నిపుణుల బృందాలు వచ్చినా పురోగతి
ఏదీ? నీటిని, బురదను తోడడానికి
ఐదు రోజులా! సొరంగం కూలింది
13.5 కిలోమీటర్ల వద్ద..సహాయక
బృందాలు వెళ్లింది 12 కిలోమీటర్ల
లోపే? కన్వేయర్ బెల్టే కీలకం
గ్యాస్..ప్లాస్మా కట్టర్లు నేడు వస్తే
తొలగించడానికి ఎంత సమయం
పడుతుందో? 5వ రోజు ఇండియా
బోర్డర్ ఆర్గనైజేషన్, మార్కోస్ టీం రాక
మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి: నాగర్‌కర్నూల్ జిల్లా, అమ్రాబాద్ మండలం, దోమలపెంట వద్ద శ్రీశైలం ప్రాజెక్టు జలాలపై ఆధారపడి నిర్మిస్తున్న శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్‌లో ప్రమాదం జరిగి ఐదు రోజులు కావస్తున్నా అనుకూల ఫలితాలు రాకపోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. గత ఐదు రోజులుగా సమీక్షలు నిర్వహిస్తూ దేశంలో ఇప్పటివరకు జరిగిన ఇలాంటి సంఘటనల్లో ప్రాణాలను కాపాడిన బృందాలను రప్పించి సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షిస్తామన్న ఆశలు పదిలంగా ఉన్నా…గురువారానికి సొరంగంలో చిక్కుకుని ఆరు రోజులు గడవడం…సొరంగంలో చిక్కుకున్న వారి ప్రాణాలు పదిలమేనా..? అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సొరంగం బయట రక్షణ బృందాలు వందల సంఖ్యలో చేరుకు న్నా సొరంగంలో చిక్కుకున్న 8 మంది వరకు చేరుకోకపోవడమే అనేక ప్రశ్నలకు తావిస్తోంది. సొరంగాల నిర్మాణ రంగంలో ప్రపంచంలోనే భారతదేశం కూడా భారీ సొరంగ నిర్మాణాలు చేపడుతూ అధునాతన టెక్నాలజీని వినియోగించుకోవడమే కాకుండా ప్రపంచ నాణ్యత ప్రమాణాలతో కూడిన యంత్రాలను సమకూర్చుకున్న సమయంలో కూడా ఎస్‌ఎల్‌బిసిలో చిక్కుకున్న వారిని రక్షించడంలో జరుగుతున్న ఆలస్యంపైనే సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చర్యలు ఆలస్యం అవుతుండడంతో సొరంగంలో చిక్కుకుని ఉ న్న 8 మంది ప్రాణాలు పదిలంగా ఉన్నాయా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమై అనుమానాలకు ఆజ్యం పోస్తోంది.
రక్షణ బృందాలు ఎక్కువ..చర్యలు తక్కువ
ఎస్‌ఎల్‌బిసి సొరంగంలో జరిగిన దుర్ఘటనలో రక్షణ చర్యలు చేపట్టడానికి వచ్చిన బృందాలు అధికంగా ఉండడం చర్యలు తక్కువగా ఉండడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క బృందం ఒక విధంగా రక్షణ చర్యలు చేపట్టడానికి సూచనలు చేస్తూ యంత్రాలు, ఇతర పరికరాలను సమకూర్చాలని అధికారులను కోరుతుండడం, అవన్నీ రప్పించిన సొరంగ మార్గం ద్వారా ఘటన స్థలం వద్దకు తీసుకుని వెళ్లడం సాధ్యం కాకపోవడమే ఆలస్యానికి మరో కారణంగా చెప్పవచ్చు. టన్నెల్ బోరింగ్ మెషీన్ వెనుక భాగంలో భారీ ఇనుముతో కూడిన స్ట్రక్చర్‌లు ఉండడం, అవి సొరంగం కూలిన ఘటనలో భారీ బండరాళ్లు పడడంతో చిందరవందరగా ఉన్నట్లు అక్కడి వరకు వెళ్లిన సహాయక బృందాలు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే అర్థమవుతోంది. ఆర్మీ, నేవీ బృందాలు, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్స్, సింగరేణి బృందాలకు తోడు తాజాగా బుధవారం మైనింగ్ రెస్కూ సిబ్బంది, ఇండియా బోర్డర్స్ ఆర్గనైజేషన్, ఇండియా మారెన్ కమాండో బృందాలు దోమలపెంట వద్దకు చేరుకున్నా యి. పరిస్థితులకు అనుగుణంగా వారి వారి అనుభవం అవసరాలకు అనుగుణంగా యంత్రాలు, ఇతర పరికరాలను సమకూర్చాలని చెప్పడం, వాటిని రప్పించడమే ప్రధానంగా ఆలస్యానికి కారణంగా భావిస్తున్నారు.
