తాటాకు చప్పుళ్లకు భయపడను కేంద్ర మంత్రులను
బెదిరించాననడం దిగజారుడుతనమే హామీల
అమలుపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలి ట్రిపుల్
ఆర్ మంజూరు చేయించిందే నేను : కిషన్‌రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తన 14 నెలపాలనలో ఇచ్చిన హామీలైన వందరోజుల్లో ఆరు గ్యారంటీ లు, మరో 320 సబ్ గ్యారంటీల అమలులో పూర్తిగా వైఫల్యం చెం దిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆరోపించారు. ముందు ఇచ్చిన హామీలు అమలు చేసే లా దృష్టి పెట్టాలని సూచించారు. హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్‌ను అమలు చేయడం మంచిది కాదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హితవు పలికారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై అన్ని వర్గాల ప్రజల్లో చోటు చేసుకున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టిని మళ్లించేందుకు తనపై ఎదురుదాడి, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కిషన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర బిజెపి కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీని, తనను బ్లాక్ మెయిల్ చేయడం, బెదిరించినంత మాత్రాన, అబద్ధాలు మాట్లాడినంత మాత్రాన రేవంత్‌రెడ్డిపై ఉన్న వ్యతిరేకత పోదన్నారు. నేడు తెలంగాణ ప్రజలు ఆయన మాటలు వినే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, సీఎంపై అసంతృప్తి ఆయన మాట్లాడుతున్న విధానంలో స్పష్టంగా కనిపిస్తుందని విమర్శించారు. గత పదేళ్లుగా పలు కేంద్ర పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వ సహకారం అందించకపోవడం వల్ల అమలు చేయలేదని వివరించారు.
కేంద్ర మంత్రులను బెదిరించాననడం దిగజారుడుతనమే
కేంద్రమంత్రులను తాను బెదిరిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. మూడున్నరేళ్లుగా అంకితభావంతో తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తున్నట్లు తెలిపారు. జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, కేంద్ర కార్యాలయాలు, విద్యాలయాలు, మౌలిక సదుపాయాలపై కేంద్రానికి వివరించి అభివృద్ధిని దరిచేర్చేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. తాను తెలంగాణ అభివృద్ధిపై అనేక ప్రాజెక్టులపై ప్రజలకు వివరిస్తూనే ఉన్నానని కిషన్‌రెడ్డి చెప్పారు. గత పదేళ్లుగా తెలంగాణలో ఏం చేశామనే విషయం ఇదివరకే ప్రజలంతా చూశారన్నారు. రూ.10 లక్షల కోట్లతో చేసిన అభివృద్ధిని రెండున్నర గంటలపాటు ఆర్టీసీ కళ్యాణ మండపం, పింగళి వెంకట్రామ్‌రెడ్డి భవన్‌లో సమావేశం నిర్వహించి వివరించామన్నారు.
మీ వైఫల్యాలను నా మీద రుదొద్దు
దేశంలో ఏడు టెక్స్ టైల్స్ పార్కులు వస్తే ఒకటి తెలంగాణకు, ఇండస్ట్రియల్ పార్కులు వస్తే ఒకటి తెలంగాణకు, కోచ్ ఫ్యాక్టరీ, రీజినరల్ రింగ్ రోడ్డు వంటి కీలకమైన ప్రాజెక్టులను తీసుకువచ్చానని అన్నారు. నైతిక విలువలతో కూడిన రాజకీయాలకు తాను ప్రాధాన్యతనిస్తానని అన్నారు. అంతేగానీ ప్రాజెక్టులు అడ్డుకోవడం లాంటివి కూడా ఊహించడం తప్పే అవుతుందన్నారు. తాను చిన్నప్పటి నుంచి అయినా ఒక సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసేవాడినని, తాటాకు తప్పుళ్లకు భయపడబోనని అన్నారు. తనమీద తప్పు రుద్దితే ఊరుకోబోనన్నారు. దేశం ప్రజలకు హామీ ఇచ్చిన మేరకు వాటికి కట్టుబడి ఉండి వాటిని అమలు చేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభయహస్తం పేరుతో మేనిఫెస్టోను ప్రకటించిందని ఇవన్నీ అమలు చేయాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇవన్నీ అమలు చేయకుండా తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.
