దుబాయి: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం జరిగే గ్రూప్‌ఎ చివరి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. ఇరు జట్లు రెండేసి విజయాలతో ఇప్పటికే సెమీ ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకున్నాయి. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలువాలనే పట్టుదలతో ఉన్నాయి. అంతేగాక రానున్న సెమీస్ మ్యాచ్‌కు దీన్ని రిహార్సల్‌గా ఉపయోగించుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖాయం కావడంతో రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వాలనే వ్యూహంతో కనిపిస్తున్నాయి.
ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి కల్పించినా ఆశ్చర్యం లేదు. రోహిత్ తప్పుకుంటే శుభ్‌మన్ గిల్ జట్టు సారథ్య బాధ్యతలను నిర్వర్తిస్తాడు. సీనియర్ బౌలర్ మహ్మద్ షమి కూడా ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశాలు కనిపించడం లేదు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా షమి గాయానికి గురయ్యాడు. గాయం నేపథ్యంలో అతనికి ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇవ్వాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రెండు జట్లు కూడా సమతూకంగా కనిపిస్తున్నాయి. సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి ఫామ్‌లోకి రావడం టీమిండియాకు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. దాయాది పాక్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో కోహ్లి అజేయ శతకం సాధించాడు. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్య తదితరులతో భారత్ చాలా పటిష్టంగా ఉంది. అంతేగాక ఇటీవల సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఎదురైన ఘోర పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే లక్షంతో టీమిండియా పోరుకు సిద్ధమైంది.
ఆత్మవిశ్వాసంతో..
మరోవైపు న్యూజిలాండ్ మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఇటీవల భారత్, పాకిస్థాన్‌లతో జరిగిన సిరీస్‌లలో జయకేతనం ఎగుర వేసి జోరుమీదుంది. మరోసారి భారత్‌ను ఓడించాలనే పట్టుదలతో ఉంది. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లపై అలవోక విజయాలు సాధించిన కివీస్ హ్యాట్రిక్ గెలుపుపై కన్నేసింది. టామ్ లాథమ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిఛెల్, గ్లెన్ ఫిలిప్స్, డెవోన్ కాన్వే, విలియమ్సన్, విల్ యంగ్ తదితరులతో కివీస్ చాలా బలంగా ఉంది. అంతేగాక ఓరౌర్కే, బ్రేస్‌వెల్, జేమీసన్, సాంట్నర్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా జట్టులో ఉన్నారు. దీంతో కివీస్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గాబరిలోకి దిగుతోంది.