Saturday, March 1, 2025

అత్యాచారాలకు అంతు లేదా?

- Advertisement -
- Advertisement -

పుణెలో అత్యంత రద్దీగా ఉండే బస్‌స్టేషన్‌లోనే ఒక బస్సులో 26 ఏళ్ల యువతిపై నేరచరితుడైన ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడటం ప్రజల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలను రగిలించింది. అత్యాచారం జరిగిన ప్రాంతానికి 100 మీటర్ల దూరంలోనే పోలీస్‌స్టేషన్ ఉండటం గమనార్హం. ఈ సంఘటన జరిగిన 75 గంటల్లో పోలీసులు నిందితుడిని పట్టుకోగలిగారు. జాతీయ మహిళా కమిషన్ కూడా ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించింది. దేశంలో మహిళలపై జరిగే నేరాల్లో అత్యాచారం నాల్గవ స్థానంలో ఉంది. కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం సంఘటన దేశం మొత్తమ్మీద ఎంత సంచలనం కలిగించిందో తెలిసిందే.

ఎన్‌సిఆర్‌బి నివేదిక ప్రకారం లక్ష జనాభాలో మహిళలపై నేరాల రేటు 66.4 శాతంగా ఉంది. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో 2021 వార్షిక నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 31,677 అత్యాచార కేసులు నమోదయ్యాయి. లేదా రోజుకు సగటున 86 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రాల వారీగా చూస్తే రాజస్థాన్‌లో అత్యధికంగా అత్యాచార కేసులు నమోదయ్యాయి. తరువాత స్థానాల్లో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. మెట్రో పాలిటన్ నగరాల్లో దేశరాజధాని ఢిల్లీలో 2021లో 1226 కేసులు నమోదయ్యాయి. జైపూర్‌లో అత్యధిక అత్యాచార రేటు (1,00,000 జనాభాకు 34) ఉంది. మెట్రో పాలిటన్ నగరాల్లో కోల్‌కతాలో అతి తక్కువ అత్యాచార కేసులు నమోదయ్యాయి. అతి తక్కువ అత్యాచార రేటు ఉంది. దేశంలో అత్యధిక లైంగిక హింస కేసులు ఢిల్లీలోనే జరిగాయని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఒకరు పేర్కొనడం గమనార్హం. 2022 లో ఢిల్లీలో మహిళలపై 14,247 కేసులు నమోదయ్యాయి.

గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, లైంగిక వేధింపులు లేదా గృహ హింసకు సంబంధించి కేసు నమోదు చేయించడానికి మహిళలు మగ బంధువు తోడు లేకుండా పోలీస్‌స్టేషన్‌కు కూడా రావడంలేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో మహిళలపై అత్యాచారాలు సాగుతున్నా కేసులు సరిగ్గా నమోదు కావడం లేదని పోలీస్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. దేశంలో మహిళల నేరాల సంఖ్య కొవిడ్ కాలం 2020లో తక్కువగా నమోదయ్యాయి. 2019లో 4.05 లక్షల కేసులు నమోదు కాగా, వాటి సంఖ్య 2020లో 3.05 లక్షలు మాత్రమే నమోదు కావడం గమనార్హం. దేశంలోని రాష్ట్రాల్లో అసోంలో ఏడాది క్రితం పరిశీలిస్తే అక్కడ బిజెపి అధికారంలోకి వచ్చిన మొదట్లో ఏడాదికి 3 వేల చొప్పున అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో 201621 మధ్య కాలంలో ఏటా సుమారు 3 వేల అత్యాచార కేసులు నమోదయ్యాయి. 2017 లో 3544 కేసులు, 2018లో 9296, 2019లో అత్యధికంగా 3946 కేసులు నమోదయ్యాయి. 200124 మధ్యకాలంలో మొత్తం 40 వేల రేప్ కేసులు నమోదయ్యాయి.

