మహాకుంభ్ నగర్ : ‘హర హర మహాదేవ’ నినాదాల మధ్య లక్షలాది మంది భక్తులు బుధవారం మహా శివరాత్రి సందర్భంగా త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు. 45 రోజులుగా సాగుతున్న మహా కుంభమేళా బుధవారంతో పరిసమాప్తం అయింది. 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే మెగా మత ఉత్సవం మహా కుంభమేళా జనవరి 13న (పుష్య పౌర్ణమి) మొదలు కాగా నాగ సాధువుల మహా ఊరేగింపులు, మూడు అమృత్ స్నాన్‌లు చోటు చేసుకున్నాయి. అధికార గణాంకాల ప్రకారం, ఈ ఏడాది ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాను 65 కోట్ల మందికి పైగా భక్తులు సందర్శించారు.
ప్రభుత్వ డేటా ప్రకారం, బుధవారం తెల్లవారు జామున 2 గంటల కల్లా 11.66 లక్షల మందికి పైగా భక్తులు మహా కుంభమేళా చివరి రోజు మహాశివరాత్రి త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు. ఆ సంఖ్య ఆ తరువాత రెండు గంటల్లో 25.64 లక్షలకు, ఉదయం 6 గంటలకు 41.11 లక్షలకు పెరిగింది. ఉదయం పది గంటలకల్లా 81.09 లక్షల మంది భక్తులు త్రివేణి సంగమంలో ఆఖరి స్నానం ఆచరించారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ నుంచి తెల్లవారు జామున 4 గంటలకు కుంభ మేళాల్లో ఏర్పాట్లను సీనియర్ ప్రభుత్వ అధికారులతో కలసి సమీక్షించనారంభించారు.
‘మహా కుంభమేళా 2025లో పరమ శివుని అర్చనకు అంకితమైన మహా శివరాత్రి సందర్భంగా బుధవారం త్రివేణి సంగమంలో పుణ్య స్నానం కోసం విచ్చేసిన గౌరవనీయ సాధువులు, కల్పవాసీలు, భక్తులు అందరికీ హృదయపూర్వక అభినందనలు’ అని సిఎం ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలిపారు. కుంభమేళాలో ఒక హెలికాప్టర్‌లో నుంచి భక్తులపై పూల రేకలు వెదజల్లడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 20 క్వింటాళ్ల పూల రేకలను ఐదు దఫాలుగా భక్తులపై వెదజల్లారు. ఇది ఇలా ఉండగా, మహా కుంభమేళాలో చివరి శుభప్రద ‘స్నానం’ అవుతున్నందున అధిక సంఖ్యలో భక్తులు అర్ధరాత్రికి ముందు నుంచే త్రివేణి సంగమంల నదీ తీరాలలో సమీకృతం సాగారు.
కొందరు మకాం వేసి, ‘బ్రాహ్మీ ముహూర్తం’లో స్నానం చేయడానికి ఓపికగా వేచి ఉండగా, అనేక మంది తగిన సమయానికి ముందే స్నానం ప్రక్రియలు నిర్వహించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనంగా పేర్కొంటున్న మహా కుంభమేళా చివరి రోజు దేశం నాలుగు దిక్కుల నుంచి భక్తులు చేరుకున్నారు. రాజ్‌కోటకు చెందిన బిబిఎ విద్యార్థి రాజ్‌వీర్ సింగ్ ఝాలా (20) త్రివేణి సంగమంలోనే స్నానం ఆచరించాడు. గుజరాత్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు ఒక బస్సులో చేరుకున్న అతని తల్లి, ఇతర కుటుంబ సభ్యులు కూడా పుణ్య స్నానం చేశారు. ‘పరమ శివుడు అంటే నాకు ‘శూన్యత’. ఆయన ముందు ఎందుకూ కొరగారు అని ప్రతి ఒక్కరూ భావించాలి. అంతేకాదు, ఎవరికైనా అంతరంగాన మంచితనం ఉండాలి.
