Tuesday, March 4, 2025

 తలసరి ఆదాయం పెరిగితేనే పురోగతి

- Advertisement -
- Advertisement -

విదేశాలతో దౌత్యసంబంధాలు, వాణిజ్య వ్యూహాలు వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థల బలోపేతానికి సహకరిస్తున్నాయి. కొన్ని దేశాలు స్వతంత్రంగా ఎదుగుతున్నాయి. కొన్ని దేశాలు ఇతర దేశాల బలహీనతలను ఆసరాగా చేసుకుని, ఆయుధాల వ్యాపారం చేస్తూ, ఇతర దేశాల సంపదను కొల్లగొడుతూ, తమ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచుకుంటున్నాయి. భారతదేశం అనాదిగా విదేశీయుల దౌర్జన్యానికి, దోపిడీకి గురవుతున్నా, నిరంతరం న్యాయంగా జీవించడానికే ప్రాధాన్యతనిస్తున్నది. స్వాతంత్య్రానికి ముందు, స్వాతంత్య్రం తర్వాత భారత ఆర్థిక స్థితిగతుల్లో ఎన్నో మార్పులు సంతరించుకున్నాయి. ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోని బలమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మారింది. మూడవ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని కేంద్ర ప్రభుత్వ ప్రయత్నించడం శుభపరిణామం.

అయితే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల విషయంలో భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించడంవలన భారత్ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడుతుందోనని పలువురు మేధావులు ఆందోళన చెందుతున్నారు. అమెరికా రెసిప్రోకల్ టారిఫ్‌ల వలన భారత్‌పై ఎలాంటి ప్రభావం ఉండబోదని ఆర్థిక విశ్లేషకులు గణాంకాలతో సహా వివరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక మందగమనం వలన అనేక దేశాలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో భారత్ కూడా ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభం చవిచూస్తున్న తరుణంలో భారత్ ఆర్థికంగా ఎదగడం ఎలా సాధ్యమయిందో, ఏయే రంగాలు అత్యధికంగా ప్రజలకు ఉపాధి కలిగిస్తున్నాయో, భవిష్యత్తులో భారత్‌ను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలో కూలంకషంగా చర్చించాలి.భారతదేశంలో అపారమైన సహజ వనరులున్నాయి. ఖనిజ సంపదకు లోటు లేదు. అపారమైన జల సంపద ఉంది. ఎన్నో నదులకు భారతదేశం పుట్టినిల్లు. భారత దేశంలో ఎన్నో పర్యాటక ప్రాంతాలున్నాయి. ఆదాయ వనరులున్నాయి.

హిందూ మహా సముద్రం అరేబియా సముద్రం, బంగాళాఖాతం సరిహద్దులుగా 7500 కి.మీ పొడవైన సముద్ర తీరప్రాంతం మనకుంది. మానవ వనరులకు కొదవలేదు. విద్యావంతులకు కొరత లేదు. యువతరం భారతదేశానికి పెద్ద వరం. భిన్నమైన భౌగోళిక స్వరూపాలతో, పచ్చని వ్యవసాయ క్షేత్రాలతో, దాదాపుగా ప్రపంచంలో పండే పంటలన్నీ మన దేశంలో పండుతాయి. అభివృద్ధికి అవసరమైన అన్ని అనుకూలాంశాలు భారతదేశంలో ఉన్నాయి. అయితే పరదాస్యం నుండి విముక్తి పొంది 78 సంవత్సరాలకు దగ్గరవుతున్నా, ఆర్థికంగా బలోపేతమవుతున్నా ఇంకా భారతదేశం వర్ధమాన దేశంగానే పరిగణింపబడడంలో ఎలాంటి ఔచిత్యం లేదు. అణుశక్తిలోను, అంతరిక్షంలోను భారత్ ముందంజలో ఉంది. మన ఆర్థిక వ్యవస్థ విలక్షణమైన శైలిని కలిగి ఉంది. భారతదేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది. ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో కొనసాగుతున్న భారత ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ సంస్థల కన్నా, ప్రైవేటు సంస్థలే పటిష్ఠమైన చర్యలతో లాభాలను ఆర్జిస్తున్నాయి. భారతదేశం స్థూల జాతీయోత్పత్తిలో సేవారంగం, పరిశ్రమలు, తయారీ రంగం, వ్యవసాయం కీలకభూమిక పోషిస్తున్నాయి.

భారతదేశం స్థూలజాతీయోత్పత్తిలో వ్యవసాయరంగం వాటా తగ్గుతున్నప్పటికీ, నేటికీ భారతదేశంలోని సుమారు సగం మంది జనాభాకు వ్యవసాయమే ఆధారంగా నిలవడం గమనార్హం. బ్యాంకింగ్, టెక్నాలజీ, హోటల్స్, టెలీ కమ్యూనికేషన్ మొదలైనవి సేవా రంగానికి సంబంధించినవి. భారత జిడిపిలో వ్యవసాయం సుమారు 18% కలిగి ఉంది. భారత ఆర్థిక వ్యవస్థలో 13 నుండి 14% వాటాతో తయారీ రంగం గణనీయమైన భూమిక పోషిస్తున్నది. వచ్చే పది సంవత్సరాల్లో భారత్ జిడిపిలో తయారీ రంగం భాగస్వామ్యం 21 శాతానికి చేరుకుంటుందని ఒక అంచనా.

ప్రపంచదేశాలన్నీ ఆర్థికంగా కుదేలైపోతున్న సందర్భంలో భారత్ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడం విశేషం. జాతీయోత్పత్తి గణనీయంగా పెరిగి భారత ఆర్థ్ధిక వ్యవస్థ 4.27 ట్రిలియన్ డాలర్లకు చేరుకుని జపాన్‌ను అధిగమించి, సమీప భవిష్యత్తులో 5 ట్రిలియన్ల యుఎస్ డాలర్లకు చేరడం కష్టసాధ్యంకాదని ఆర్థిక పండితుల అంచనా. దశాబ్దకాలం క్రితం వరకు 10వ స్థానంలో ఉన్న భారత ఆర్థ్ధిక వ్యవస్థ పటిష్ఠవంతమై త్వరలో 5 ట్రిలియన్ల డాలర్ల మార్కును చేరుకుని మూడవ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతుందని, 2030 నాటికి ఏడు ట్రిలియన్ల డాలర్లతో అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలకు దీటుగా మారుతుందనే అంచనాలున్నాయి. భారతదేశం ప్రస్తుతం అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ దేశాలతో పోటీపడుతూ, ప్రపంచంలో బలమైన ఆర్థిక వ్యవస్థగా ఏర్పడడం ముదావహం. ఐఎంఎఫ్ డేటా ప్రకారం ఆర్థికపరంగా భారత్ తర్వాత స్థానాలను యునైటెడ్ కింగ్ డమ్, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, బ్రెజిల్ దేశాలు ఆక్రమించాయి. జిడిపి వృద్ధిరేటు దేశ ఆర్థికవ్యవస్థ పటిష్టతను సూచిస్తున్నది. అమెరికా తలసరి ఆదాయం 89 వేల డాలర్లు కాగా, భారత్ తలసరి ఆదాయం కేవలం 2936 యుఎస్ డాలర్లు (2 లక్షల 55 వేల రూపాయలు)గా అంచనా వేయబడింది. లగ్జెంబర్గ్, సింగపూర్, ఖతార్, ఐర్లాండ్, నార్వే, స్విట్జర్లాండ్‌లు అధిక తలసరి ఆదాయంతో ధనిక దేశాలుగా పేరొందాయి.

రూపాయి విలువలో క్షీణత ఆందోళన కలిగిస్తున్నది. బ్రిక్స్ దేశాలన్నీ కలసి స్వంత కరెన్సీ రూపకల్పన చేయాలనుకున్నా, ట్రంప్ ఈ దేశాలపై టారిఫ్ పెంచుతూ, తన అక్కసును వెళ్ళగక్కడం ద్వారా బ్రిక్స్ కూటమి ప్రస్తుతానికి తమ ప్రతిపాదనను విరమించుకున్నట్టే కనిపిస్తున్నది. భారత దేశం ఆర్థికంగా బలోపేతమవుతున్నట్టు కనిపించినా, తలసరి ఆదాయం ఇప్పుడున్న స్థాయిని దాటి రెట్టింపు కాగలిగితేనే దేశం వాస్తవంగా అభివృద్ధి చెందినట్టుగా పరిగణించాలి. పేదరికాన్ని రూపుమాపలేని ఆర్థిక గణాంకాల పెరుగుదల వలన ప్రయోజనం శూన్యం. తలసరి ఆదాయాన్ని బట్టి చూస్తే గతంలో కంటే దేశం ఆర్థికంగా బలంగా ఉన్న మాట వాస్తవం. గతంలో కంటే దేశంలో విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపడిన మాట కూడా వాస్తవమే. ప్రజల ఆర్థిక స్థితిగతుల్లో గణనీయమైన మార్పు వచ్చినమాట సత్యదూరం కాదు. అయితే బతుకు బండి ఎలాగోలా సాగించడం కాదు. ప్రజల జీవన ప్రమాణాల స్థాయి పెరగాలి. వాస్తవ పరిశీలనా దృక్ఫథంతో విశ్లేషిస్తే, భారతదేశం ఇంకా పేదరికంలోనే ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. విచ్చలవిడిగా పెరుగుతున్న అవినీతి అభివృద్ధి ఫలాలను ప్రజలకు దూరం చేస్తున్నది. కొంతమంది వ్యక్తులు ఆర్థికంగా బలపడినంత మాత్రాన అది అభివృద్ధి కాబోదు.

