జిఎంఆర్ సంస్థ ఎన్‌ఒసి ఇవ్వడంతో లైన్‌క్లియర్
శంషాబాద్ విమానాశ్రయం నుంచి 150 కి.మీ
పరిధిలో మరో ఎయిర్‌పోర్టు ఉండకూడదన్న
నిబంధన నుంచి మినహాయింపు ప్రధాని
మోడీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృతజ్ఞతలు
మన తెలంగాణ/హైదరాబాద్ : వరంగల్ వాసులకు కేంద్ర ప్ర భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మా మునూర్ ఎయిర్‌పోర్టుకు అనుమతిని మంజూరు చేస్తూ తా జాగా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి అ మిత్ కుమార్ జా, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్‌కు లేఖ రాశారు. మామునూర్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి, తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విమానాశ్రయ సంస్థ అభ్యర్థనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీంతో మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణం మరింత వేగంగా ముందుకు సాగనుంది. గత పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎన్‌ఓసి అడ్డంకిని రాష్ట్ర ప్రభుత్వం జీఎంఆర్ సంస్థ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి, బోర్డులో పెట్టి ఎన్‌ఓసి ఇచ్చేలా చేసింది. దీంతో హెచ్‌ఏఐఎల్ తన బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని మామునూరు విమానాశ్రయం అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల నిబంధనను సవరిస్తూ ఎన్‌ఓసి ఇచ్చారు. ఇప్పుడు ఈ ‘నో అబ్జెక్షన్ సర్టిఫికేట్’ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదించింది. ఇప్పటికే మామునూరు ఎయిర్ పోర్టు భూసేకరణకు తెలంగాణ ప్రభుత్వం రూ.205 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే.
డిసెంబర్‌లోగా దేశీయ విమానాల రాకపోకలు
కాగా, మామునూరు ఎయిర్ పోర్టులో తొలి దశను డిసెంబర్‌లోగా పూర్తి చేసి దేశీయ విమానాల రాకపోకలను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. కేరళ రాష్ట్రంలోని ప్రఖ్యాత కొచ్చిన్ అంతర్జాతీయ విమానశ్రయం తరహాలో మామునూరు ఎయిర్‌పోర్టు ఉండాలని సిఎం రేవంత్ రెడ్డి గతంలో అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇక ఈ ఏడాది నుంచి విమానాశ్రయంలో దేశీయ విమానాలు నడిచేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలంలో నిర్మించనున్న ఈ మామూనూరు ఎయిర్‌పోర్టు కోసం ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం గతంలో సంప్రదింపులు చేసింది. తాము సూచించిన అదనపు భూమి కేటాయిస్తే ఎయిర్ పోర్టు నిర్మాణ వ్యవహారాలు ప్రారంభిస్తామంటూ ఏఏఐ రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో లేఖ రాసింది. ప్రస్తుతమున్న 1.8 కి.మీ రన్‌వేను 3.9 కి.మీకి విస్తరించడానికి వీలుగా భూసేకరణ అవసరమని తెలిపింది. దీంతో బోయింగ్ 747 వంటి పెద్ద విమా నాలు కూడా రావడానికి వెసులుబాటు దొరుకుతుందని ఏఏఐ పేర్కొంది. విమానాశ్రయ నిర్మాణానికి మొత్తం 950 ఎకరాలు కావాలని ఏఏఐ వివరించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ కసరత్తు చేస్తోంది. మామూనూరు ఎయిర్‌పోర్ట్కు ప్రస్తుతం 693 ఎకరాల స్థలంలో ఉంది.
253 ఎకరాల అదనపు భూమిని అప్పగించేందుకు సిద్ధం: మంత్రి కోమటిరెడ్డి
ఈ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం సంతోషకరమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మామునూర్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి, తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విమానాశ్రయ ప్రాధికార సంస్థ అభ్యర్థనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. మామునూర్ ఎయిర్ పోర్టు అభివృద్ధికి కావాల్సిన 253 ఎకరాల అదనపు భూమిని రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయ ప్రాధికార సంస్థ (ఏఏఐ)కి అప్పగించేందుకు ఇంతకు ముందే రూ.205 కోట్ల రూపాయలను విడుదల చేసిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఎయిర్ పోర్టుకు కావాల్సిన అన్ని అనుమతులు రావడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హర్షణీయం: మంత్రి కొండా సురేఖ
తన సొంత జిల్లా వరంగల్ లోని మామునూర్ ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హర్షణీయమని, ఇందుకోసం కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కేంద్ర మంత్రులకు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ కృతజ్ఞతలు తెలిపారు. మామునూర్ ఎయిర్‌పోర్టు కోసం అవసరమైన 253 ఎకరాల అదనపు భూమిని సేకరించడంలో తనకు సహకరించిన అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులకు మంత్రి కొండా కృతజ్ఞతలు తెలిపారు.
ధన్యవాదాలు తెలిపిన సిఎం రేవంత్‌రెడ్డి
వరంగల్ మామునూరు విమానాశ్రయానికి అనుమతి మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడుకి అలాగే ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేశారు