హైదారబాద్: మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌పై ఆరోపణలు చేయడం సిఎం రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారని ఎంఎల్‌సి కవిత విమర్శలు గుప్పించారు. తెలంగాణ భవన్ నుంచి కవిత మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన తరువాత రేవంత్ రెడ్డి అంతులేని అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. మోడీ డైరెక్షన్‌లో రేవంత్ పనిచేస్తున్నారని, ఆర్‌ఎస్‌ఎస్ సిఎంగా రేవంత్ వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్, బిజెపి మధ్య భాగస్వామ్యం ఉంది కాబట్టే తాము వాస్తవాలు బయటపెట్టగానే బిజెపి నాయకులు బిఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కెసిఆర్ కుటుంబంపై కుట్ర జరుగుతుందని అనుమానంగా ఉందన్నారు. దుబాయ్‌లో కేదార్ మృతి, రాజలింగమూర్తి హత్యతో కెసిఆర్ కుటుంబానికి, పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఆదాయం పడిపోవడానికి ప్రధాన కారణం హైడ్రా అని కవిత మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు రూ. 6500 కోట్ల వడ్డీ కడుతున్నామని అబద్దాలు చెబుతుందని, కానీ కాగ్ నివేదిక ప్రకారం ఏ నెల కూడా రూ. 2600 కోట్లకు మించి వడ్డీ కట్టలేదని, మరి 6500 కోట్లు కడుతున్నామని రేవంత్ ఎందుకు అబద్దాలు చెబుతున్నారని కవిత ప్రశ్నించారు. అబద్దాలు పదేపదే చెబితే నిజమవుతాయేమోనన్న భ్రమలో రేవంత్ ఉన్నారని చురకలంటించారు. ఈ అబద్దపు లెక్కలు ఎందుకు చెబుతున్నట్లు? ఎవరిని మభ్యపెడుతున్నట్టు అని అడిగారు.