దేశ జిడిపి పెరుగుదలలో అవినీతిపరుల భాగస్వామ్యాన్ని, అడ్డదిడ్డంగా పెరుగుతున్న కార్పొరేట్ దిగ్గజాల సంపదను వ్యవకలనం చేస్తే నిజమైన దేశఆర్థిక స్వరూపం నిర్ధారణ అవుతుంది. స్వాతంత్య్రం వచ్చేనాటికి భారతదేశంలో తలసరి ఆదాయం కేవలం 249 రూపాయలుగా ఉండేది. ఇది పెరుగుతూ 2000వ సంవత్సరానికి సుమారు 20 వేల రూపాయలకు పెరిగింది. 2014-15 వ ఆర్థిక సంవత్సరంలో సుమారు 87 వేల రూపాయలుగా ఉన్న భారత దేశ తలసరి ఆదాయం రెండున్నర లక్షలకు దాటి, గతంలో కంటే దాదాపు రెట్టింపయింది. ప్రపంచ ప్రజల తలసరి ఆదాయం గత సంవత్సరం చివర్లో వెలువడ్డ గణాంకాల ప్రకారం ప్రకారం 13,800 డాలర్లు కాగా, ప్రస్తుత ఇండియా తలసరి ఆదాయం 2936 యు.ఎస్ డాలర్లు. దేశం ఆర్థికంగా బలోపేతమైనంత మాత్రాన ప్రజలంతా ఆర్ధికంగా ఎదిగినట్టుగా ఊహించుకోవడం సరికాదు. సగటు ఆదాయం వ్యక్తుల నిజమైన ఆదాయం కాదు కదా? భారత దేశ ప్రస్తుత సగటు కార్పొరేట్ దిగ్గజాల సంపద వందల బిలియన్ల డాలర్లకు చేరుకుంటున్నది.

ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న కుబేరుల సంపదను దేశ సంపదగా భావించుకోవడం అసహజంగా లేదా? ఏ దేశమైనా ఆర్ధికంగా అభివృద్ధి చెందాలంటే ప్రజలందరి ఆదాయం వాస్తవంగా పెరగాలి. ఆర్థిక అంతరాలు కనీస స్థాయికి తగ్గాలి. దేశంలో పేదరికం పోవాలి. అందరికీ ఉపాధి అవకాశాలు లభించాలి. పరిశుభ్రమైన తాగునీరు, పౌష్టికాహారం లభించాలి. ప్రజల ఆరోగ్యం మీద దేశ అభివృద్ధి ఆధారపడి ఉంటుందన్న విషయం మరువరాదు.ప్రజల అనారోగ్యం దేశ ఆర్థిక అభివృద్ధికి ఆటంకం. భారతదేశం ప్రధానంగా వ్యవసాయిక దేశం కాబట్టి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా లాభాలను ఆర్జించాలనుకోవడం అర్థరహితం. ప్రజలకు ఆధిక సంఖ్యలో ఉపాధిని కల్పిస్తున్న వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తూనే, టెక్నాలజీ విషయంలో ఇతర దేశాలకు దీటుగా ఎదగాలి. ప్రపంచాన్ని శాసించగల స్థాయిలో ఉన్నా భారత్ ఇంకా ఇతర దేశాల దిగుమతులపై, యంత్ర పరికరాలపై ఆధారపడడంలో ఔచిత్యం లేదు. ఈ విషయంలో భారత్ ప్రపంచంలోని ధనిక దేశాల ఆర్ధిక తీరుతెన్నులను సమీక్షించుకుని, ప్రజల కొనుగోలు శక్తిని పెంచి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రయత్నించాలి. ప్రజలపై భారం పడకుండా, దేశాభివృద్ధికి తోడ్పడే ఆర్థిక విధానాలపై దృష్టి పెట్టాలి.

సుంకపల్లి సత్తిరాజు

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News