కొవిడ్ మహమ్మారి ప్రాణభయంతో పెరిగిన భౌతిక దూరం మహిళలను కొంతవరకు రక్షించిందని అనుకోవాలి. కొవిడ్ బాగా తగ్గుముఖం పట్టిన తరువాత 2021లో మళ్లీ మహిళలపై నేరాలు పెరిగాయి. 2020 లో ఇవి 8.3% వరకు తగ్గగా, 2021లో 15.3 శాతానికి పెరిగాయి. మహిళలపై నేరాల పెరుగుదలలో ఎక్కువగా గృహహింస కేసులే అత్యధికంగా కనిపిస్తున్నాయి. పురుషాధిక్యత బుసకొట్టడం వల్లనే ఇలా జరుగుతోంది. మహిళల్లో ఇప్పటికీ సరిగ్గా చదువుకోని వారు ఉన్నారు. అలాగే సంప్రదాయ చెరలో బందీలవుతున్నవారు ఉన్నారు. దీనికితోడు ఆర్థికంగా స్వతంత్రత లేనివారు ఎక్కువే. సంప్రదాయాల పేరిట, ఆచారాల పేరిట, తమపై సాగుతున్న అణచివేతను ఎదిరించాలనే సాహసం కూడా మహిళలకు శాపంగా మారుతోంది. ఆధునిక భారత రాజ్యాంగం ఆమెకు ప్రసాదించిన స్వేచ్ఛ, సమానత్వాలు అక్కరకు రాకుండాపోతున్నాయి. ఈమేరకు రూపొందించిన చట్టాలు, మహిళా పోలీస్ స్టేషన్లు, హెల్ప్‌లైన్లు పేరుకే ఉంటున్నాయి తప్ప మహిళలకు తగినంతగా రక్షణ కల్పించలేకుంటున్నాయి.

భర్తలు, అత్తమామ లు, బంధువులు, ఎంత రాసిరంపానపెడుతున్నా సహనశీలి మహిళ భరిస్తోందే తప్ప ఎదిరించడానికి ముందుకు రావడం లేదు. ఈ విధమైన గృహ హింస కేసులు వెలుగులోకి అంతగా రావడం లేదు. ఈ కేసులు 2019లో 30.9 శాతంగా ఉండగా, 2020లో 30% వరకే నమోదయ్యాయి. 2021లో 31.8% నమోదయ్యాయి. మహిళ తన సమభాగస్వామిగా పరిగణించే సంస్కారం పురుషుల్లో ఇంకా అలవడడం లేదు. మహిళలపై గృహహింస తరువాత స్థానాన్ని అత్యాచార యత్నంలో దాడులకు దిగడం, అత్యాచారాలు, కిడ్నాప్‌లు ఆక్రమించుకుంటున్నాయి. ఆరేళ్లలోపు బాలికలపై అత్యాచార సంఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి.

పిల్లలపై నేరాలు 2021లో 16% పెరిగాయి. మరోవైపు కిడ్నాప్, అపహరణ కేసుల్లో 18 సంవత్సరాలు నిండిన వారు ఎక్కువగా ఉన్నట్టు రికార్డులు చెబుతున్నాయి. ఇప్పటివరకు 1525 కేసులు నమోదు కాగా, 1251 మంది 18 ఏళ్లలోపు వయసు ఉన్నవారే కిడ్నాప్‌కు గురవుతున్నారు. ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసుల్లో 82% మైనర్లు బాధితులుగా ఉంటున్నారు. 2023లో 1877 కేసులు నమోదు కాగా, 2024లో 2257 కేసులు నమోదయ్యాయి. హ్యూమన్ రైట్స్ వాచ్ అధ్యయనం ప్రకారం దేశంలో ప్రతి సంవత్సరం 7200 మంది మైనర్లు 1,00,000 మంది మైనర్లలో 1.6 మంది అత్యాచారానికి గురవుతున్నారని అంచనాగా తేలింది.

వీరిలో దాడులను నివేదించే బాధితులు పోలీసుల నుంచి దుర్వినియోగం, అవమానాలకు గురవుతున్నామని ఆరోపించారు. దేశంలో మైనర్ బాలికలను వ్యభిచారంలోకి దించే సంఘటనలు కూడా చాటుమాటుగా సాగుతున్నాయి. ఈ కారణంగా బాధితులైన వారు జీవితాంతం అత్యాచార బాధలను అనుభవిస్తున్నారు. ఎన్ని చట్టాలున్నా మితిమీరిపోతున్న అత్యాచారాలకు అడ్డుకట్ట ఎలా అన్న ప్రశ్న అందర్నీ ఆందోళన కలిగిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News