న్యూఢిల్లీ :ప్రధాని మోడీ డిగ్రీ విద్యార్హత సమాచారం వెల్లడి చేయాలని కేంద్ర సమాచార కమిషన్ జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఉభయ వర్గాల వాదనలు విన్న తరువాత ఢిల్లీ యూనివర్శిటీ అభ్యర్ధనపై తీర్పును రిజర్వు చేసింది. ‘వాదనలు విన్నాం. తీర్పును రిజర్వు చేశాం’ అని జస్టిస్ సచిన్ దత్తా వెల్లడించారు. ఢిల్లీ యూనివర్శిటీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్‌మెహతా కోర్టుకు హాజరై తన వాదనలు వినిపించారు. కేంద్ర సమాచార కమిషన్ ఉత్తర్వులను పక్కన పెట్టవచ్చని వ్యాఖ్యానించారు.
ప్రధాని మోడీ విద్యార్హతకు సంబంధించిన రికార్డును చూపించడానికి ఢిల్లీ యూనివర్శిటీకి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.1978 లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్ నుంచి పొందిన డిగ్రీగా ఆయన వివరించారు. నీరజ్ అనే వ్యక్తి ఆర్‌టిఐకి దరఖాస్తు చేయగా, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సిఐసి) 1978 లో బీఏ పరీక్షలు రాసి పాసైన విద్యార్థులందరి రికార్డులను పరిశీలించడానికి అనుమతించింది. ఆ సంవత్సరమే ప్రధాని మోడీ కూడా ఉత్తీర్ణులయ్యారు. దీనిపై 2016 డిసెంబర్ 21న సిఐసి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై హైకోర్టు 2017 జనవరి 23న స్టే విధించింది.
ఫిబ్రవరి 11న ఢిల్లీ యూనివర్శిటీ దీనిపై తన వాదనలు వినిపించింది. తమ దగ్గర విశ్వసనీయ సమాచారం ఉందని, అయితే సమాచార హక్కు కింద ప్రజా ప్రయోజనం కాకుండా ప్రైవేట్ సమాచారం కోరే హక్కు ఎవరికీ లేదని వాదించింది. ఈ సమాచారం కేవలం ఫిర్యాదు దారుని ఉత్సుకత కోసమే అని వ్యాఖ్యానించింది. ప్రధాని మోడీ తోసహా 1978లో బీఏ ప్యాసైన విద్యార్థులందరి రికార్డులను కోరడం ఆర్‌టిఐ యాక్టు హాస్యాస్పద స్థాయికి తగ్గిపోయిందని ఢిల్లీ యూనివర్శిటీ వ్యాఖ్యానించింది.