దేశానికి రైతే వెన్నెముక అంటూనే, ఆ వెన్నెముకను విరిచే విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. అధికార మార్పిడి జరిగిన నాటి నుండి నేటి వరకు రైతాంగ ప్రయోజనాలు కాపాడే వ్యవసాయ విధానాలను పాలక పార్టీలు, ప్రభుత్వాలు అమలు జరపకపోగా హరిస్తున్నాయి. పండించే పంటలకు న్యాయమైన ధర లభించకపోతే రైతుకు నష్టదాయకంగా మారి సేద్యమే సంక్షోభంలో పడుతున్నది. నేడు భారత రైతాంగం ఈ సమస్యనే ఎదుర్కొంటున్నారు. నెహ్రూ పాలనలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసే విధానాలు అమలు చేయని ఫలితంగా దేశంలో తీవ్ర ఆహార సంక్షోభం ఏర్పడింది. అవమానకరమైన పిఎల్ 480 ఒప్పందం ద్వారా అమెరికా నుండి పెద్దఎత్తున గోధుమలు దిగుమతి చేసుకున్నాం.
ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచే విధంగా రైతాంగానికి మేలు రకమైన విత్తనాలు, పంటకు కావాల్సిన పెట్టుబడి, నాణ్యమైన ఎరువులు, మంచి ధర లభించే మార్కెట్ సౌకర్యం కల్పించి ఉంటే ఆహార సంక్షోభం వచ్చేది కాదు. మద్దతు ధరల నేపథ్యం భారత వ్యవసాయరంగాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవటానికి అనుగుణమైన విధానాలను అమెరికా అమలు జరిపింది. మొదట ముక్కిపోయిన గోధుమలను భారత దేశానికి ఎగుమతి చేసి సొమ్ము చేసుకుంది. తమ దేశ ఎరువుల రంగానికి భారత దేశాన్ని పెద్ద మార్కెట్‌గా మార్చే వ్యూహాత్మక విధానాలకు సిద్ధమైంది.
అందుకు ఫోర్డు ఫౌండేషన్‌ను ఉపయోగించింది. 1959లో భారత దేశానికి వచ్చిన ఈ ఫౌండేషన్ నాట్లు వేయటానికి ముందే పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలని భారత ప్రభుత్వానికి సూచించింది. దానికి అనుగుణంగానే వ్యవసాయ ధరల కమిషన్ ఏర్పాటు కోసం 1964లో ఎల్‌కె ఝా అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు చేసింది. దాని సిఫార్సుల ఆధారంగా 1965లో వ్యవసాయ ధరల కమిషన్ (ఎపిసి) ఏర్పడింది.ఇది ప్రతి సంవత్సరం మద్దతు ధర, సేకరణ గురించి ప్రకటిస్తుంది. ఎసిపిని 1985లో వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్‌గా కేంద్ర ప్రభుత్వం మార్చింది.
ముందుగానే మద్దతు ధర ప్రకటించమని ఫోర్డు ఫౌండేషన్ చెబితే, పంటల దిగుబడి పెంచటానికి సస్యవిప్లవం ప్రకటించమని ప్రపంచబ్యాంకు భారత ప్రభుత్వానికి చెప్పింది. సస్యవిప్లవం పేరుతో అమెరికా కంపెనీల ఎరువుల, పురుగు మందుల వ్యాపారానికి భారత దేశాన్ని ముఖ్య కేంద్రం గా మార్చటమే ప్రపంచ బ్యాంకు ఎత్తుగడ. ప్రపంచ బ్యాంకు సూచనలకు అనుగుణంగా 1966లో దేశంలో సస్యవిప్లవాన్ని ప్రభుత్వం ప్రకటించింది. అమెరికా నుంచి హైబ్రీడ్ విత్తనాలు, రసాయన ఎరువులు, పురుగు మందులు దేశంలోకి దిగుమతి అయ్యాయి. సస్యవిప్లవ ఫలితంగా రైతాంగానికి పంట ఖర్చులు పెరిగాయి. అందుకు తగ్గ ఆదాయం మాత్రం రైతాంగానికి లభించలేదు.
ఇలాంటి పరిస్థితుల్లో పంటలకు మద్దతు ధర అంశం ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా జరుగుతున్న చర్చ లో విధాన నిర్ణేతలు, పరిశోధకులు, ఆలోచనాపరులు ప్రభుత్వ పెట్టుబడులు లేదా ఇన్‌పుట్ సబ్సిడీల ద్వారా ఉత్పత్తి వ్యయానికి మద్దతు మార్గాలను సూచించారు. 1964లో ఎల్‌కె ఝా కమిషన్ సిఫార్సుల మేరకు రైతాంగానికి మద్దతు ఇచ్చే విధానాన్ని ప్రభుత్వం స్వీకరించింది. ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధర విధానం ఒక నిర్దిష్ట పంట ఉత్పత్తి వ్యయాన్ని అంచనా వేయటానికి అనుసరించే విధానాలను వ్యవసాయ ఖర్చుల ధరల కమిషన్ (సిఎసిపి) ప్రచురించిన వార్షిక ధరల విధాన నివేదిక లో పేర్కొన్నారు.
ఈ నివేదిక ప్రకారం సిఎసిపి భారత దేశంలో ప్రధాన పంటల సాగు ఖర్చును అధ్యయనం చేయటానికి ‘సమగ్ర పథకాన్ని’ 1971 నుండి అమలు చేసింది. ఈ పథకం ద్వారా మూడు సంవత్సరాల ఖర్చులను కలిపి పంటల ఉత్పత్తి ఖర్చును వ్యవసాయ ధరల కమిషన్ నిర్ణయిస్తుంది. ఈ విధానం రైతాంగ ప్రయోజనాలను దెబ్బ తీస్తుంది. రెండు సంవత్సరాల పంట ఖర్చులు తక్కువా ఉంటే, ఆ ఖర్చును మూడవ సంవత్సరం పంట ఖర్చులతో కలిపి నిర్ణయించటం వలన పంట ఖర్చు తక్కువగా నమోదు అవుతుంది. దాన్ని ఆధారం చేసుకుని కేంద్ర ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధర తక్కువ ప్రకటిస్తుంది.
అంతేకాకుండా పంటల ఉత్పత్తి ఖర్చును రాష్ట్రాల వారీగా సేకరించి దానిని దేశ సగటుగా నిర్ణయించటం జరుగుతున్నది. ఒక పంటకు సాగు ఖర్చులో రాష్ట్రాల మధ్య వ్యత్యాసం ఉంది. దీనివల్ల ఎక్కువ ఖర్చు ఉన్న రాష్ట్రాలకు నష్టం జరుగుతున్నది. ప్రతి సంవత్సరం రాష్ట్రాల వారీగా పంట ఖర్చును లెక్కించి ఆయా రాష్ట్రాలకు విడిగా మద్దతు ధరను ప్రకటిస్తే రైతాంగానికి ప్రయోజనంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అలా చేయకపోవటం రైతాంగ వ్యతిరేక విధానాలకు నిదర్శనం.
ఒక పంటకు ఉత్పత్తి వ్యయం అనేది పంట కోసం పెట్టిన ఖర్చు, భూమి అద్దె, కుటుంబ శ్రమ, అప్పులకు వడ్డీ, మూలధనంపై వడ్డీ తదితరాలు లెక్కించి నిర్ణయించాలి.
అది సమగ్రంగా ఖర్చుగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వాలు, వ్యవసాయ వ్యయ ధరల కమిషన్ ఆ విధంగా పంట వ్యయాన్ని లెక్కించటం లేదు. బ్యాంకులు ఇచ్చే పంట రుణం ప్రామాణికంగా తీసుకుని పంటకు మద్దతు ధరను ప్రకటిస్తున్నాయి. ఫలితంగా రైతాంగానికి సేద్యం గిట్టుబాటుకాక అప్పుల్లో కూరుకు పోతున్నారు. వివిధ కమిషన్ల సూచనలు: ఎంఎస్ స్వామినాథన్ నేతృత్వంలోని జాతీయ రైతు కమిషన్ (ఎన్‌సిఎఫ్) కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) సగటు ఉత్పత్తి వ్యయంకంటే (పంట ఖర్చు, కౌలు ఖర్చు, కుటుంబ శ్రమ, అప్పులకు వడ్డీ మొదలైన ఖర్చులు) కనీసం 50% ఎక్కువగా ఉండాలని సిఫార్సు చేసింది.
