తెలంగాణకు ఎన్ని ప్రాజెక్టులు తెచ్చారో ప్రజలకు చెప్పాలి మూసీని,
మెట్రోను అడ్డుకుంటున్నదే కిషన్‌రెడ్డి నిర్మలా సీతారామన్
తమిళనాడుకు మెట్రో ఇప్పించారు మరి.. కిషన్‌రెడ్డి ఎందుకు
ఇప్పించడం లేదు? ఎప్పటిలోగా తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు
తెస్తారో ఆయన ప్రజలకు చెప్పాలి అనుమతులు సంపాదించిన
తరువాతే ఆయన తెలంగాణకు రావాలి హైదరాబాద్‌కు వచ్చిన
సెమీకండక్టర్ పరిశ్రమను గుజరాత్‌కు తరలించుకుపోయారు
తెలుగు పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం డీలిమిటేషన్‌తో దక్షిణాదికి
తీవ్ర అన్యాయం గాంధీభవన్ మీడియా సమావేశంలో సిఎం రేవంత్
అంతకుముందు కిషన్‌రెడ్డికి 9పేజీల బహిరంగలేఖ రాసిన సిఎం
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వల్లే రాష్ట్రానికి ప్రాజెక్టులు రావడం లేదని, తెలంగాణ పాలిట ఆయన సైంధవుడిలా మారారని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బిఆర్‌ఎస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇద్దరు చీకటి మిత్రులని సిఎం అన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం తీరుపై సిఎం రేవంత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కిషన్ రెడ్డి వల్లే రాష్ట్రానికి మెట్రో ప్రాజెక్టు అనుమతి లభించడం లేదన్నారు. వారు ప్రత్యేకంగా తెలంగాణకు తీసుకొచ్చిన ప్రాజెక్టు ఏమిటో చెప్పాలని కిషన్ రెడ్డిని సిఎం రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. నోరు వేసుకొని బెదిరిస్తే భయపడేవారు ఇక్కడెవరూ లేరని ఆయన అన్నారు. మెట్రో, ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని సిఎం రేవంత్ ఆరోపించారు. సబర్మతి సుందరీకరణను ప్రశంసించిన కిషన్ రెడ్డి మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ఆయన సిఎం రేవంత్ ప్రశ్నించారు.
యూపీ, బీహార్‌లకే కేంద్రం నిధులు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్న విధానం చూస్తే తనకు నవ్వొస్తుందని సిఎం రేవంత్ అన్నారు. తాము అడుగుతోంది ప్రధాని మోడీ ఆస్తి కాదన్నారు. తాము కట్టిన పన్నుల నుంచి తమకు నిధులు ఇవ్వమని మాత్రమే అడుగుతు న్నామని సిఎం రేవంత్ తెలిపారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి భారీగా పన్నులు వెళుతున్నాయని, తెలంగాణ చెల్లించిన పన్నుల్లో పావలా కూడా రాష్ట్రానికి రావడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులన్నీ యూపీ, బీహార్‌లకే ఇస్తోందని ఆయన విమర్శించారు. రాష్ట్రానికి మీరేం సాధించారో చెప్పాలని, తెలంగాణలో ప్రాజెక్టుల గురించి కేంద్రమంత్రి వర్గంలో ఎప్పుడైనా ప్రస్తావించారా? అని సిఎం రేవంత్ ప్రశ్నించారు. ఇప్పటివరకు ఎన్ని ప్రాజెక్టులను మీరు రాష్ట్రానికి సాధించారో చెప్పాలని సిఎం రేవంత్ డిమాండ్ చేశారు. మీకు చిత్తశుద్ధి లేదని, మీరు సైంధవ పాత్ర పోషిస్తున్నారని, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులకు అనుమతులు తీసుకొని హైదరాబాద్‌కు రావాలని సిఎం రేవంత్ డిమాండ్ చేశారు.
నల్లచట్టాల పేరుతో వందలమంది బలి
గతంలో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారని, ఎన్ని కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని సిఎం రేవంత్ డిమాండ్ చేశారు. తెలంగాణలో కేంద్రం ఎన్ని ఇళ్లు ఇచ్చిందో చెప్పాలన్నారు. రైతులకు నల్ల చట్టాలు తీసుకొచ్చిన కేంద్రం వందల మందిని బలితీసుకుందన్నారు. మెట్రో నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు ఉన్నాయా అని కిషన్ రెడ్డి అవహేళన చేస్తున్నారన్నారు. తాము ఢిల్లీకి వెళ్లి లిక్కర్ దందాలు చేయడం లేదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం వెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు.
భాషను బలవంతంగా రుద్దొద్దు
ఏ రాష్ట్రంపైనా ఒక భాషను బలవంతంగా రుద్దొద్దని సిఎం రేవంత్ తెలిపారు. మన మాతృభాష తెలుగు పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. ప్రభుత్వం అన్ని జీఓలను తెలుగులో ఇస్తోందన్నారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాదిలో ఎంపి సీట్లు తగ్గవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెబుతున్నారని, సీట్లు తగ్గవు అంటున్నారు, కానీ, పెరుగుతాయని మాత్రం ఎక్కడా చెప్పడం లేదన్నారు. డీలిమిటేషన్ పేరిట దక్షిణాదికి అన్యాయం చేసేందుకు భాజపా కుట్ర చేస్తోంది. ఉత్తరాదిలో సీట్లు పెంచుకొని ఆ రాష్ట్రాల సీట్లతోనే అధికారంలోకి రావాలని బిజెపి చూస్తోందన్నారు. ఇప్పటికే నిధులన్నీ ఉత్తరాది రాష్ట్రాలకు ఇస్తూ దక్షిణాదికి అన్యాయం చేస్తున్నారన్నారు. సీట్లు రాని దక్షిణాది రాష్ట్రాలను మాత్రం నిర్వీర్యం చేయాలని ప్రయత్ని స్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు.
దమ్ముంటే ఎపిలో మైనార్టీ రిజర్వేషన్‌లను రద్దు చేయాలి
కాంగ్రెస్ నిర్మాణం ద్వారా బలమైన పునాదులు వేస్తామన్నారు. పేద వారికి కాంగ్రెస్ అందుబాటులో ఉండేలా చేస్తామని సిఎం రేవంత్ స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించామని ముఖ్యమంత్రి చెప్పారు. కార్యకర్త మనసు ఎరిగిన నాయకురాలు మీనాక్షీ నటరాజన్ అని ఆయన తెలిపారు. దమ్ముంటే ఎపిలో మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేయాలని కేంద్రంలోని బిజెపి అగ్రనేతలకు సిఎం రేవంత్ సవాల్ విసిరారు. అలాగే బిజెపి పాలిత రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లు బిసి కేటగిరిలో ఉన్నాయని సిఎం రేవంత్ గుర్తు చేశారు. ఎన్నికల కోసం మందకృష్ణను బిజెపి కౌగిలించుకుంద న్నారు. అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణ ఎందుకు చేయడం లేదంటూ బిజెపి నేతలను సిఎం రేవంత్ ప్రశ్నించారు.