గ్యాస్, ప్లాస్మా కట్టర్లు రాక
సొరంగంలో మట్టిదిబ్బలు, బండ రాళ్లు కూలి 8 మంది చిక్కుకోవడమే కాకుండా బోరింగ్ మెషీన్‌కు అనుసంధానంగా ఉన్న భారీ ఇనుము వ్యర్థాలను తొలగించడమే లక్షంగా 5వ రోజు అధునాతన గ్యాస్, ప్లాస్మా కట్టర్లను రప్పించినట్లు మంత్రులు నిర్వహించిన సమీక్షా సమావేశంలో తెలిపారు. తాజాగా వీరి సేవలు వినియోగించుకోవడం ద్వారానైనా ఘటనా స్థలం వద్దకు చేరుకుంటారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వారు సొరంగంలోకి వెళ్లి అక్కడి పరిస్థితులను అంచాన వేసిన తర్వాతే పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా నీటి ఊట, బురద పేరుకుపోవడం వల్లే పనులు జరగడానికి ఆలస్యం అవుతుందని చెబుతున్నారే తప్ప 13 కిలోమీటర్ల దూరం నుంచి దానిని తొలగించడానికి అదనంగా ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఘటనకు ముందు సహజంగా నిర్మాణం కోసం వినియోగించే ఒకే ఒక వైపు ద్వారా ఊరుతున్న నీటిని బురదను విడతల వారీగా బయటకు పంపించేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
నీటి ఊట వస్తున్న దానికి అనుగుణంగా ఔట్ పుట్ లేదని అందుకే బురద సొరంగంలో యధావిధిగా ఉందని తెలుస్తోంది. సొరంగంలో ఎదురవుతున్న అడ్డంకులను అధిగమించకుంటే రక్షణ చర్యలకు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకపక్క నీటి ఊటను బయటకు పంపుతూ మరోపక్క సొరంగం కూలిన ఘటనలో పూర్తిగా దెబ్బతిన్న కన్వేయర్ బెల్ట్, ఆక్సిజన్, గాలి, నీరు వంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పూర్తి చేయడమే పెను సవాల్‌గా మారిందని చెప్పవచ్చు. ఒక్కో పనికి ఒక బృందం తప్ప మరో బృందం సొరంగంలోకి వెళ్లే పరిస్థితులు లేవు. బురద నీటి వ్యర్థాలను తొలగించడానికి కన్వేయర్ బెల్ట్ కీలకం కావడం, దానికి మరింత ఆలస్యం జరుగుతుండడం సర్వత్రా ఉత్కంఠకు దారితీస్తోంది. లోపలికి వెళ్లడానికి లోకో ట్రైన్ తప్ప మరో మార్గం లేకపోవడం, ఒకసారి లోకో ట్రైన్ లోపలికి వెళ్లి బయటకు రావడానికి 40 నిమిషాలు పడుతోందని నిపుణులు చెబుతున్నారు.