విద్యార్థులకు పరీక్షలు అనగానే ఆందోళన చెందడం మానసిక ఒత్తిడికి, మానసిక ఆందోళనకు గురికావడం చేస్తుంటారు. అనేక మంది విద్యార్థులకు జ్వరం రావడం, కొంత మంది విద్యార్థులకు నీరసంగా ఉండటం, మరికొంత మంది విద్యార్థులకు తల తిరగడం, వాంతులు చేసుకోవడం చేస్తున్నారు. మానసిక శాస్త్రవేత్తలు, వైద్యనిపుణులు, డాక్టర్‌లు విద్యార్థులకు పరీక్షల సమయంలో కనీసం 6 నుండి 7 గంటల వరకు నిద్ర అవసరమని అంటున్నారు. ఎంత ప్రతిభ కలిగిన విద్యార్థులైనా నిద్ర లేమి వల్ల చదివింది మరచిపోవడం, చదివినది జ్ఞాపకం రాక సమయం వృథా కావడం జరుగుతుంది. పరీక్ష హాల్ లో నిద్రపోవడం లాంటివి జరుగుతుంటాయి.
పరీక్షలోని ఇన్విజిలేటర్ పేపర్ ఇవ్వగానే గబగబా రాయకుండా మొత్తం ఒకసారి ప్రశాంతంగా చదవాలి. ప్రశ్నాపత్రం చేతికిరాగానే ముందు మంచిగా వచ్చిన ప్రశ్నలను టిక్కు పెట్టుకోవాలి, తర్వాత మిగిలిన ప్రశ్నలను రాయాలి. ఈ విధంగా ప్రశ్నలు పూర్తి చేయాలి. 20 మార్కుల కోసం అర్ధగంట ముందు ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో కూడిన ప్రశ్నాపత్రం ఇస్తారు. అబ్జెక్టివ్ ప్రశ్నాపత్రం ఇవ్వగానే మెయిన్ పేపర్‌కు కట్టి రాయాలి. చివరి నిమిషంలో ఆబ్జెక్టివ్ ప్రశ్నాపత్రాన్ని కట్టకపోవడం వలన కంగారు ఎక్కువవుతుంది. అసలు పేపర్లు కిందికి మీదకు అవుతాయి. తల్లిదండ్రులు విద్యార్థులకు మార్కులు, ర్యాంకులు అంటూ మానసిక ఒత్తిడికి గురి చేయరాదు. కొంతమంది తల్లిదండ్రులకు తమ పిల్లలను వేరే పిల్లలతో పోల్చడం సరికాదు. విద్యార్థులు ఆత్మన్యూనతా భావం కలుగుతుంది. చివరి నిమిషంవరకు చదవడం శ్రేయస్కరం కాదు. కొంత మంది విద్యార్థులు బస్సులలో వెళ్తూ, ఆటోలలో వెళ్తూ, స్కూటర్ మీద వెళ్తూ చదువుతూనే ఉంటారు.
పరీక్షహాల్‌లో వెళ్లే నిమిషం ముందు వరకు చదువుతూ ఆందోళన పడుతుంటారు. పరీక్షకు వెళ్ళే అర్ధగంట ముందు చదవడం పూర్తిగా ఆపివేసి ప్రశాంతంగా ఉండాలి. పరీక్షలకు ఏమేమి తీసుకెళ్ళాలి. పదవ తరగతి, ఇంటర్మీడియట్, పోటీ పరీక్షలు దేనికైనా వెళ్లేముందు హాల్‌టికెట్ తప్పకుండా తీసుకొనిపోవాలి. రెండు పెన్నులు, మంచినీటి బాటల్, దస్తీ (చిన్న టవల్ లాంటిది) తీసుకొనిపోవాలి. పరీక్ష సమయం కంటే అర్ధగంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవడం మంచిది. పరీక్ష కేంద్రంలో ప్రశాంతంగా ఉండాలి. ప్రశ్నతీరును బట్టి జవాబులు రాయాలి. ప్రశ్నల మార్కు లకు తగినట్లు సమాధానం ఉండాలి. కేవలం ఒకే ప్రశ్నను పట్టుకొని సమయం వృథా చేయకుండా ఏ ప్రశ్నకు ఎన్ని మార్కులు కేటాయించారు ఎంత సమయం కేటాయించుకోవాలి అనేది ప్రణాళికలు రూపొందించుకోవాలి. పదవ తరగతి, ఇంటర్మీడియట్ విద్య అనేది విద్యార్థులకు భవిష్యత్తును నిర్ణయించే పరీక్షలు. పరీక్షలముందు ఎలా చదవాలి అనే ప్రశ్న అనేక మందిని వేధిస్తుంటుంది. ఇప్పటికే దాదాపు అన్ని పాఠాలను పూర్తి చేసుకొని పరీక్షలకు సిద్ధం అయి ఉంటారు. దాదాపు అకాడమిక్ పరీక్షలలో గత ఐదు, ఆరు సంవత్సరాల నుండి వచ్చిన ప్రశ్నలు మళ్ళీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
గతంలో జరిగిన పరీక్ష పేపర్లు ఒక్కసారి క్షుణ్ణంగా చదవాలి. పదవ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎక్కువగా చేసే తప్పు ఏమిటంటే ప్రశ్నలను సరిగ్గా చదవకపోవడం, చదివినా అర్థం చేసుకోవడంలో తొందరపాటు, ఆత్రుత వలన తెలిసిన విషయాలను కూడా తప్పుగా జవాబులు రాసే అవకాశం ఉంది. వివరించండి? సమర్థించండి, విశదీకరించండి, మీరు ఏకీభవిస్తారా? విభేదిస్తారా? అంటూ రకరకాలుగా అడిగే అవకాశం ఉంది. సమయం అనేది కూడా చాలా ముఖ్యం. చిన్న ప్రశ్నలకు సంక్షిప్తంగా, వ్యాసరూప ప్రశ్నలకు పెద్దగా జవాబులు రాయాలి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలో వ్యాకరణం, ఉత్తరాలు రాసే విధానం తెలుసుకోవాలి. గణితంలో చాలా మంది బెంబేలెత్తిపోతారు.
ప్రణాళిక ప్రకారం ప్రతి రోజు ఐదు, ఆరు చిన్న లెక్కలు, ఐదు, ఆరు పెద్ద లెక్కలను చేస్తుండడంతో పరీక్షల సమయంలో ఒత్తిడిని తగ్గించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భౌతిక, రసాయన, బయోలజీ సబ్జెక్ట్‌లలో ఎక్కువగా ఫార్ములాలు, ఈక్వేషన్స్, డయాగ్రామ్స్, రియాక్షన్ ప్రత్యేకంగా నోట్స్ రాసుకొని చదివితే మంచి మార్కులు సాధించడానికి అవకాశాలు ఉంటాయి. సాంఘిక శాస్త్రం లో భారత దేశం, ప్రపంచపటం, తేదీలు, సంఘటనలు, సమకాలీన అంశాలతో ముడిపెట్టి చదవడం, కథల మాదిరిగా చదివితే మంచి మార్కులు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కష్టపడి చదివే కన్నా ఇష్టపడి చదివితే ఏ సబ్జెక్టైన సులభంగా కనిపిస్తుంది.
డా. ఎస్. విజయ భాస్కర్ 9290826988