లాహోర్: ఆస్ట్రేలియా జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీ ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ వర్షం వల్ల అర్ధాంతరంగా రద్దయ్యింది. దీంతో ఆస్ట్రేలియా, అఫ్గాన్‌లకు చెరో పాయింట్ లభించింది. నాలుగు పాయింట్లు సాధించిన ఆస్ట్రేలియా సెమీస్‌కు చేరుకుంది. ఇక మ్యాచ్ రద్దు కావడంతో అఫ్గాన్ సెమీస్ అవకాశాలకు దాదాపు తెరపడినట్టే చెప్పాలి.
శనివారం జరిగే మ్యాచ్‌లో ఇంగ్లండ్ భారీ తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేస్తేనే అఫ్గాన్‌కు సెమీస్ చేరే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సౌతాఫ్రికా అనాధికారికంగాసెమీస్‌కు చేరుకుందనే చెప్పాలి. ఇక ఈమ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 273 పరుగులు చేసింది. సిద్ధిఖుల్లా అటల్ (85), అజ్మతుల్లా (67) జట్టును ఆదుకున్నారు. తర్వాత బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా 12.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 109పరుగులు చేసింది. ఆ తర్వాత వర్షం రావడంతో మ్యాచ్‌ను రద్దు చేయక తప్పలేదు.