Saturday, March 1, 2025

భారత్ 2047 నాటికి అత్యధిక ఆదాయ దేశం కావాలంటే…: ప్రపంచ బ్యాంకు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత్ 2047 నాటికి అత్యధిక ఆదాయ దేశం కావాలంటే సగటున 7.8 శాతం వార్షిక వృద్ధిని సాధించాల్సి ఉంటుందని ప్రపంచ బ్యాంకు శుక్రవారం తన నివేదికలో పేర్కొంది. ఇందుకు ఆర్థిక రంగంలో, అలాగే భూ, లేబర్ మార్కెట్‌లో సంస్కరణలు తీసుకురావలసి ఉంటుందని తెలిపింది. స్వాతంత్య్రం సాధించి 100 సంవత్సరాలు (2047 నాటికి) చేరుకునే సమయానికి ఈ లక్ష్యాన్ని భారత్ సాధించాల్సి ఉంటుందని ప్రపంచ బ్యాంకు ‘బికమింగ్ హైఇన్‌కమ్ ఎకనామీ ఇన్ ఏ జనరేషన్’ అనే టైటిల్ ఉన్న ఇండియా కంట్రీ మెమోరాండ్‌లో పేర్కొంది.

2000 నుంచి 2024 మధ్య కాలంలో భారత్ సగటున 6.3 శాతం వృద్ధిని సాధించిందన్న విషయాన్ని ప్రపంచ బ్యాంకు గుర్తించింది. భారత్ గతంలో సాధించిన పునాదులపై దాని భవిష్యత్తు ఆశయాలు నిర్మితమవుతాయని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో తెలిపింది. భారత్ 2047 నాటికి వికసిత్ భారత్ కావాలనుకుంటే ఇప్పుడున్న స్థాయికి తలసరి స్థూల జాతీయాదాయం 8 రెట్లు పెరగాల్సి ఉంటుందని వివరించింది. ‘2047 నాటికి అధిక ఆదాయాన్ని చేరుకోవడానికి, భారత్ వృద్ధి రేటు రాబోయే దశాబ్దాలలో వాస్తవపరంగా సగటున 7.8 శాతం ఉండాలి.

వేగవంతమైన సంస్కరణల ప్యాకేజీ మాత్రమే 2047 నాటికి భారత్‌ను అధిక ఆదాయ దేశంగా మలచగలదు’ అని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది. చిలీ, కొరియా, పోలాండ్ వంటి దేశాలు మధ్య స్థాయి నుండి అధిక ఆదాయ దేశాలుగా ఎలా పరివర్తన చెందాయో అర్థం చేసుకోవాలని ప్రపంచ బ్యాంక్ ఇండియా డైరెక్టర్ అగస్టే టానో కౌమే సూచించారు. భారత్ తన లక్ష్యాన్ని చేరుకోవడానికి మరిన్ని ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల్లో మెరుగుద, మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేట్లను 35.6 శాతం నుంచి 50 శాతానికి పెంచడం వంటి చర్యలు తీసుకోవాలన్నారు.

ఆధునిక సాంకేతికత, లేబర్ మార్కెట్‌ను మెరుగుపరచడం, సంస్థల మీద భారాన్ని తగ్గించడం వంటివి ఉత్పత్తి డ్రైవ్‌ను మరింత ముందుకు తీసుకెళతాయని, థాయ్‌లాండ్, వియత్నాం, చైనా వంటి గ్లోబల్ వ్యాల్యూ చైన్‌లో సరసన భారత్‌ను నిలబెడతాయని తెలిపారు. 2000 నుంచి ఇప్పటి వరకు భారత ఆర్థిక వ్యవస్థ దాదాపు నాలుగు రెట్లు, తలసరి ఆదాయం మూడు రెట్లు పెరిగిందని నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం భారత్ ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News