న్యూఢిల్లీ : మణిపూర్‌లో ఈ నెల 8 నుంచి అన్ని మార్గాల్లో ప్రజలు స్వేచ్ఛగా సంచరించేలా చూడాలని భద్రతా దళాలను కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా శనివారం ఆదేశించారు. అవరోధాలు సృష్టించేవారిపై కఠిన చర్య తీసుకోవాలని కూడా కేంద్ర మంత్రి కోరారు. మణిపూర్‌లో భద్రత పరిస్థితిపై ఢిల్లీలో నిర్వహించిన సమీక్షా సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహిస్తూ, ఆ రాష్ట్రంలో చిరకాల ప్రశాంతత పునరుద్ధరణకు కేంద్రం పూర్తిగా కట్టుబడి ఉందని, ఈ విషయమై అవసరమైన సహాయాన్ని అందజేస్తున్నదని తెలియజేశారు. ఆ ఈశాన్య రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన తరువాత నిర్వహించిన తొలి సమీక్షా సమావేశం అది. 2023 మే నుంచి మణిపూర్‌లో జాతుల మధ్య హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
హింసాకాండలో 250 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు, ఈ నెల 8 నుంచి మణిపూర్‌లో అన్ని రోడ్లపై ప్రజలు స్వేచ్ఛగా సంచరించేలా చూడాలని హోమ్ శాఖ మంత్రి ఆదేశించినట్లు అధికార ప్రకటన వెల్లడించింది. రోడ్లపై అవరోధాలు సృష్టించేవారిపై కఠిన చర్య తీసుకోవాలని కూడా ఆయన ఆదేశించారు. మణిపూర్‌లో భద్రత పరిస్థితిపై అమిత్ షా సమీక్ష నిర్వహించినట్లు, రాష్ట్రంలో మొత్తంమీద శాంతి భద్రతల పరిస్థితిపై సమగ్ర వివరణ ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మణిపూర్ అంతర్జాతీయ సరిహద్దు పొడుగునా నిర్దేశిత ప్రవేశ ప్రదేశాలకు రెండు వైపుల కంచె వేసే పనిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అమిత్ షా ఆదేశించారు.
మణిపూర్‌ను మాదకద్రవ్యాల రహితం చేసేందుకు మాదకద్రవ్యాల వాణిజ్యంలో పాత్ర ఉన్న మొత్తం నెట్‌వర్క్‌ను నిర్మూలించాలని హోమ్ శాఖ మంత్రి కోరారు.మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా, కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ డెకా, సైనిక దళాల డిప్యూటీ చీఫ్, ఆర్మీ ఈస్ట్రన్ కమాండ్ కమాండర్ కూడా సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ రాజీనామా చేసిన తరువాత ఫిబ్రవరి 13న రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన విషయం విదితమే, 2027 వరకు కాలపరిమితి ఉన్న రాష్ట్ర శాసనసభను సుప్త చేతనావస్థలో ఉంచారు. ప్రతి ఒక్కరూ అక్రమ, చోరీ ఆయుధాలను అప్పగించాలని గవర్నన్ ఫిబ్రవరి 20న అల్టిమేటమ్ జారీ చేసిన తరువాత భద్రత పరిస్థితిపై సమీక్షా సమావేశం నిర్వహించారు.