కుల, మత తేడాలకతీతంగా స్నేహం, సౌభ్రాతృత్వం విరాజిల్లిన నేల భారతదేశం. అయితే పాలక పార్టీ బిజెపి ద్వేషపూరిత ప్రసంగాలు ఈ ఐక్యతను విచ్ఛిన్నం చేస్తూ దేశ వాతావరణాన్ని విషతుల్యంగా మారుస్తున్నాయి. ఇండియా హేట్ ల్యాబ్ (ఐహెచ్‌ఎల్) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2024లో ఈ ధోరణి మరింత విస్తరించింది. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య జరిగిన సార్వత్రిక ఎన్నికలు, ఆపై మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి నాయకుల ద్వేషపూరిత ప్రసంగాలు విస్తరించాయి. ఈ నివేదిక కేవలం సంఖ్యలను మాత్రమే వెల్లడించకుండా, ఈ ప్రసంగాల వెనుక ఉన్న వ్యూహాలను, కీలక పాత్రధారులను, వాటి సైద్ధాంతిక ప్రేరణలను కూడా బహిర్గతం చేసింది.
2024 నివేదిక ప్రకారం, ద్వేష ప్రచారంలో బిజెపి, దాని అనుబంధ సంస్థలు ప్రత్యక్షంగా ముడిపడ్డాయి. గత ఎన్నికల్లో ఫ్రింజ్ సంఘాలు మాత్రమే విద్వేష ప్రసంగాలు చేసేవి. కానీ ఈసారి రాష్ట్ర, కేంద్ర స్థాయి నాయకులు స్వయంగా ఈ విష ప్రచారాన్ని నడిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన ద్వేషపూరిత ప్రసంగాలను దేశమంతా గమనించింది. దీనివల్ల బిజెపి దేశంలోనే అతి పెద్ద విద్వేష ప్రసంగం ప్రచారకారులుగా మారింది. బిజెపి నాయకులు హాజరైన 340 సమావేశాల్లో 29.2 శాతం విద్వేష ప్రసంగాలు జరిగినట్లు నివేదిక వెల్లడించింది. ఇది గతేడాదితో పోలిస్తే పెరిగింది. అయినప్పటికీ, బిజెపి కేవలం 50 సంఘటనలకే బాధ్యత వహించింది.
సార్వత్రిక ఎన్నికల సమయంలో బిజెపి చేసిన ద్వేష ప్రసంగాలు మొత్తం 76.7 శాతంగా నమోదు అయ్యాయి. కేవలం బిజెపి మాత్రమేకాదు, విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి), బజరంగ్ దళ్ వంటి హిందూత్వ సంస్థలు కూడా విద్వేష ప్రచారాన్ని మరింత పెంచాయి. వీరు పాల్గొన్న 279 కార్యక్రమాల్లో ద్వేషప్రసంగాలు చోటుచేసుకున్నాయి. మహారాష్ట్రలోని సకల్ హిందూ సమాజ్ 56 ద్వేష ప్రసంగాలను నిర్వహించింది. సురేష్ చవాంకే, కాజల్ హిందుస్తానీ, బిజెపి ఎంఎల్‌ఎ టి. రాజాసింగ్, నితీష్ రాణే వంటి మతతత్వవాదులు ఈ ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు. 2024 ఏప్రిల్ 21న రాజస్థాన్ బన్స్వారాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ముస్లింలను చొరబాటుదారులుగా అభివర్ణిస్తూ, వారు హిందువుల సంపదను దోచుకుంటున్నారని ప్రధాని మోడీ చేసిన ప్రసంగం తీవ్ర ప్రభావం చూపించింది. ఎన్నికల సమయంలో మొత్తం 373 ద్వేషపూరిత ప్రసంగాల ఘటనలు నమోదయ్యాయి.
ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలు దీని వల్ల అత్యధికంగా ప్రభావితమయ్యాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒక్కరే 58 ద్వేషపూరిత ప్రసంగాలు చేశారు. ‘ఓట్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ వంటి భయపెట్టే పదాలను పదేపదే ప్రస్తావించారు. యోగి ఆదిత్యనాథ్ 86 ద్వేష ప్రసంగాలు చేశారు. అంటే ప్రతి నాలుగు రోజులకు ఒకటి చొప్పున విద్వేష ప్రచారం జరిగింది. ఈ ప్రసంగాల్లో ప్రధానంగా ముస్లింలు, క్రైస్తవులు లక్ష్యంగా మారారు. బిజెపి ఎన్నికల వ్యూహం పూర్తిగా మత భయాన్ని రెచ్చగొట్టడంపైనే ఆధారపడింది. ప్రధాని మోడీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ లాంటి నాయకులు ‘హిందువుల ఆస్తులను బంగ్లాదేశ్ చొరబాటుదారులకు, రోహింగ్యా శరణార్ధులకు విరాళంగా ఇస్తారు’ అంటూ ప్రతిపక్షాలను దుష్ప్రచారం చేశారు. ఈ ప్రసంగాల ప్రభావంగా మత అల్లర్లు, మూకదాడులు, వ్యవస్థాగత వివక్ష పెరిగాయి.
సోషల్ మీడియా పాత్ర
2024లో ద్వేష ప్రసంగాలు కేవలం బహిరంగ సభలకే పరిమితం కాలేదు. సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా వ్యాప్తి చెందాయి. కొన్ని సెకన్ల వ్యవధిలోనే లక్షలాది మందికి చేరాయి. ఐహెచ్‌ఎల్ నివేదిక ప్రకారం, 995 ద్వేషపూరిత వీడియోలు ఫేస్‌బుక్, యూ ట్యూబ్, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ట్రాక్ చేయబడ్డాయి. ఒక్క ఫేస్‌బుక్‌లోనే 495 వీడియోలు హోస్ట్ చేయబడ్డాయి. 211 వీడియోలు యూట్యూబ్‌లో కనిపించాయి. బిజెపి నాయకుల 266 మైనారిటీ వ్యతిరేక ద్వేష ప్రసంగాలు బహుళ వేదికలలో ప్రత్యక్ష ప్రసారం అయ్యాయి. మొత్తం 1,165 ద్వేష ప్రసంగాల ఘటనల్లో 1,147 ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నట్లు నివేదిక పేర్కొంది. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి యోగి, ఇతర బిజెపి నాయకులు ద్వేషపూరిత కథనాలను ఎన్నికల ప్రచారంలో ప్రోత్సహించారు. ముస్లింలపై ప్రత్యక్ష హింసకు పిలుపునిచ్చిన 259 ప్రసంగాలు నమోదయ్యాయి. ముస్లిం వ్యాపారాలను బహిష్కరించాలని కోరుతూ 111 ప్రసంగాలు, మసీదులు, ముస్లిం ఇళ్లను ధ్వంసం చేయాలని కోరుతూ 274 ప్రసంగాలు, ముస్లింలపై ఆయుధాలు పట్టుకోవాలని కోరుతూ 123 ప్రసంగాలు జరిగాయని నివేదిక వెల్లడించింది.
ఉత్తరాఖండ్‌లో విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన ఆయుధ పూజ కార్యక్రమంలో ఒక వక్త ‘హిందువులు కాని వారిని చంపడం మోక్షానికి దారి తీస్తుంది’ అని బహిరంగంగా ప్రకటించాడు. గతేడాది ద్వేష ప్రసంగాలు ముస్లింలను మాత్రమే లక్ష్యం గా చేయలేదు. క్రైస్తవ వ్యతిరేకత కూడా పెరిగింది. 115 ద్వేష ప్రసంగాలు క్రైస్తవులను లక్ష్యంగా చేసుకున్నవిగా నమోదు అయ్యాయి. 2024 మార్చిలో అసోంలోని హిందూ జాతీయవాద సంస్థలు క్రైస్తవ పాఠశాలలపై దాడులకు పిలుపునిచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రీయ బజరంగ్ దళ్ నాయకులు కాథలిక్ పాఠశాలలపై దాడులు చేయాలని కోరారు. ఈ ద్వేష ప్రచారాల ప్రభావంగా మూకదాడులు, బలవంతపు పునఃమార్పిడి ఘటనలు పెరిగాయి. ఇండియా హేట్ ల్యాబ్ 2024 నివేదిక ఓ భయంకరమైన వాస్తవాన్ని వెల్లడిస్తోంది. ద్వేష ప్రసంగాలు ఉద్దేశపూర్వక రాజకీయ ప్రాజెక్టుగా మారాయి. ముస్లింలను, క్రైస్తవులను అణగదొక్కేందుకు, భారత ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసేందుకు రూపొందించబడ్డాయి. ఈ ద్వేష ప్రచారం ప్రభావాలు రాబోయే సంవత్సరాల్లో మరింత పెరిగే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది.
కోలాహలం రామ్ కిశోర్
9849328496