అంతరంగంలో చెడు ఉన్నట్లయితే, పవిత్ర త్రివేణి సంగమంలో స్నానం చేసినా ఏ పాపమూ ప్రక్షాళన కాదు’ అని ఝాలా తన స్నానం అనంతరం ‘పిటిఐ’తో అన్నాడు. ఒకవైపు భక్తులు త్రివేణి సంగమం సమీపంలో లేదా వివిధ ఘాట్ల వద్దకు చేరుకుని పవిత్ర స్నానం చేయగా, మరొక వైపు భద్రత సిబ్బంది నిఘా వేసి ఉంచారు. ఏ ప్రదేశంలోను జనాన్ని వారు దీర్ఘ కాలం గుమిగూడనివ్వలేదు. భక్తుల సందోహం మేళా ప్రదేశంలోకి క్రమపద్ధతిలో చేరుకునేలా వారు చూశారు.
పశ్చిమ బెంగాల్, కర్నాటక, బీహార్, ఢిల్లీ, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ నుంచి కూడా యాత్రికులు వచ్చారు. చివరి రోజు మహా కుంభమేళాను తిలకించి, మహాశివరాత్రి రోజు పవిత్ర స్నానం చేసేందుకు నేపాల్ నుంచి భక్తుల బృందం కూడా ప్రత్యేకంగా వచ్చింది. బుధవారం తెల్లవారు జామున సుమారు 3.30 గంటలకు పుణ్య స్నానం ఆచరించిన కోల్‌కతాకు చెందిన పింకీ దేవి మహాశివరాత్రి రోజు స్నానం చేయగలిగినందుకు అమితానందం వ్యక్తం చేసింది. మేళా ప్రదేశం అంతటా ‘హర హర మహాదేవ’ లేదా ‘జై మహాకాల్’ నినాదాలు ప్రతిధ్వనించాయి. మహాశివరాత్రిని శివ, పార్వతుల దివ్య కల్యాణానికి ప్రతీకగా పరిగణిస్తుంటారు. మహా కుంభమేళా నేపథ్యంలో మహాశివరాత్రికి ప్రత్యేక ప్రాముఖ్యం ఉంది.
హిందు పురాణాల ప్రకారం, పరమ శివుడు అమృత కలశం ఆవిర్భావానికి దారి తీసిన సముద్ర మథనంలో కీలక పాత్ర పోషించాడు. మహా కుంభమేళా సందర్శకుల మొత్తం సంఖ్య భారత్, చైనా మినహా ప్రపంచంలోని అన్ని దేశాల జనాభాను మించుతుందని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పేర్కొన్నది. కాగా, మహా కుంభమేళాలో ఆరు ప్రత్యేక స్నానం తేదీలు జనవరి 13న పుష్య పౌర్ణమి, 14న మకర సంక్రాంతి, 29న మౌని అమావాస్య, ఈ నెల 3న వసంత పంచమి, 12న మాఘ పౌర్ణమి, 26న మహా శివరాత్రి వచ్చాయి. ఇదిఇలా ఉండగా, కుంభమేళా స్థాయి. యాత్రికుల అధిక సంఖ్య దృష్టా, అధికారులు మేళా ప్రాంతంలోను, ప్రయాగ్‌రాజ్‌లోను ‘వాహన నిషిద్ద మండలం’ నిబంధన అమలుపరిచారు.
జన సమూహం నియంత్రణకు వారు కఠిన చర్యలు కూడా తీసుకున్నారు. క్రితం నెల మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కనీసం 30 మంది వ్యక్తులు మరణించగా, 60 మంది గాయపడ్డారని ప్రభుత్వం వెల్లడించింది. మేళా ప్రదేశంలో ఏర్పాట్లను డిఐజి (కుంభమేళా) వైభవ్ కృష్ణ పర్యవేక్షిస్తూ, మేళా ప్రాంతంలో విస్తృత స్థాయిలో పోలీస్ సిబ్బందిని మోహరించినట్లు తెలియజేశారు. ‘మేము ముఖ్యంగా రెండు అంచెల వ్యూహం అనుసరించాం. త్రివేణి సంగమం సహా ఘాట్‌ల వద్ద భక్తుల రద్డీని నియంత్రించేందుకు, మేళా ప్రాంతంలో ఐదు ప్రధాన శివాలయాల్లో భక్త జన సందోహాన్ని అదుపు చేసేందుకు ముందుగానే సిద్ధమయ్యాం’ అని కృష్ణ బుధవారం‘పిటిఐ’తో చెప్పారు.