ప్రజల సర్టిఫికెట్ చాలు..రేవంత్ సర్టిఫికెట్ అవసరం లేదు
గతంలో తనకు రేవంత్‌రెడ్డి రాసిన లేఖలో రూ.1,66,569.31 కోట్ల నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రానికి కూడా ఇంత పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిన పరిస్థితి లేదన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు ఎన్ని నిధులు కేటాయించారో? చెప్పాలని నిలదీశారు. ఈ ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా హామీ ఇచ్చిందా? మేనిఫెస్టోలో పెట్టిందా? అని నిలదీశారు. సీఎం మాటలకు అధికారులే నవ్వుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. సీఎం ఇచ్చిన వివరాలను ఆయా మంత్రులవారీగా విభజించి జనవరి 23, నితిన్ గడ్కరీ, అశ్వనీ వైష్ణవ్, మనోహర్ లాల్ కట్టర్‌లకు పంపించామని అన్నారు. ఇంత పద్ధతి ప్రకారం తాము పనిచేస్తామన్నారు. వాస్తవం ఈ రకంగా ఉంటే తాను ప్రాజెక్టులను అడ్డుకుంటున్నామని వితండవాదం చేసే ప్రయత్నాలకు తెరతీశారన్నారు. కేవలం రెండున్నర నెలల్లో ఇంత పెద్ద ప్రాజెక్టులు మంజూరు అవుతాయా? అని ప్రశ్నించారు. రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు మంజూరు చేయించిందే తానని అన్నారు. ఈ విషయంలో తాను కేసీఆర్‌కు కూడా అనేక లేఖలు రాశానన్నారు. భూసేకరణపై 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం అందించాలని అనేకసార్లు విన్నవించిన విషయాన్ని గుర్తు చేశారు. సీఎం రేవంత్ కు కూడా లేఖ రాశామన్నారు. రింగ్ రోడ్డుకు రాష్ట్ర ప్రభుత్వం వందకోట్లు కేటాయించిందన్నారు.
త్వరలో మంజూరు కాబోతుందన్నారు. తొలిదశ పనులపై కేబినెట్ ఓకే చెప్పనుందని, దీనికి సీఎం సర్టిఫికెట్ అవసరం లేదని, తెలంగాణ ప్రజల సర్టిఫికెట్ ఉంటే చాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఫేజ్ 2 రింగ్ రోడ్డును నిర్మించుకుంటామని అన్ని పత్రికల్లోనూ ప్రకటనలు కూడా ఇచ్చారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దీనితో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. ఇన్ని లోపభూయిష్ట విధానాలకు పాల్పడుతూ తమపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే మెట్రో 2 ఫేజ్ కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించిందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రాగానే కేంద్రానికి లేఖ రాసి మెట్రో సమగ్రంగా లేదని 2024 జనవరి 4న ఢిల్లీకి హర్దిప్ సింగ్ పూరిని కలిసి కొత్త ప్రతిపాదన విషయాన్ని తెలిపారన్నారు. 2024 అక్టోబర్ 26 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్లానింగ్, ప్రణాళిక కేంద్రానికి అందలేదన్నారు. ముస్లిం రిజర్వేషన్ వ్యతిరేకతపై ఆంధ్రలో స్వతంత్రంగా బీజేపీ ప్రభుత్వం వస్తే రద్దు చేస్తామని అన్నారు. మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కలుపుతామని ఆ విషయానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ముస్లింలకు ఇప్పకే ఈబీసీ రిజర్వేషన్లు కల్పించామన్నారు. హైకోర్టు తీర్పును గౌరవించడం ఏ రకంగా తప్పు అవుతుందో? సీఎం రేవంత్ చెప్పాలని నిలదీశారు.