Thursday, February 27, 2025

అధిక బరువు అనర్థదాయకమే

- Advertisement -
- Advertisement -

మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్.. ఈ మూడు వ్యాధులూ భారతీయులకు పెనుముప్పుగా పరిణమిస్తున్నాయని వైద్యులు ఎంతోకాలంగా చెవిన ఇల్లు కట్టుకుని మరీ ఘోషిస్తున్న కారణంగా వాటిపై అంతోఇంతో అవగాహన కలిగిన మాట నిజం. కానీ, చాపకింద నీరులా విస్తరిస్తూ ప్రాణాలను కబళిస్తున్న మరో మహమ్మారి వ్యాధి ఉందనీ, దాని పేరు ఒబేసిటీ అనీ చాలా మందికి తెలియదు. తెలిసినా, దానిని ఒక వ్యాధిగానో, జబ్బుగానో భావించకపోవడం, అది చేసే హానిగురించి అంతగా అవగాహన లేకపోవడంవల్ల ఈ జబ్బు అంతకంతకూ తీవ్రమవుతోంది.

పైగా స్థూలకాయులకు పైమూడు జబ్బులూ త్వరితగతిన సంక్రమించే ప్రమాదం ఎక్కువగా ఉందనే విషయం గమనార్హం. ఈ నేపథ్యంలో ఒబేసిటీపై ప్రధానమంత్రి పోరాటాన్ని ప్రారంభించడం ఆహ్వానించదగిన విషయం. ఇటీవల ‘మన్ కీ బాత్’ లో ప్రసంగిస్తూ ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల మంది ఊబకాయంతో బాధపడుతున్నారనీ, భారతదేశంలోనూ స్థూలకాయుల సంఖ్య ఎక్కువేనని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ, దీనిపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు పదిమంది ప్రముఖులను ప్రచారకర్తలుగా నియమించారు. ఈ పదిమందీ తలా ఒక పదిమందినీ నియమించాలని, అలా ఊబకాయంపై దేశప్రజలను జాగృతం చేయాలని పిలుపునిచ్చారాయన.

ఆ మాటకొస్తే, ఊబకాయంపై కేంద్రంలోని పెద్దలు ఆందోళన వెలిబుచ్చడం ఇది మొదటిసారి కాదు. గత ఏడాది పార్లమెంటులో ఆర్థిక సర్వే ప్రవేశపెడుతూ సంబంధిత శాఖామంత్రి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. దేశంలో ఊబకాయుల సంఖ్య రానురాను పెరుగుతోందన్న ఆర్థిక మంత్రి.. రోగాలబారిన పడుతున్న 54 శాతం మందిలో ఆహారపుటలవాట్లే అందుకు కారణమన్నారు. సాంక్రామిక వ్యాధులతో పోలిస్తే, భారతదేశంలో టైప్ 2 మధుమేహం, గర్భాశయ, కాలేయ, వక్షోజ క్యాన్సర్లు, గుండెజబ్బుల పీడితులే అధికం. దీనికి ఊబకాయం కూడా తోడైందని పలు ఆరోగ్య సంస్థలు ఎప్పటినుంచో ఘోషిస్తున్నాయి.

ప్రముఖ వైద్య విజ్ఞాన పత్రిక ‘లాన్సెట్’ గత ఏడాది ప్రచురించిన ఒక సర్వేలో 2022లో ఐదు నుంచి 19 ఏళ్ల లోపువారు 12 మిలియన్లమంది ఊబకాయంతో బాధపడుతున్నట్లు స్పష్టం చేసింది. 1990లో వీరి సంఖ్య 0.4 మిలియన్లుగా మాత్రమే ఉన్నదంటే ఒబేసిటీ ఎంత వేగంగా విస్తరిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు 30 ఏళ్లు పైబడినవారిలోనే ఒబేసిటీ సమస్య ఎక్కువగా ఉండేది కాగా, ఇప్పుడు చిన్నా పెద్దా అనే వయోభేదం లేకుండా అన్ని వయసులవారిపైనా ఈ మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. మారిన ఆహారపుటలవాట్లే ఇందుకు ప్రధాన కారణం.

ఆహార ధాన్యాలను తగ్గించి జంక్‌ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, శీతల పానీయాలు, తీపిపదార్థాలను ఎక్కువగా తీసుకుంటున్న కారణంగా కొనితెచ్చుకుంటున్న ముప్పు ఒబేసిటీ అంటే ఆశ్చర్యపోనక్కరలేదు. 2011- 2021 మధ్య కాలంలో మన దేశంలో అల్ట్రా ప్రాసెస్డ్ ఆహార పరిశ్రమ ఇంతై, వటుడింతై అన్న రీతిలో ఎదుగుతూ వస్తోందని ఒక సర్వేలో తేలడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. గంటల కొద్దీ కూర్చుని పనిచేసే ఉద్యోగులు ఊబకాయం బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఆ మధ్య హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పరిశోధకులు జరిపిన సర్వేలో ఎక్కువగా ఐటి ఉద్యోగులు ఒబేసిటీకి లోనవుతున్నట్లు తేలింది.

శరీరంలోకి చేరే క్యాలరీలకు, ఖర్చయ్యే క్యాలరీలకు మధ్య సమతూకం లోపిస్తే, కొవ్వు శరీరంలో పేరుకుపోయి స్థూలకాయానికి దారితీస్తుందని వైద్యులు పదేపదే చేస్తున్న హెచ్చరికలు నేటి యువతీయువకుల చెవికి ఎక్కడం లేదు. కేవలం ఆహారపుటలవాట్లే కాకుండా ఒత్తిడి, నిద్రలేమి, ఆందోళన, హార్మోన్ల అసమతుల్యత కూడా స్థూలకాయానికి దారితీస్తాయని వైద్యులు చెబుతున్నారు. దీనికితోడు ఊబకాయులు సాధారణంగా ఆత్మన్యూనతకు, కుంగుబాటుకూ లోనవుతూ ఉంటారు. వీటిన్నింటికీ ఒకే ఒక్క మందు- వ్యాయామాన్ని దినచర్యలో భాగం చేసుకోవడం.

అందుకు ఇచ్చగించని యువతీయువకులు బరువును తగ్గించుకునేందుకు లైపోసక్షన్, బేరియాట్రిక్ సర్జరీ వంటి శస్త్రచికిత్సా విధానాలవైపు మొగ్గడం విచారకరం. ఒబేసిటీని అధిగమించేందుకు తమ జీవనశైలిని మార్చుకుని, చక్కటి ఆహారపుటలవాట్లను అందిపుచ్చుకోవడం అవసరం. ఇందులో భాగంగా పసితనంనుంచి పిల్లలకు పోషకాహారాన్ని అలవాటు చేయడం తల్లిదండ్రుల బాధ్యత. అలాగే చిన్నప్పటినుంచే వారికి యోగా, ధ్యానం, వ్యాయామం నేర్పించాలి. ప్రస్తుతానికి ఒబేసిటీని తగ్గించే మందులు అంతగా లేకపోయినా భవిష్యత్తులో వ్యాక్సీన్ కనుగొనే దిశగా ప్రయోగాలు జరుగుతున్నాయన్న తాజా వార్తలు ఊబకాయులకు ఊరటనిచ్చేవే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News