Thursday, February 27, 2025

ఓదార్పు దక్కేదెవరికో?

- Advertisement -
- Advertisement -

n నేడు బంగ్లాతో పాకిస్థాన్ ఢీ

రావల్పిండి: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గురువారం జరిగే గ్రూప్‌ఎ మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్థాన్‌తో బంగ్లాదేశ్ తలపడనుంది. ఇరు జట్లు ఇప్పటికే సెమీ ఫైనల్ రేసు నుంచి వైదొలిగాయి. భారత్,న్యూజిలాండ్ జట్ల చేతుల్లో ఓటమి పాలు కావడంతో ఇరు జట్ల ఇప్పటికే నాకౌట్‌కు దూరమయ్యాయి. దీంతో కనీసం చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి కాస్తయిన పరువును దక్కించుకోవాలని భావిస్తున్నాయి. చిరకాల ప్రత్యర్థి భారత్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో పాక్ ఘోర పరాజయం చవిచూసింది. ఈ ఓటమితో పాక్ ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతిన్నది. బంగ్లాదేశ్ కూడా చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో కంగుతిన్నది. అంతకుముందు భారత్‌తో జరిగిన పోరులోనూ బంగ్లాదేశ్‌కు ఓటమి ఎదురైంది. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడడంతో పాక్, బంగ్లా సెమీస్ ఆశలకు తెరపడింది. ఈ గ్రూపు నుంచి భారత్, న్యూజిలాండ్ టీమ్‌లు ఇప్పటికే సెమీస్ బెర్త్‌లను దక్కించుకున్నాయి. కాగా, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే లక్షంతో పాక్ ఉంది.

వరుస ఓటములతో పాకిస్థాన్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ పరిస్థితుల్లో బంగ్లాపై గెలిచి కాస్తయినా ఊరట పొందాలనే లక్షంతో ఉంది. బ్యాటింగ్ వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. కీలక ఆటగాళ్లు తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచలేక పోతున్నారు. బాబర్ ఆజమ్, సౌద్ షకిల్, కెప్టెన్ రిజ్వాన్, సల్మాన్ ఆఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్‌దిల్ షా వంటి ప్రతిభావంతులైన క్రికెటర్లు జట్టులో ఉన్నారు. అయినా పాక్‌కు వరుస ఓటములు తప్పడం లేదు. ఇలాంటి స్థితిలో బంగ్లాతో పోరు పాక్‌కు సవాల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో కూడా ఓడితే విమర్శలు మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో పాక్ ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగానే ఉన్నా పాక్‌కు ఏదీ కలిసి రావడం లేదు. ఈ మ్యాచ్‌లోనైనా ఆటగాళ్లు సమష్టిగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. అప్పుడే పాక్‌కు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.

పరీక్షలాంటిదే..

మరోవైపు బంగ్లాదేశ్‌కు ఈ మ్యాచ్ సవాల్ వంటిదేనని చెప్పాలి. సొంత గడ్డపై పాక్‌ను ఓడించాలంటే బంగ్లాదేశ్ సర్వం ఒడ్డి పోరాడక తప్పదు. భారత్, న్యూజిలాండ్ చేతుల్లో ఓటమి పాలు కావడంతో జట్టు ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నది. ఈ పరిస్థితుల్లో బలమైన పాక్‌ను ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికగా మారింది. కీలక ఆటగాళ్ల వైఫ ల్యం బంగ్లాకు ప్రతికూలంగా మారింది. వికెట్ కీపర్ ముష్ఫికుర్ రహీం, మహ్మదుల్లా, మెహదీ హసన్ మిరాజ్, కెప్టెన్ శాంటో, ఓపెనర్లు సౌమ్య సర్కార్, తంజిద్ హసన్ తదితరులు ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. దీంతో బంగ్లాకు వరుస ఓటములు తప్పలేదు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా వీరు తమ స్థాయికి తగ్గ ఆటను కనబరచాల్సి ఉంది. అప్పుడే బంగ్లాకు ఓదార్పు విజయం దక్కే ఛాన్స్ ఉంటుంది. లేకుంటే హ్యాట్రిక్ ఓటములు ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News