న్యూఢిల్లీ : జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ (ఎన్‌సిఎస్‌సి)లో ఖాళీగా ఉన్న కీలక పదవులపై ప్రభుత్వం వ్యవహరణ తీరును లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ శుక్రవారం తప్పు పట్టారు. దళితుల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణ బాధ్యతను కమిషన్ సమర్ధంగా నిర్వహించేలా చూసేందుకు కమిషన్‌లోని కీలక పదవుల ఖాళీని భర్తీ చేయవలసిందిగా ప్రధాని నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. కమిషన్‌లోని ఖాళీ పదవులు బిజెపి ప్రభుత్వ ‘దళిత వ్యతిరేక మనస్తత్వానికి’ సూచిక అని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు.
కమిషన్ రాజ్యాంగబద్ధ వ్యవస్థ అని, దానిని బలహీనపరచడం దళితుల రాజ్యాంగ, సాంఘిక హక్కులపై ప్రత్యక్ష దాడి అని ఆయన అన్నారు. ‘బిజెపి ప్రభుత్వవ దళిత వ్యతిరేక మనస్తత్వానికి మరొక నిదర్శనం చూడండి! దళితుల హక్కులను పరిరక్షించే జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్‌ను ఉద్దేశపూర్వకంగా నిర్లక్షం చేస్తున్నారు. కమిషన్‌లో రెండు కీలక పదవులు గడచిన ఏడాది కాలంగా ఖాళీగా ఉన్నాయి’ అని రాహుల్ ‘ఎక్స్’లో హిందీ పోస్ట్‌లో ఆరోపించారు. ‘ఆ కమిషన్ రాజ్యాంగబద్ధ వ్యవస్థ. దానిని బలహీనపరచడం దళితుల రాజ్యాంగ, సాంఘిక హక్కులపై నేరుగా దాడి చేయడమే అవుతుంది.
కమిషన్ కాకపోతే ప్రభుత్వంలో దళితుల వాణిని ఎవరు వింటారు? వారిఫిర్యాదులపై ఎవరు చర్య తీసుకుంటారు?’ అని రాహుల్ పేర్కొన్నారు. ‘ప్రధాని గారు! కమిషన్‌లోని అన్ని పదవులను సాధ్యమైనంత త్వరగా భర్తీ చేయాలి. దాని వల్ల అది దళితుల హక్కులను, ప్రయోజనాలను పరిరక్షించే తన బాధ్యతను సమర్థంగా నెరవేర్చగలదు’ అని రాహుల్ సూచించారు. షెడ్యూల్డ్ కులాల వారు దోపిడీకి గురి కాకుండా, వారి సాంఘిక, విద్య, ఆర్థిక, సాంస్కృతిక ప్రయోజనాల పరిరక్షణ జరిగేలా చూసేందుకు ఏర్పాటు చేసిన రాజ్యాంగబద్ధ వ్యవస్థ జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్. కమిషన్ వెబ్‌సైట్ ప్రకారం, కిశోర్ మక్వానా సారథ్యంలోని కమిషన్‌లో వైస్ చైర్మన్, ఒక సభ్యుని పదవులు ఖాళీగా ఉన్నాయి.