1979 -80లో ఉత్పత్తి వ్యయం అంచనాలపై ప్రత్యేక నిపుణుల (యస్‌ఆర్ సేన్) కమిటీ, 1990లో ఏర్పాటు చేయబడిన పంటల ఉత్పత్తి వ్యయ పద్ధతి సమీక్ష కోసం నిపుణుల (సిహెచ్ హనుమంతరావు అధ్యక్షతన) కమిటీ, పంటల వ్యయం గురించి సిఎసిపి ఉపయోగించిన పద్ధతికి సంబంధించిన అనేక సమస్యలు లేవనెత్తాయి. సేన్, భాటియా (2004) కమిటీలు కూడా యాజమాన్యంలోని భూమి అద్దె విలువను కూడా ఉత్పత్తి వ్యయంలో లెక్కించబడుతుందని ఎత్తిచూపారు. భూయజమాని మూలధనంపై వడ్డీ ఖర్చు 10%గా అంచనా వేసింది. ఈ సిఫార్సులను ప్రభుత్వాలు, సిఎసిపి పరిగణనలోకి తీసుకోలేదు.
2014లో మోడీ నాయకత్వాన మొదటిసారి ఎన్‌డిఎ ప్రభుత్వం ఏర్పడినప్పుడు 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పింది. ఇంతవరకు ఆచరణలో అమలు జరగకపోగా నేడు దాని ఊసే ఎత్తటం లేదు. రైతుల ఆదాయం పెరగకపోవటం పైన, మద్దతు ధరల పైన మోడీ ప్రభుత్వంపై వివిధ రూపాల్లో వ్యతిరేకత పెరుగుతూ ఉండటంతో, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా పంట ఉత్పత్తి వ్యయంపై అదనంగా 50% పెంచి మద్దతు ధరను ప్రకటిస్తామని మోడీ ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడే మోడీ ప్రభుత్వ వంచన బయటపడింది.
స్వామినాథన్ కమిషన్ చెప్పినట్లు అన్ని రకాల ఖర్చులను లెక్కించకుండా, ఒక్క పంట ఖర్చునే తీసుకుని దానిపై 50% పెంచి మద్దతు ధరను ప్రకటిస్తున్నది. 2024 -25 సంవత్సరానికి ఎకరా సేద్యపు పంట ఖర్చు 28 వేలుగా నిర్ధారించి, సగటు దిగుబడి 20 క్వింటాళ్లు నిర్ణయించి, క్వింటాల్ ఉత్పత్తి ఖర్చు రూ. 14 వందలు పేర్కొని దానిపై 50% పెంచి 2100 రూపాయలుగా ప్రకటించి దాన్ని 2300 రూపాయలకు పెచింది. పంట ఖర్చు, కౌలు ఖర్చు, కుటుంబ శ్రమ, అప్పుల వడ్డీలతో వాస్తవ వ్యయం రూ. 64 వేలు. క్వింటాల్ ఉత్పత్తి ఖర్చు రూ. 3200. దానిపై 50% కలిపితే 4,800 రూపాయలుగా మద్దతు ధర ప్రకటించాలి.
దీన్ని గమనించినప్పుడు స్వామినాథన్ సిఫార్సులను మోడీ ప్రభుత్వం వక్రీకరించి విధానం తెలుస్తుంది. మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించటానికి నిరాకరిస్తున్నది. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని, మద్దతు ధర 50% పెంచుతానని మోసపుచ్చుతూ వచ్చిన మోడీ ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాల ద్వారా మద్దతు ధరలకే మంగళం పాడి పంటల సేకరణ నుంచి తప్పుకుంటే, ఆ చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగ ఉద్యమం ఉవ్వెత్తున సాగటంతో, చట్టాలను ఉపసంహరించుకోక తప్పలేదు. స్వతంత్ర పాలన ప్రారంభం నుండి నేటి వరకు పాలక ప్రభుత్వాలన్నీ రైతాంగ వ్యతిరేక విధానాలనే అనుసరించాయి.
రైతాంగ ప్రయోజనాలను హరించి, బడా వ్యాపారుల ప్రయోజనాలకు అనుకూలంగా పంటల మద్దతు ప్రకటిస్తున్నాయి. గిట్టుబాటు గాని ధరల వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోయారు. నాలుగు లక్షల మంది రైతులు అప్పులు తీర్చే మార్గం కనపడక బలవన్మరణాల పాలయ్యారు. రైతాంగం, రైతు, రైతు కూలీ సంఘాలు పంటలకు న్యాయబద్ధమైన మద్దతు ధరలు ప్రకటించి, వాటికి చట్టబద్ధత కల్పించి, ప్రభుత్వమే కొనుగోళ్లు చేయాలనే డిమాండ్‌తో ఉద్యమాలు చేస్తున్నాయి. ఆ ఉద్యమాలను ఉధృతం చేసి మోడీ ప్రభుత్వం దిగి వచ్చేలా చేయాలి. అప్పుడే న్యాయమైన మద్దతు ధర లభిస్తుంది.
– బొల్లి ముంత సాంబశివరావు
98859 83526