Thursday, February 27, 2025

దేశవ్యాప్తంగా వైభవంగా మహాశివరాత్రి

- Advertisement -
- Advertisement -

మహాశివరాత్రి సందర్భంగా పరమ శివుని పూజించి, ఆశీస్సులు పొందేందుకు లక్షలాది మంది భక్తులు ‘ఓమ్ నమః శివాయ’, ‘హర హర మహాదేవ’ నినాదాల నడుమ బుధవారం దేశవ్యాప్తంగా ఆలయాలను సందర్శించారు. ఉత్తర ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వేడుకలకు సారథ్యం వహించారు. ఆయన వేద మంత్రాల మధ్య గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయంలో ‘రుద్రాభిషేకం’ నిర్వహించారు. లక్షలాది మంది భక్తులు దేశవ్యాప్తంగా ప్రయాగ్‌రాజ్, వారణాసి, ఇతర నగరాల్లోని ఆలయాలకు చేరుకున్నారని, ‘ఆ మత విశ్వాసం భారత సమైక్యతకు ప్రతీక’ అని పేర్కొన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో 45 రోజుల మహా కుంభమేళా ముగింపునకు వస్తుండగా త్రివేణి సంగమం వద్ద కోటి మందికిపైగా భక్తులు పుణ్య స్నానం ఆచరించారు. వారణాసిలో బుధవారం వేకువ జామున నాగ సాధువులు, అఖాడాలు ఊరేగింపుగా కాశీ విశ్వనాథుని ఆలయానికి చేరుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయాన్ని దీపాలు, పూలతో అలంకరించారు. సాధువులు త్రిశూలాలు, గదలు, కత్తులు చేతబూని ‘జలాభిషేకం’ నిర్వహించగా ‘హర హర మహాదేవ’ నినాదాలు ప్రతిధ్వనించాయి.

భక్తుల సౌకర్యార్థం బారికేడ్లు, నీటి సదుపాయాలతో సహా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కాశీ విశ్వనాథ్ ధామ్ సిఇఒ విశ్వ భూషణ్ మిశ్రా తెలియజేశారు. ఆలయంలో అధిక సంఖ్యలో సందర్శకుల రాత్రి నుంచే దైవ దర్శనం చేసుకోసాగారు. యుపి రాజధాని లక్నోలో కూడా అటువంటి దృశ్యాలే కనిపించాయి. శివలింగానికి క్షీరాభిషేకం, జలాభిషేకం చేయడానికి జనం శివాలయాల వెలుపల బారులు తీరారు. అయోధ్యలో మహాశివరాత్రి సందర్భంగా భారీ ఎత్తున భక్తులు వచ్చారు, నగరవ్యాప్తంగా గల ఆలయాల్లో ప్రార్థనలు జరపడానికి వేలాది మంది సమీకృతమయ్యారు. ఈ సందర్భంగా ఆలయ నగరాన్ని రమణీయంగా అలంకరించారు. సుమారు 15 లక్షల మంది భక్తులు మంగళవారానికే అయోధ్య చేరుకున్నారని, బుధవారం కూడా రద్దీ కొనసాగిందని అధికారులు తెలిపారు. 46 ఏళ్ల తరువాత తిరిగి తెరచిన సంభాల్‌లోని కార్తికేయ మహాదేవ్ ఆలయంలో కూడా ప్రార్థనలు జరిగాయి. మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశం ప్రగతి పథంలో ముందుకు సాగుతూనే ఉంటుందని ఆమె ఆకాంక్షించారు.

దేశ రాజధానిలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, విద్యా శాఖ మంత్రి ఆశిష్ సూద్ ఆలయాలను సందర్శించి, ప్రార్థనలు నిర్వహించారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, బీహార్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక వంటి రాష్ట్రాల్లో కూడా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇది ఇలా ఉండగా, ఛత్తీస్‌గఢ్ సుర్గుజా జిల్లాలో ఒక ఎస్‌యువి ఒక ట్రక్కును ఢీకొన్నప్పుడు ఎస్‌యువిలోని ఐదుగురు శివ భక్తులు మరణించగా, మరి ఐదుగురు గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మైనర్లు కూడా ఉన్నారు. ప్రమాదం అనంతరం డ్రైవర్ ట్రక్కును వదలి పారిపోగా స్థానికులు ట్రక్కుకు నిప్పంటించారు. ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో మహాశివరాత్రి సందర్భంగా పతాకాలు, ఒకలౌడ్ స్పీకర్ ఏర్పాటు చేయడంపై రెండు వర్గాల మధ్య సంఘర్షణ జరిగినప్పుడు పలువురు గాయపడినట్లు పోలీసులు తెలియజేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News