కరాచీ: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శనివారం జరిగే గ్రూప్‌బి చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో సౌతాఫ్రికా తలపడనుంది. ఇంగ్లండ్ ఇప్పటికే ఇంటిదారి పట్టింది. సౌతాఫ్రికా సెమీ ఫైనల్ ఆశలు ఇంకా మిగిలేవున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సౌతాఫ్రికా నేరుగా సెమీస్ బెర్త్‌ను సొంతం చేసుకుంటోంది. ఓడినా జట్టుకు నాకౌట్ అవకాశాలు మిగిలేవుంటాయి. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ ఓటమి చూస్తే ఈ పోరుతో సంబంధం లేకుండా ఆస్ట్రేలియాతో పాటు సఫారీ టీమ్ కూడా సెమీస్‌కు చేరుకుంటుంది. ఒకవేళ అఫ్గాన్ గెలిస్తే మాత్రం ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి సౌతాఫ్రికా ఉంటుంది. అప్పుడూ రన్‌రేట్ కీలకంగా మారే అవకాశం ఉంది.
ఇలాంటి స్థితిలో దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌లో విజయమే లక్షంగా పెట్టుకుంది. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే కూడా సఫారీకి నాకౌట్ బెర్త్ ఖాయమవుతోంది. ఆస్ట్రేలియాతో జరిగిన కిందటి మ్యాచ్ వర్షం వల్ల ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యింది. ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ప్రమాదం పొంచి ఉంది. పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు వర్షం వల్ల రద్దయ్యాయి. పాకిస్థాన్‌బంగ్లాదేశ్, సౌతాఫ్రికాఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లు వర్షం బారిన పడ్డాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో ఈ రెండు మ్యాచ్‌ల్లో కనీసం టాస్ కూడా వేసే పరిస్థితి లేకుండా పోయింది.
గెలుపే లక్షంగా..
ఇక, ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయమే లక్షంగా పెట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దక్షిణాఫ్రికా బలోపేతంగా కనిపిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు కొదవలేదు. రియాన్ రికెల్టన్, కెప్టెన్ తెంబ బవుమా, వండర్ డుసెన్, ఐడెన్ మార్‌క్రమ్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, మార్కొ జాన్సన్, కేశవ్ మహారాజ్, తబ్రేస్ షంసి వంటి మ్యాచ్ విన్నర్లు జట్టులో ఉన్నారు. అంతేగాక రబడా, ఎంగిడి వంటి ప్రపంచ శ్రేణి బౌలర్లు కూడా జట్టులో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఈమ్యాచ్‌లో సౌతాఫ్రికా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
పరువు కోసం..
మరోవైపు ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన ఇంగ్లండ్ కనీసం చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి కాస్తయిన పరువును కాపాడుకోవాలని భావిస్తోంది. ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్‌లతో జరిగిన మ్యాచుల్లో ఇంగ్లండ్ పరాజయం చవిచూసింది. దీంతో ఇంగ్లీష్ టీమ్ సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. ఇలాంటి స్థితిలో కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి హుందాగా టోర్నీ నుంచి బయటపడాలని తహతహలాడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇంగ్లండ్ సమతూకంగా ఉంది. బెన్ డకెట్ ఆస్ట్రేలియాపై విధ్వంసక శతకం సాధించాడు. జోస్ బట్లర్, హ్యారి బ్రూక్, జో రూట్, జేమీ స్మిత్, లివింగ్‌స్టోన్, ఫిలిప్ సాల్ట్ తదితరులతో ఇంగ్లండ్ బలంగా కనిపిస్తోంది. ఆదిల్ రషీద్, ఆర్చర్, మార్క్‌వుడ్, సాఖిబ్ మహమూద్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా జట్టులో ఉన్నారు. ఇలాంటి స్థితిలో ఇంగ్లండ్ కూడా గెలుపుపై కన్నేసింది.