హిసార్: దేవతలా చూసుకోవాల్సిన కన్నతల్లిని ఆస్తి కోసం చిత్ర హింసలు పెట్టింది ఆ కూతురు. ఆమె ఇంట్లోనే ఆమెను నిర్భందించి.. ‘నీ రక్తం తాగుతా’ అంటూ కొరుకుతూ.. కొడుతూ.. నానా విధాలుగా నరకం చూపించింది. హర్యానాలోని హిసార్‌లో జరిగిన ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. దీంతో కుమారుడు అమర్‌దీప్ సింగ్ ఫిర్యాదు మేరకు సదరు కూతురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అమర్‌దీప్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం హిసార్‌కి చెందిన రీటాకు రెండేళ్ల క్రితం సంజయ్ పునియాతో వివాహం జరిగింది. అయితే సంజయ్‌కి ఎలాంటి ఆదాయం లేకపోవడంతో రీటా తన తల్లి నిర్మలా దేవి ఇంటికి వచ్చేసింది. తల్లి ఇంట్లో ఉంటూనే ఆస్తి కోసం ఆమెను హింసించడం ప్రారంభించింది. కురుక్షేత్రలో ఉండే ఆస్తులు అమ్మి రూ.65 లక్షలు రీటా సొంతం చేసుకొని.. ఇప్పుడు నిర్మల దేవి ఉంటున్న ఇంటిని కూడా సొంతం చేసుకొనేందుకే ఆమెను హింసిస్తుందని తెలుస్తోంది. అమర్‌సింగ్ సింగ్ ఫిర్యాదుతో పోలీసులు రీటాపై 115, 127(2), 296, 351, తల్లిదండ్రుల సంక్షేమం యాక్ట్‌లోని 24వ సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు.