ఢాకా : బంగ్లాదేశ్ నేషనల్ కరికులమ్ అండ్ టెక్ట్ బుక్ బోర్డు రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాల విద్య పాఠ్యాంశాల్లో కీలక మార్పులు చేసింది. పాఠ్య పుస్తకాల్లోంచి మాజీ ప్రధాని షేక్ హసీనా అనే పేరును పూర్తిగా తొలగించింది. దీంతోపాటు బంగబంధు షేక్ ముజిబుర్ రెహ్‌మాన్, భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిత్రాలను కూడా తొలగించింది. బంగ్లా స్వాతంత్య్ర ఉద్యమంలో భారత్ పాత్రను తగ్గిస్తూ కొత్త పుస్తకాల్లో మార్పులు చేసింది. 1972 ఫిబ్రవరి 6న కోల్‌కతా ర్యాలీలో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ , ముజిబుర్ రెహమాన్ పాల్గొని ప్రసంగించారు.
ఆ తర్వాత అదే ఏడాది మార్చిలో ఇందిరాగాంధీ ఢాకాలో పర్యటించారు. ఈ రెండు సంఘటనలకు సంబంధించిన ఫోటోలు ఇప్పటివరకు చరిత్ర పుస్తకాల్లో ఉండగా, సవరించిన పాఠ్యాంశాల్లో వీటిని తొలగించారు. అయితే 1971 నాటి యుద్ధంలో భారత ఆర్మీ ముక్తివాహిని పాల్గొన్న అంశాలు, ఆ ఏడాది డిసెంబర్ 16న పాక్‌సైన్యం లొంగిపోయిన దృశ్యాలను కొత్త సిలబస్‌లో కొనసాగించారు. ఇక బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం రావడానికి భారత్ కారణమంటూ గతంలో దేశ చరిత్రలో పేర్కొన్నారు. తాజా సవరణలో ఈ అంశాన్ని మార్చారు. తొలుత భూటాన్ తమకు సాయం చేసిందని పేర్కొన్నారు.
అంతకు ముందు అన్ని పాఠ్య పుస్తకాల వెనుక పేజీలో మాజీ ప్రధాని షేక్ హసీనా సందేశం ఉండగా, కొత్త పుస్తకాల్లో దాన్ని తొలగించారు. ఆమె తండ్రి రెహమాన్ నాయకత్వాన్ని కీర్తిస్తూ రాసిన అంశాలను కూడా తగ్గించారు.దాని స్థానంలో స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న ఇతర రాజకీయ నేతల ప్రస్తావనను తాజా సవరణలతో ప్రైమరీ, సెకండరీ. ఉన్నత విద్యకు సంబంధించిన 441 పుస్తకాల్లో మార్పులు చేయాల్సివస్తోంది. 2025 విద్యా సంవత్సరానికి గాను 40 కోట్లకు పైగా కొత్త పుస్తకాలను ముద్రించ నున్నట్టు తాత్కాలిక ప్రభుత్వం లోని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. దీనిపై ఎన్‌సిటీబీ ఛైర్‌పర్సన్ రీజుల్ హసన్ మాట్లాడుతూ 2012 కరికులమ్ ఫ్రేమ్‌వర్క్‌కు అనుగుణంగా సవరణలు చేసినట్టు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని మార్పులు తీసుకురానున్నట్టు పేర్కొన్నారు.