Sunday, March 2, 2025

5న అఖిల పక్ష భేటీకి మేము రాము

- Advertisement -
- Advertisement -

చెన్నై : నియోజకవర్గాల పునర్విభజన అంశంపై ఈ నెల 5న తలపెట్టిన అఖిల పక్ష సమావేశానికి తమ పార్టీ హాజరు కాదని తమిళనాడు బిజెపి అధ్యక్షుడు కె అన్నామలై శనివారం ప్రకటించారు. నియోజకవర్గాల పునర్విభజనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ‘ఊహాజనిత భయాలను’ వ్యాప్తి చేయజూస్తున్నారని అన్నామలై ఆరోపించారు. అధికారిక ప్రకటన కూడా రాకముందే స్టాలిన్ నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని అపార్థం చేసుకున్నారన్నది తమ పార్టీ నిశ్చితాభిప్రాయమని, ‘దాని గురించి ఊహాజనిత భయాలను వ్యాప్తి చేసేందుకు, ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు చెప్పేందుకు’ అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారని స్టాలిన్‌కు రాసిన లేఖలో అన్నామలై పేర్కొన్నారు. ఏ రాష్ట్రాన్నీ ‘తక్కువ చేయడం జరగదు’ అని ఆ ప్రక్రియ దామాషా ప్రాతిపదికపై జరుగుతుందని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా విస్పష్ట ప్రకటన చేశారని స్టాలిన్ దృష్టికి అన్నామలై తీసుకువచ్చారు. త్రిభాషా విధానానికి మద్దతుగా తమ పార్టీ 5న సంతకాల ఉద్యమం ప్రారంభిస్తుందని స్టాలిన్‌కు అన్నామలై తెలియజేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News