి ఎటువంటి అన్యాయమూ జరగనివ్వబోమని అంటూ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై ఒక సమావేశం నిర్వహించబోతున్నారు’ అని అమిత్ షా ఆక్షేపించారు. ఈ అంశంపై తమిళనాడు ప్రభుత్వం మార్చి 5న నిర్వహించనున్న అఖిత పక్ష సమావేశం గురించి కేంద్ర మంత్రి ఆ విధంగా వ్యాఖ్యానించారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ తరువాత దక్షిణాదిలో ఏ రాష్ట్రమూ తుదకు ఒక్క సీటునూ కోల్పోదని మోడీ ప్రభుత్వం లోక్‌సభలో స్పష్టం చేసిందని బిజెపి సీనియర్ నేత తెలిపారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల అనంతరం తమిళనాడులో ఎన్‌డిఎ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆ విజయం మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లోని బిజెపి గెలుపుల కన్నా చాలా పెద్దది కాగలదని అమిత్ షా అన్నారు.

‘తమిళంలో మాట్లాడలేకపోతున్నా, నన్ను క్షమించండి’
ప్రపంచంలోనే అతిప్రాచీన భాష తమిళం అని, అటువంటి గొప్ప భాషలో మాట్లాడలేకపోతున్నందుకు తనను క్షమించాలని తమిళ ప్రజలకు అమిత్ షా విజ్ఞప్తి చేశారు. జాతీయ విద్యా విధానంలో త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే కోయంబత్తూరులోని కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా ఆ వ్యాఖ్య చేశారు. 2024 బిజెపికి చారిత్రక సంవత్సరంగా నిలచిందని ఆయన చెప్పారు. అదే సంవత్సరం నరేంద్ర మోడీ మూడవ సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారని, చాలా సంవత్సరాల తరువాత ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్‌డిఎ కూటమి అధికారంలోకి వచ్చిందని, మహారాష్ట్ర, హర్యానా, ఇటీవల ఢిల్లీ ప్రజలు బిజెపిపై విశ్వాసం ఉంచారని కేంద్ర మంత్రి తెలిపారు. కుటుంబ రాజకీయాలను, అవినీతిని అంతం చేస్తూ తాము 2026లో విజయం సాధిస్తామని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News