హైదరాబాద్: అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగిన ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత ఏ సినిమాకి కూడా బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కానీ, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాకు మాత్రం టికెట్ ధరల పెంపునకు అనుమతి లభించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం తెలంగాణలో విడుదలయ్యే సినిమాలకు బెనిఫిట్ షో, స్పెషల్ షో, ప్రీమియర్ షోలకు అనుమతిని నిరాకరించింది. అంతేకాక.. 16 సంవత్సరాల లోపు పిల్లల్ని అన్నీ షోలకు ఉత్తర్వుల్లో పేర్కొంది. ముందుగా పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది టికెట్ ధరల పెంపును కోర్టు దృష్టికి తీసుకువెళ్లగా.. ప్రభుత్వ తరుఫు న్యాయవాది ధరల పెంపును రద్దు చేసినట్లు తెలిపారు. వాదోపవాదాలు విన్న న్యాయస్థానం ప్రేక్షకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బెనిఫిట్ షో, స్పెషల్ షో, ప్రీమియర్ షోలకు అనుమతిని నిరాకరిస్తూ.. తదుపరి విచారణను మార్చి 17వ తేదీకి వాయిదా వేసింది.