Saturday, March 1, 2025

కడుపుబ్బ నవ్వించే ‘మ్యాడ్ స్క్వేర్’

- Advertisement -
- Advertisement -

బ్లాక్ బస్టర్ చిత్రం ‘మ్యాడ్’కి సీక్వెల్‌గా రూపొందుతోన్న ’మ్యాడ్ స్క్వేర్’ కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ఓఐ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈనెల 29న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇటీవల విడుదలైన టీజర్ కు విశేష స్పందన లభించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో హీరో నార్నే నితిన్ మాట్లాడుతూ “మ్యాడ్- 1కి అద్భుతమైన స్పందన లభించింది. ఈసారి మ్యాడ్-2 దానికి మించి ఉంటుంది.

థియేటర్లలో ఎవరూ సీట్లలో కూర్చొని ఉండరు. అంతలా నవ్వుతారు సినిమా చూస్తూ”అని అన్నారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ “మంచి సినిమా తీశాము. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాము. రెండు గంటల పాటు మనస్ఫూర్తిగా నవ్వుకోవడానికి ఈ సినిమాకి రండి. స్నేహితులతో కలిసి మా సినిమా చూసి ఎంజాయ్ చేయండి”అని పేర్కొన్నారు. దర్శకుడు కళ్యాణ్ శంకర్ మాట్లాడుతూ “మ్యాడ్ సినిమాను మీరందరూ చూసి ఎంజాయ్ చేశారు. ’మ్యాడ్ స్క్వేర్’ అయితే దానికి పది రెట్లు ఉంటుంది. ప్రతి సీనూ మిమ్మల్ని నవ్విస్తుంది. ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ కొడుతున్నాం అనే నమ్మకం ఉంది”అని తెలిపారు. నిర్మాత హారిక సూర్యదేవర మాట్లాడుతూ “మ్యాడ్ స్క్వేర్ పై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది. థియేటర్లలో ఈ సినిమా చూసి హ్యాపీగా నవ్వుకోండి”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హీరోలు సంగీత్ శోభన్, రామ్ నితిన్, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News